రేపటి నుంచే మహా సంబరం
సాక్షి, హన్మకొండ: మహా జాతరకు ఘడియలు సమీపిస్తున్నాయి. ఎప్పుడెప్పుడా అంటూ భక్త కోటి ఎదురుచూసే అమ్మల జాతరకు ఇంకా మిగిలింది ఇరవై నాలుగు గంటలే.. సారలమ్మ రాకతో ప్రారంభమయ్యే మహాఘట్టానికి మేడారం ముస్తాబైంది. కన్నెపల్లి వెన్నెలమ్మ రాక కోసం భక్త జనం ఆరాటపడుతోంది. 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా పరిసరాలన్నీ కిటకిటలాడుతున్నాయి. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెలపైకి తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు మేడారం బాటపడుతున్నారు. కన్నెపల్లి, మేడారం, ఊరట్టం, రెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు గుడారాలతో నిండిపోయూయి.
కన్నెపల్లిలో సందడి
సారలమ్మ ఆలయం ఉన్న కన్నెపల్లిలో ఊరంతా తమ ఇళ్లను అలికి పండుగకు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఇళ్లకు సున్నాలు వేసుకుని సుందరంగా అలంకరించుకున్నారు. పండ క్కి వచ్చిన బంధువులతో వారిళ్లన్నీ కళకళలాడుతున్నాయి. కాగా, సారలమ్మ పూజారులు గత బుధవారం నుంచే సారలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో నిమగ్నమయ్యారు. బుధవారం జరిగే మహాఘట్టానికి సర్వం సిద్ధం చేస్తున్నారు.
మరోవైపు దేవాదాయశాఖ సైతం అమ్మల జాతరను విజయవంతం చేసేందుకు శాఖాపరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపట్టింది. భక్తుల సౌకర్యం కోసం రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన స్నానఘట్టాలు, నూతన వంతెన, కొత్త రోడ్లు తదితర పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. జాతర ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతల్లో సోమవారం నుంచి 14వేల మంది వివిధ శాఖల సిబ్బంది తలమునకలైపోయూరు. వాహనాల రద్దీ, వాణిజ్య సముదాయాలు, విద్యుత్ దీప కాంతులతో మేడారం పరిసర ప్రాంతాల్లో పండుగ సందడి నెలకొంది.