‘ఇంజనీరింగ్, ఫార్మసీ’ కన్వీనర్ కోటా ప్రవేశాలకు పచ్చజెండా | Green Signal for Engineering, Pharmacy Convenor Quota admission | Sakshi
Sakshi News home page

‘ఇంజనీరింగ్, ఫార్మసీ’ కన్వీనర్ కోటా ప్రవేశాలకు పచ్చజెండా

Published Fri, Aug 9 2013 2:38 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

Green Signal for Engineering, Pharmacy Convenor Quota admission

ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈనెల 19 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని సూచించింది. అలాగే బీ కేటగిరీ సీట్ల భర్తీ కోసం కాలేజీల్లో, ఆన్‌లైన్‌లో దరఖాస్తులను అందుబాటులో ఉంచాలని, దరఖాస్తులను ఆహ్వానిస్తూ రెండు ప్రముఖ దినపత్రికల్లో నోటిఫికేషన్లు జారీ చేయాలని నాన్ మైనారిటీ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీలో ప్రభుత్వం అసాధారణ జాప్యం చేస్తోందని, దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ హైదరాబాద్‌కు చెందిన టి.లీలాకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన కోర్టు గురువారం దాన్ని మరోసారి విచారించింది.
 
‘‘దరఖాస్తు ప్రతులను ప్రతి కాలేజీ కూడా తమ నోటీసు బోర్డులో ఉంచాలి. అలాగే దరఖాస్తు కాపీని ప్రతి కాలేజీ.. ఏ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉందో ఆ యూనివర్సిటీకి పంపాలి. ప్రతి విశ్వవిద్యాలయం ఆ దరఖాస్తును తమ నోటీసు బోర్డుల్లో ఉంచడంతోపాటు తమ వెబ్‌సైట్‌లలో సైతం అందుబాటులో ఉంచాలి. దీనివల్ల బీ కేటగిరీ ప్రవేశాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆ దరఖాస్తును కాపీ చేసుకుని ఆయా కాలేజీలకు సమర్పించే అవకాశం ఉంటుంది’’ అని కోర్టు తెలిపింది. యాజమాన్యాలు తమ కాలేజీ దరఖాస్తును ఉన్నత విద్యా మండలికి కూడా అందుబాటులో ఉంచాలని న్యాయస్థానం సూచించింది. దాన్ని విద్యా మండలి తమ నోటీస్ బోర్డ్‌లో ఉంచాలని తెలిపింది. బీ కేటగిరీ సీట్లలో ప్రవేశాలు పొందాలనుకుంటున్న విద్యార్థులు దరఖాస్తులను పూరించి అవసరమైన డాక్యుమెంట్లు జత చేసి, అక్నాలెడ్జ్‌మెంట్‌తో సహా వాటిని రిజిస్టర్ పోస్టు ద్వారా ఆయా కాలేజీలకు పంపాలని పేర్కొంది. స్వయంగా లేదా ఆన్‌లైన్ ద్వారా తమకు అందిన దరఖాస్తులన్నింటినీ ఆయా కాలేజీలు పరిగణనలోకి తీసుకోవాలని, మెరిట్ ప్రాతిపదికన జాబితాను రూపొందించాలని స్పష్టంచేసింది.
 
ఈ జాబితాను కాలేజీలు తమ వైబ్‌సైట్లలో, నోటీసు బోర్డుల్లో ఉంచాలని, జాబితాను పరిశీలన నిమిత్తం ఎంసెట్ కన్వీనర్‌కు అందుబాటులో ఉంచాలని వివరించింది. అంతకుముందు పిటిషనర్ తరఫున ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎంసెట్ ఫలితాలు విడుదలై రెండు నెలలు కావొస్తున్నా, ప్రభుత్వం ఇప్పటివరకు కౌన్సెలింగ్ జారీకి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏఐసీటీఈ నిర్దేశించిన గడువును ఎవరూ మీరడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అయితే ఇంజనీరింగ్ కోర్సుల షెడ్యూల్ పొడిగింపు కోసం సుప్రీంకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని, ప్రస్తుత విద్యా సంవత్సరానికి సెప్టెంబర్ 1 వరకు పొడిగింపునిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ప్రవేశాలన్నీ పారదర్శకంగా జరగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, ఏ కేటగిరీ అయినా, బీ కేటగిరీ అయినా ప్రవేశాల ప్రక్రియ మొత్తం ప్రతిభ ఆధారంగానే జరగాలని స్పష్టంచేశారు.
 
12న సమావేశం
 
ఈనెల 12న (సోమవారం) ఎంసెట్ కమిటీ సమావేశమై నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు చేస్తుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.జయప్రకాశరావు తెలిపారు. యాజమాన్య కోటా సీట్ల భర్తీ విషయంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందిస్తామని వెల్లడించారు. 13న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement