ప్రమాదవశాత్తు కాలు జారి కేసీ కాలువలో పడి నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్న మనవడు, మనవరాలిని రక్షించేందుకు తన ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా కేసీ కెనాల్లోకి దూకి రక్షించేందుకు ప్రయత్నించిన నాయనమ్మ కూడా ప్రమాదంలో చిక్కుకుంది.
పగిడ్యాల (కర్నూలు) : ప్రమాదవశాత్తు కాలు జారి కేసీ కాలువలో పడి నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్న మనవడు, మనవరాలిని రక్షించేందుకు తన ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా కేసీ కెనాల్లోకి దూకి రక్షించేందుకు ప్రయత్నించిన నాయనమ్మ కూడా ప్రమాదంలో చిక్కుకుంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా పగిడ్యాలలో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. స్థానిక దేవనగర్ కాలనీకి చెందిన సుగుణమ్మ కేసీ కాలువలో బట్టలు ఉతకడానికి వెళ్లింది. ఈ క్రమంలో ఆమెతో పాటు మనవరాలు అనిత(7), మనవడు కృపావరం(10)లను వెంటబెట్టుకుని వెళ్లింది.
సుగుణమ్మ బట్టలు ఉతుక్కోవడంలో నిమగ్నమై ఉండగా మెట్లపై కూర్చున్న మనవరాలు అనిత, మనవడు కృపావరం ఆకతాయిగా నీళ్లలోకి దిగి నీటిప్రవాహాంలో చిక్కుకుని ప్రమాదానికి గురయ్యారు. ఇది గమనించిన వృద్ధురాలు ఇద్దరి పిల్లలను రక్షించేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున కేకలు వేస్తూ నీళ్లలోకి దూకి రక్షించే ప్రయత్నం చేసింది. అయితే ఇద్దరు పిల్లలు ఆమెను చుట్టేయడం వలన మునిగిపోసాగింది. అదే సమయంలో ఈతకు వచ్చిన భరత్, ఆంజనేయలు అనే యువకులు ఇది గమనించి వెంటనే కాలువలోకి దూకి వారిని రక్షించారు. ఆ యువకులు నీటిలో దూకేందుకు ఒక్క క్షణం ఆలస్యం చేసినా ముగ్గురి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయేవని ప్రత్యక్ష సాక్షులు వివరించారు.