తేల్చి చెప్పండి | Tell concluded | Sakshi
Sakshi News home page

తేల్చి చెప్పండి

Published Thu, May 22 2014 4:27 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

Tell concluded

  • మేడారం జాతర పనుల్లో లోపాలపై లోకాయుక్త ఆదేశం
  •  సాక్షి, హన్మకొండ: మేడారం జాతర సందర్భంగా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ), ఏటూరునాగారం ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన పలు పనులు వివాదాస్పదంగా మారాయి. దాంతో ఐటీడీఏ ఆధ్వర్యంలో చేపట్టిన పనులపై విచారణ చేపట్టాలని లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. జాతర సందర్భంగా చేపట్టిన అన్ని పనులకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలంటూ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్‌కు, గిరిజన సంక్షేమ శాఖకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదిక జూలై 7లోపు సమర్పించాలని ఆదేశించింది.
     
    లోకాయుక్త కొరడా..

    మేడారం జాతర సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య అధికారి నేతృత్వంలో తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. ముందు గా టెండర్లు పిలిచిన పనులను మధ్య లో రద్దు చేసి.. ఆ వెంటనే అదే పనిని శాఖ తరఫున చేస్తామని పేర్కొన్నారు. కానీ కమిషన్లు తీసుకుని తమకు అనుకూలుడైన కాంట్రాక్టరుకు పనిని అప్పగించారనే ఆరోపణలు జాతర సందర్భంగా తీవ్ర దుమారం లేపాయి. అయినప్పటికీ అధికారులు తమ తీరును మార్చుకోలేదు. సమయం తక్కువగా ఉందని, భక్తులకు సౌకర్యాలు కల్పించాలంటూ పనులు చేయించారు.

    అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా.. తాత్కాలిక ప్రాతిపదికపై పనిచేస్తున్న ఉద్యోగి (నాన్ మస్టర్ రోల్, ఎన్‌ఎమ్‌ఆర్)కు ఈ పనుల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. కేవలం పది లక్షల రూపాయల లోపు వ్యయం అయ్యే పనులనే తాత్కాలిక ఉద్యోగి చేపట్టాలి. కానీ, అక్కడ రూ.4 కోట్లకు పైగా వ్యయంతో చేసిన పనుల పర్యవేక్షణ బాధ్యతతో పాటు మెజర్‌మెంట్ రికార్డుల నిర్వహణ సైతం సదరు ఎన్‌ఆర్‌ఎం ఉద్యోగికే అప్పగించడం అప్పట్లో చర్చకు దారితీసింది.

    ఐటీడీఏ అవలంభిస్తున్న తీరుపై పత్రికల్లో వరుసగా కథనాలు సైతం వచ్చాయి. దాంతో జాతర ముగిసిన వెంటనే బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి ‘సాక్షి’ కథనాలతో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.  ఈ ఫిర్యాదుకు స్పందించిన లోకాయుక్త.. గిరిజన సంక్షేమ శాఖ తరఫున చేపట్టిన పనులపై విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలంటూ ఇంజనీరింగ్ శాఖ పర్యవేక్షణాధికారికి ఆదేశాలు జారీ చేసింది.
     
    అధికారుల్లో మొదలైన గుబులు

    లోకాయుక్త జోక్యంతో అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది. జాతర సమయంలో రెడ్డిగూడెం, చిలకలగుట్ట దగ్గర జంపన్నవాగులో ఇన్‌ఫిల్టరేషన్ వెల్స్, మంచినీటి సరఫరా, ఆర్టీసీ బస్సు ప్రాంగంణంలో రోడ్డు నిర్మాణం, క్యూలైను వద్ద కొత్త నిర్మించిన సీసీ రోడ్డు, చిలకలగుట్ట చుట్టూ ఫెన్సింగ్, ఏటూరునాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట, కొత్తగూడ మండలాల పరిధిలోని అడవుల్లో చేపట్టినట్టు చెబుతున్న ఎడ్లబండ్ల దారుల మరమ్మతులు, నిర్మాణాలు తదితర సంబంధించి అన్ని పనులు చేపట్టిన తీరు, అందుకు చే సిన వ్యయంపై మరోసారి విచారణ జరుగనుంది.

    అంతేకాదు గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ముఖ్యాధికారులు తమ చేతికి మట్టి అంటకుండా కాంట్రాక్టర్లతో కమీషన్ల వ్యవహారాలను చక్కబెట్టేందుకు ఎన్‌ఎంఆర్ వర్క్ ఇన్స్‌పెక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా ఏఈ అదనపు బాధ్యతలు అప్పగించారని వినిపిస్తున్న ఆరోపణలపై కూడా ముఖ్య అధికారులను ప్రశ్నించే అవకాశం ఉంది. భక్తుల సౌకర్యార్థం అంటూ చేపట్టిన పనుల్లో అధికారులు తమ సౌఖ్యం కోసం చేసిన మార్పులు.. చేర్పుల ఫలితంగా ప్రజాధనం పక్కదారి పట్టిందని, ఈ అవినీతిపై కూడా విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement