సాక్షి ప్రతినిధి, తిరుపతి: సమైక్య శంఖారావం యాత్ర సోమవారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో సాగింది. ఆదివారం రాత్రి చౌడేపల్లెలో బస చేసిన జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం అక్కడి నుంచి యాత్ర ప్రారంభించారు. అడుగడుగునా జన హోరుతో ఆయన అరకిలోమీటర్ దూరంలో ఉన్న జంక్షన్‌కు చేరుకునేందుకు రెండు గంటల సమయం పట్టింది. చౌడేపల్లె, కొండమర్రిలలో దివంగత మహానేత వైఎస్ విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. కొండమర్రికి వెళ్లే మార్గంలో పెద్ద సంఖ్యలో ముస్లిం మతపెద్దలు ఆయన్ను కలసి సంఘీభావం ప్రకటించారు. వారి కోరిక మేరకు జగన్‌మోహన్‌రెడ్డి వారిని ఉద్దేశించి ఉర్దూలో మాట్లాడారు.
పార్టీలో ముస్లింలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. కొండమర్రిలో గిరిజనులు జగన్‌మోహన్‌రెడ్డికి డప్పులు, నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం ఠాణా ఇండ్లు, బిల్లేరు క్రాస్, చింతమాకులపల్లె క్రాస్, పుదిపట్ల, బోయకొండ క్రాస్‌ల మీదుగా లద్దిగం చేరుకున్నారు. అక్కడ కణగాని అంజప్ప కుటుంబాన్ని ఓదార్చారు. మార్గమధ్యంలో పాఠశాల విద్యార్థులు, రైతు కూలీలు, ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో రహదారులకు ఇరువైపులా బారులుతీరి స్వాగతం పలికారు. అక్కడి నుంచి చదళ్ల, భగత్‌సింగ్ కాలనీల మీదుగా పుంగనూరు చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి పాత బస్టాండ్ సర్కిల్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. రాత్రి పుంగనూరు మాజీ మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం ఇంట్లో జగన్ బస చేశారు. మంగళవారం యాత్ర పుంగనూరు, మదనపల్లి నియోజకవర్గాల్లో సాగనుంది.