- కోటికొక్కడు కొక్కెర కృష్ణయ్య
- సమ్మక్కను తీసుకొచ్చేది తనే
మేడారం జాతరలో ప్రధాన ఘట్టం చిలకలగుట్ట మీద నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకురావడం. జాతరలో అత్యంత ఉద్విగ్న భరిత క్షణాలు చిలకలగుట్ట కిందికి సమ్మక్క దిగిరావడం. ఆ సమయంలో కలెక్టర్, ఎస్పీలు ఎదురేగి తుపాకులతో గాలిలోకి కాల్పులు జరుపుతారు. ఆ క్షణాల్లో అందరి కళ్లు భరిణె రూపంలో ఉన్న సమ్మక్కపైనే. ఆ తర్వాత వారి దృష్టి దానిని తీసుకొచ్చే ప్రధాన వడ్డె కొక్కెర కృష్ణయ్యపై పడుతుంది. వేలాదిమంది ప్రత్యక్షంగా, లక్షలాదిమంది పరోక్షంగా ఈ ఘట్టాన్ని ఉత్కంఠగా వీక్షిస్తారు. అంతటి ఉత్కంఠ, ఉద్విగ్నభరిత క్షణాలను తన భుజాలపై మోసే కొక్కెర కృష్ణయ్య మనోగతం ఆయన మాటల్లోనే..
గుడిమెలిగె పండుగతో సమ్మక్క-సారలమ్మ జాతరకు తొలి అడుగు పడుతుంది. అయితే జాతర మొదలయ్యేది మండమెలిగె పండుగతోనే. ఈ పండుగ నాడు మేడారంలో ఉన్న సమ్మక్క గుడిలో పూజలు చేస్తాం. ఆ రోజు నుంచి చిలకలగుట్ట పైనున్న సమ్మక్కతల్లిని గద్దెల పైకి చేర్చే వరకు నియమనిష్ఠలతో ఉంటాం. పగటి వేళ కేవలం పాలు, అరటిపండ్లు ఆహా రంగా తీసుకుంటాం. రాత్రి పొద్దుపోయాక పూజ చేసిన అనంతరం అన్నం తింటాం.
నేనొక్కడినే వెళ్తా..
దేవాదాయశాఖ ఇచ్చిన కొత్త బట్టలు ధరిస్తాం. మేడారం సమ్మక్క గుడిలో పూజలు చేస్తాం. ఆ తర్వాత రహస్యమైన పూజా సామగ్రిని తీసుకుని నాతో పాటు వడ్డెల బృందం చిలకలగుట్టకు బయల్దేరుతుంది. సమ్మక్క వడ్డెలైన దోబే పగడయ్య ధూపం, మల్యాల ముత్తయ్య జలకంపట్టి వేస్తుండగా ముందుకు కదులుతాం. జనికపు కొమ్ములతో సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు పొట్టయ్య), సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు దానయ్య). బాజాభజంత్రీల నడుమ మాదిరి పుల్లయ్య, మాదిరి నారాయణ మమ్మల్ని అనుసరిస్తారు.
చిలకలగుట్ట సగం వరకే వీరికి ప్రవేశం. ఆ తర్వాత సమ్మక్క తల్లి కొలువై ఉండే రహస్య ప్రదేశానికి నేనొక్కడినే వెళ్తా. అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత సమ్మక్క తల్లిని భరిణె రూపంలో కిందకు తీసుకువస్తా. నేను రావడం కనిపించగానే జనికపు కొమ్ములతో సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రి పేరు పొట్టయ్య), సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు దానయ్య), భజంత్రీలతో మాదిరి పుల్లయ్యలు శబ్దం చేస్తారు. అలా గుట్టమధ్య నుంచి సమ్మక్క తల్లి చిలకలగుట్ట పాదాల వద్దకు చేరుకోగానే ప్రభుత్వం తరపున కలెక్టర్, ఎస్పీలు గాల్లోకి కాల్పులు జరిపి ఆ తల్లికి ఘనస్వాగతం పలుకుతారు.
అది వ్యక్తిగత విషయం
సమ్మక్క- సారలమ్మ పూజారులు తాగుతారనే అపోహ అందరిలో ఉంది. తాగితేనే దేవత పూనుతుందని అనుకుంటారు. తాగడం అనేది పూజా విధానంలో ఓ భాగంగా అంతా భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. తాగడం అనేది వడ్డెల వ్యక్తిగత విషయం. జాతర సంబరాల్లో భాగంగా మద్యం తీసుకునే అలవాటు ఉన్న వడ్డెలు మాత్రం తాగేవారు. మద్యం సేవించడం పూజా విధానంలో భాగం కాదు. నా వరకు నేను మండమెలిగె పండుగ నుంచే నిష్ఠతో ఒక్క పొద్దు ఉంటాను. నాతో పాటు ఉండే వడ్డెలు వారి వ్యక్తిగత అలవాట్లను బట్టి మద్యం తీసుకుంటారు. అలా మద్యం సేవించడం తప్పు కాదు. అలాగని తీసుకోవడం తప్పనిసరి కాదు. గతంలో సాయంత్రం నాలుగు గంటలకల్లా గద్దెల మీదికి సమ్మక్క తల్లిని తీసుకువచ్చేవాళ్లం. ఇప్పుడు జాతరకు జనం పెరగడం వల్ల ఐదు గంటలవుతోంది. అయితే ఏడుగంటల్లోపు ఎప్పుడు వచ్చినా మంచిదే.
అందరిలానే నేను
ఎంతో మంది భక్తులు తమ కోర్కెలు తీరాలని, కష్టాలు తొలగిపోవాలని ఆ తల్లిని కొలుస్తారు. వారు అనుకున్న పని తల్లి చేసిపెడుతుంది. అందుకే ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే ఆ తల్లిని స్వయంగా తీసుకువచ్చే నాకు మరింత మేలు జరుగుతుందని అనుకుంటారు. అందరిలానే నేను. తీసుకురావడం అనేది బాధ్యత అంతే. అందరికీ మేలు చేసే తల్లి నా కుటుంబానికీ మేలు చేస్తుంది.