జాతీయ పండుగలా జాతర
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు
- తెలంగాణ రాష్ర్టంలోనే వచ్చే జాతర
- మేడారం భక్తులకు సౌకర్యాలు కల్పించాలి
గోవిందరావుపేట, న్యూస్‌లైన్ : నరేంద్రమోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరను జాతీయ పండుగలా గుర్తించి జాతర నిర్వహిస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన బీజేపీ నాయకులతో కలిసి మేడారంలోని సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే జాతర తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందన్నారు. దేశ ప్రజలంతా అవినీతిమయమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు చూస్తున్నారని, తల్లులను కూడా ప్రజల కోరిక తీరాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండేళ్లకోసారి జరిగే జాతరను జాతీయ పండుగలా గుర్తించి, జాతర రోజులను సెలవు దినాలుగా ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంనుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే జాతరలో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలన్నారు. లక్నవరం నుంచి మేడారం జంపన్నవాగుకు నీటి విడుదల జరుగుతున్నందున లక్నవరాన్ని దేవాదుల ప్రాజెక్టుకు అనుసంధానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
జాతరలో నీటి వసతి కోసం మేడారం, చుట్టుపక్కల గ్రామాల్లో చెరువులు, కుంటలను రిజర్వాయర్‌లుగా మార్చేందుకు దేవాదుల నీటిని తరలించాల్సిన అవసరం ఉందన్నారు. జాతర సమయంలో పంట పండించని వ్యవసాయ భూములకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అజ్మీరా కృష్ణవేణినాయక్, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నాయకులు బానోతు దిలీప్‌కుమార్, ఆకారపు మొగిలి, మహేందర్, లక్ష్మణ్‌నాయక్, గుజ్జుల రామకృష్ణారావు, సావిత్రమ్మ, దశరథం, రుద్రారపు సురేష్, సుధాకర్‌రెడ్డి, సతీష్ ఉన్నారు.