medram mahajatar
-
నేటి నుంచి మేడారంలో మినీ జాతర
-
తేల్చి చెప్పండి
మేడారం జాతర పనుల్లో లోపాలపై లోకాయుక్త ఆదేశం సాక్షి, హన్మకొండ: మేడారం జాతర సందర్భంగా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ), ఏటూరునాగారం ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన పలు పనులు వివాదాస్పదంగా మారాయి. దాంతో ఐటీడీఏ ఆధ్వర్యంలో చేపట్టిన పనులపై విచారణ చేపట్టాలని లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. జాతర సందర్భంగా చేపట్టిన అన్ని పనులకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలంటూ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్‌కు, గిరిజన సంక్షేమ శాఖకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదిక జూలై 7లోపు సమర్పించాలని ఆదేశించింది. లోకాయుక్త కొరడా.. మేడారం జాతర సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య అధికారి నేతృత్వంలో తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. ముందు గా టెండర్లు పిలిచిన పనులను మధ్య లో రద్దు చేసి.. ఆ వెంటనే అదే పనిని శాఖ తరఫున చేస్తామని పేర్కొన్నారు. కానీ కమిషన్లు తీసుకుని తమకు అనుకూలుడైన కాంట్రాక్టరుకు పనిని అప్పగించారనే ఆరోపణలు జాతర సందర్భంగా తీవ్ర దుమారం లేపాయి. అయినప్పటికీ అధికారులు తమ తీరును మార్చుకోలేదు. సమయం తక్కువగా ఉందని, భక్తులకు సౌకర్యాలు కల్పించాలంటూ పనులు చేయించారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా.. తాత్కాలిక ప్రాతిపదికపై పనిచేస్తున్న ఉద్యోగి (నాన్ మస్టర్ రోల్, ఎన్ఎమ్ఆర్)కు ఈ పనుల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. కేవలం పది లక్షల రూపాయల లోపు వ్యయం అయ్యే పనులనే తాత్కాలిక ఉద్యోగి చేపట్టాలి. కానీ, అక్కడ రూ.4 కోట్లకు పైగా వ్యయంతో చేసిన పనుల పర్యవేక్షణ బాధ్యతతో పాటు మెజర్మెంట్ రికార్డుల నిర్వహణ సైతం సదరు ఎన్ఆర్ఎం ఉద్యోగికే అప్పగించడం అప్పట్లో చర్చకు దారితీసింది. ఐటీడీఏ అవలంభిస్తున్న తీరుపై పత్రికల్లో వరుసగా కథనాలు సైతం వచ్చాయి. దాంతో జాతర ముగిసిన వెంటనే బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి ‘సాక్షి’ కథనాలతో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు స్పందించిన లోకాయుక్త.. గిరిజన సంక్షేమ శాఖ తరఫున చేపట్టిన పనులపై విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలంటూ ఇంజనీరింగ్ శాఖ పర్యవేక్షణాధికారికి ఆదేశాలు జారీ చేసింది. అధికారుల్లో మొదలైన గుబులు లోకాయుక్త జోక్యంతో అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది. జాతర సమయంలో రెడ్డిగూడెం, చిలకలగుట్ట దగ్గర జంపన్నవాగులో ఇన్‌ఫిల్టరేషన్ వెల్స్, మంచినీటి సరఫరా, ఆర్టీసీ బస్సు ప్రాంగంణంలో రోడ్డు నిర్మాణం, క్యూలైను వద్ద కొత్త నిర్మించిన సీసీ రోడ్డు, చిలకలగుట్ట చుట్టూ ఫెన్సింగ్, ఏటూరునాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట, కొత్తగూడ మండలాల పరిధిలోని అడవుల్లో చేపట్టినట్టు చెబుతున్న ఎడ్లబండ్ల దారుల మరమ్మతులు, నిర్మాణాలు తదితర సంబంధించి అన్ని పనులు చేపట్టిన తీరు, అందుకు చే సిన వ్యయంపై మరోసారి విచారణ జరుగనుంది. అంతేకాదు గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ముఖ్యాధికారులు తమ చేతికి మట్టి అంటకుండా కాంట్రాక్టర్లతో కమీషన్ల వ్యవహారాలను చక్కబెట్టేందుకు ఎన్ఎంఆర్ వర్క్ ఇన్స్పెక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా ఏఈ అదనపు బాధ్యతలు అప్పగించారని వినిపిస్తున్న ఆరోపణలపై కూడా ముఖ్య అధికారులను ప్రశ్నించే అవకాశం ఉంది. భక్తుల సౌకర్యార్థం అంటూ చేపట్టిన పనుల్లో అధికారులు తమ సౌఖ్యం కోసం చేసిన మార్పులు.. చేర్పుల ఫలితంగా ప్రజాధనం పక్కదారి పట్టిందని, ఈ అవినీతిపై కూడా విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
ఒకే ఒక్కడు..
కోటికొక్కడు కొక్కెర కృష్ణయ్య సమ్మక్కను తీసుకొచ్చేది తనే మేడారం జాతరలో ప్రధాన ఘట్టం చిలకలగుట్ట మీద నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకురావడం. జాతరలో అత్యంత ఉద్విగ్న భరిత క్షణాలు చిలకలగుట్ట కిందికి సమ్మక్క దిగిరావడం. ఆ సమయంలో కలెక్టర్, ఎస్పీలు ఎదురేగి తుపాకులతో గాలిలోకి కాల్పులు జరుపుతారు. ఆ క్షణాల్లో అందరి కళ్లు భరిణె రూపంలో ఉన్న సమ్మక్కపైనే. ఆ తర్వాత వారి దృష్టి దానిని తీసుకొచ్చే ప్రధాన వడ్డె కొక్కెర కృష్ణయ్యపై పడుతుంది. వేలాదిమంది ప్రత్యక్షంగా, లక్షలాదిమంది పరోక్షంగా ఈ ఘట్టాన్ని ఉత్కంఠగా వీక్షిస్తారు. అంతటి ఉత్కంఠ, ఉద్విగ్నభరిత క్షణాలను తన భుజాలపై మోసే కొక్కెర కృష్ణయ్య మనోగతం ఆయన మాటల్లోనే.. గుడిమెలిగె పండుగతో సమ్మక్క-సారలమ్మ జాతరకు తొలి అడుగు పడుతుంది. అయితే జాతర మొదలయ్యేది మండమెలిగె పండుగతోనే. ఈ పండుగ నాడు మేడారంలో ఉన్న సమ్మక్క గుడిలో పూజలు చేస్తాం. ఆ రోజు నుంచి చిలకలగుట్ట పైనున్న సమ్మక్కతల్లిని గద్దెల పైకి చేర్చే వరకు నియమనిష్ఠలతో ఉంటాం. పగటి వేళ కేవలం పాలు, అరటిపండ్లు ఆహా రంగా తీసుకుంటాం. రాత్రి పొద్దుపోయాక పూజ చేసిన అనంతరం అన్నం తింటాం. నేనొక్కడినే వెళ్తా.. దేవాదాయశాఖ ఇచ్చిన కొత్త బట్టలు ధరిస్తాం. మేడారం సమ్మక్క గుడిలో పూజలు చేస్తాం. ఆ తర్వాత రహస్యమైన పూజా సామగ్రిని తీసుకుని నాతో పాటు వడ్డెల బృందం చిలకలగుట్టకు బయల్దేరుతుంది. సమ్మక్క వడ్డెలైన దోబే పగడయ్య ధూపం, మల్యాల ముత్తయ్య జలకంపట్టి వేస్తుండగా ముందుకు కదులుతాం. జనికపు కొమ్ములతో సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు పొట్టయ్య), సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు దానయ్య). బాజాభజంత్రీల నడుమ మాదిరి పుల్లయ్య, మాదిరి నారాయణ మమ్మల్ని అనుసరిస్తారు. చిలకలగుట్ట సగం వరకే వీరికి ప్రవేశం. ఆ తర్వాత సమ్మక్క తల్లి కొలువై ఉండే రహస్య ప్రదేశానికి నేనొక్కడినే వెళ్తా. అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత సమ్మక్క తల్లిని భరిణె రూపంలో కిందకు తీసుకువస్తా. నేను రావడం కనిపించగానే జనికపు కొమ్ములతో సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రి పేరు పొట్టయ్య), సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు దానయ్య), భజంత్రీలతో మాదిరి పుల్లయ్యలు శబ్దం చేస్తారు. అలా గుట్టమధ్య నుంచి సమ్మక్క తల్లి చిలకలగుట్ట పాదాల వద్దకు చేరుకోగానే ప్రభుత్వం తరపున కలెక్టర్, ఎస్పీలు గాల్లోకి కాల్పులు జరిపి ఆ తల్లికి ఘనస్వాగతం పలుకుతారు. అది వ్యక్తిగత విషయం సమ్మక్క- సారలమ్మ పూజారులు తాగుతారనే అపోహ అందరిలో ఉంది. తాగితేనే దేవత పూనుతుందని అనుకుంటారు. తాగడం అనేది పూజా విధానంలో ఓ భాగంగా అంతా భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. తాగడం అనేది వడ్డెల వ్యక్తిగత విషయం. జాతర సంబరాల్లో భాగంగా మద్యం తీసుకునే అలవాటు ఉన్న వడ్డెలు మాత్రం తాగేవారు. మద్యం సేవించడం పూజా విధానంలో భాగం కాదు. నా వరకు నేను మండమెలిగె పండుగ నుంచే నిష్ఠతో ఒక్క పొద్దు ఉంటాను. నాతో పాటు ఉండే వడ్డెలు వారి వ్యక్తిగత అలవాట్లను బట్టి మద్యం తీసుకుంటారు. అలా మద్యం సేవించడం తప్పు కాదు. అలాగని తీసుకోవడం తప్పనిసరి కాదు. గతంలో సాయంత్రం నాలుగు గంటలకల్లా గద్దెల మీదికి సమ్మక్క తల్లిని తీసుకువచ్చేవాళ్లం. ఇప్పుడు జాతరకు జనం పెరగడం వల్ల ఐదు గంటలవుతోంది. అయితే ఏడుగంటల్లోపు ఎప్పుడు వచ్చినా మంచిదే. అందరిలానే నేను ఎంతో మంది భక్తులు తమ కోర్కెలు తీరాలని, కష్టాలు తొలగిపోవాలని ఆ తల్లిని కొలుస్తారు. వారు అనుకున్న పని తల్లి చేసిపెడుతుంది. అందుకే ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే ఆ తల్లిని స్వయంగా తీసుకువచ్చే నాకు మరింత మేలు జరుగుతుందని అనుకుంటారు. అందరిలానే నేను. తీసుకురావడం అనేది బాధ్యత అంతే. అందరికీ మేలు చేసే తల్లి నా కుటుంబానికీ మేలు చేస్తుంది. -
రేపటి నుంచే మహా సంబరం
సాక్షి, హన్మకొండ: మహా జాతరకు ఘడియలు సమీపిస్తున్నాయి. ఎప్పుడెప్పుడా అంటూ భక్త కోటి ఎదురుచూసే అమ్మల జాతరకు ఇంకా మిగిలింది ఇరవై నాలుగు గంటలే.. సారలమ్మ రాకతో ప్రారంభమయ్యే మహాఘట్టానికి మేడారం ముస్తాబైంది. కన్నెపల్లి వెన్నెలమ్మ రాక కోసం భక్త జనం ఆరాటపడుతోంది. 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా పరిసరాలన్నీ కిటకిటలాడుతున్నాయి. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెలపైకి తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు మేడారం బాటపడుతున్నారు. కన్నెపల్లి, మేడారం, ఊరట్టం, రెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు గుడారాలతో నిండిపోయూయి. కన్నెపల్లిలో సందడి సారలమ్మ ఆలయం ఉన్న కన్నెపల్లిలో ఊరంతా తమ ఇళ్లను అలికి పండుగకు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఇళ్లకు సున్నాలు వేసుకుని సుందరంగా అలంకరించుకున్నారు. పండ క్కి వచ్చిన బంధువులతో వారిళ్లన్నీ కళకళలాడుతున్నాయి. కాగా, సారలమ్మ పూజారులు గత బుధవారం నుంచే సారలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో నిమగ్నమయ్యారు. బుధవారం జరిగే మహాఘట్టానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు దేవాదాయశాఖ సైతం అమ్మల జాతరను విజయవంతం చేసేందుకు శాఖాపరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపట్టింది. భక్తుల సౌకర్యం కోసం రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన స్నానఘట్టాలు, నూతన వంతెన, కొత్త రోడ్లు తదితర పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. జాతర ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతల్లో సోమవారం నుంచి 14వేల మంది వివిధ శాఖల సిబ్బంది తలమునకలైపోయూరు. వాహనాల రద్దీ, వాణిజ్య సముదాయాలు, విద్యుత్ దీప కాంతులతో మేడారం పరిసర ప్రాంతాల్లో పండుగ సందడి నెలకొంది. -
జాతీయ పండుగలా జాతర
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తెలంగాణ రాష్ర్టంలోనే వచ్చే జాతర మేడారం భక్తులకు సౌకర్యాలు కల్పించాలి గోవిందరావుపేట, న్యూస్‌లైన్ : నరేంద్రమోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరను జాతీయ పండుగలా గుర్తించి జాతర నిర్వహిస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన బీజేపీ నాయకులతో కలిసి మేడారంలోని సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే జాతర తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందన్నారు. దేశ ప్రజలంతా అవినీతిమయమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు చూస్తున్నారని, తల్లులను కూడా ప్రజల కోరిక తీరాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండేళ్లకోసారి జరిగే జాతరను జాతీయ పండుగలా గుర్తించి, జాతర రోజులను సెలవు దినాలుగా ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంనుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే జాతరలో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలన్నారు. లక్నవరం నుంచి మేడారం జంపన్నవాగుకు నీటి విడుదల జరుగుతున్నందున లక్నవరాన్ని దేవాదుల ప్రాజెక్టుకు అనుసంధానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జాతరలో నీటి వసతి కోసం మేడారం, చుట్టుపక్కల గ్రామాల్లో చెరువులు, కుంటలను రిజర్వాయర్లుగా మార్చేందుకు దేవాదుల నీటిని తరలించాల్సిన అవసరం ఉందన్నారు. జాతర సమయంలో పంట పండించని వ్యవసాయ భూములకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అజ్మీరా కృష్ణవేణినాయక్, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నాయకులు బానోతు దిలీప్‌కుమార్, ఆకారపు మొగిలి, మహేందర్, లక్ష్మణ్‌నాయక్, గుజ్జుల రామకృష్ణారావు, సావిత్రమ్మ, దశరథం, రుద్రారపు సురేష్, సుధాకర్‌రెడ్డి, సతీష్ ఉన్నారు.