Convenor Quota admission
-
పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్లకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. 2023–24 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని పీజీ మెడికల్ సీట్ల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వినర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష(నీట్)– 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నేటినుంచి 17వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ఈ నెల 10వ తేదీ (సోమవారం) ఉదయం 10 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వర్సిటీ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. మెరిట్ జాబితా విడుదల అనంతరం వెబ్ ఆప్షన్లకు యూనివర్సిటీ మరో నోటిఫికేషన్ జారీచేస్తుంది. తదనుగుణంగా అభ్యర్థులు ప్రాధాన్యక్రమంలో ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుంది. ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్సైట్ www. knruhs. telangana.gov.in లో సంప్రదించాలని యూనివర్సిటీ తెలిపింది. జనరల్ కేటగిరీ విద్యార్థులకు కటాఫ్ స్కోర్ 291 మార్కులు అభ్యర్థులు నీట్ పీజీలో కటాఫ్ స్కోర్ లేదా అంతకంటే ఎక్కువ సాధించి ఉండాలి. జనరల్ కేటగిరీ విద్యార్థులకు కనీస అర్హత 50 పర్సంటైల్ కాగా, కట్ ఆఫ్ స్కోర్ 291 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల కనీస అర్హత 40 పర్సంటైల్ కాగా, కట్ ఆఫ్ స్కోర్ 257 మార్కులు, దివ్యాంగుల కనీస అర్హత 45 పర్సంటైల్ కాగా, కట్ ఆఫ్ స్కోర్ 274 మార్కులు సాధించి ఉండాలని వర్సిటీ వెల్లడించింది. ఇతర ముఖ్యాంశాలు ♦ అభ్యర్థి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపుపొందిన మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ లేదా తత్సమాన డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ♦ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి శాశ్వత నమోదు చేసుకొని ఉండాలి. ♦ కంపల్సరీ రొటేటింగ్ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. ♦ ఎంబీబీఎస్ చదివినవారు గుర్తింపు పొందిన మెడికల్ కాలేజీల నుండి వచ్చే నెల 11వ తేదీ లేదా అంతకు ముందు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. 11 ఆగస్టు 2023 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తి చేసే అభ్యర్థులు సంబంధిత మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ జారీ చేసిన సర్టిఫికెట్‌ను సమర్పించాలి. ♦ సర్విస్‌లో ఉన్న అభ్యర్థుల విషయంలో 30 జూన్ 2023 నాటికి వారు అందించిన సేవలను పరిగణలోకి తీసుకుంటారు. ♦ ఓసీ, బీసీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు రూ.5500 ♦ పీజీ డిగ్రీ లేదా డిప్లొమా కోర్సులకు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.5500 (బ్యాంక్ లావాదేవీల చార్జీలు అదనం), ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.5000 (బ్యాంకు లావాదేవీల చార్జీలు అదనం). రుసుమును డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో చెల్లించాలి. ♦ అభ్యర్థులు పాస్‌పోర్ట్ సైజు ఫొటో, అడ్మిట్ కార్డ్, నీట్ పీజీ ర్యాంక్ కార్డ్, ఒరిజినల్ లేదా ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఇంటర్న్‌షిప్ కంప్లీషన్ సర్టిఫికెట్, పర్మినెంట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తదితరాలు సమర్పించాలి. ♦ ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురైతే సాయం కోసం 9392685856, 7842542216 నంబర్లను సంప్రదించవచ్చు. -
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌లో సగం సీట్లు ఖాళీ
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ , సాంకేతిక వృత్తి విద్యా కోర్సుల్లో సగం సీట్లు భర్తీ కావడంలేదు. గత పదేళ్లుగా కన్వీనర్ కోటాతోపాటు మేనేజ్మెంట్ కోటాలోనూ సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. కొన్ని ప్రముఖ కాలేజీల్లో మినహా చాలా కాలేజీల్లో సగానికి పైగా సీట్లు మిగిలిపోతున్నట్టు ఏఐసీటీఈ గణాంకాలు చెబుతున్నాయి. ఏఐసీటీఈ ఏటా ప్రకటించే గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా గత పదేళ్లలో 40 నుంచి 48 శాతం వరకు సీట్లు మిగిలిపోతున్నాయి. 2013–14లో 39 శాతం సీట్లు మిగిలిపోగా, 2016–18 నాటికి 48 శాతానికి పెరిగింది. ఆ తరువాత రెండేళ్లూ ఇదే పరిస్థితి. కరోనా తరువాత చేరికలు కొంతమేర పెరగడంతో మిగులు సీట్లు 42 శాతానికి చేరాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే గత మూడేళ్లుగా 80 శాతానికి పైగా సీట్లు భర్తీ అవుతున్నాయి. 2022–23 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో 85 శాతం సీట్లు భర్తీ అవడం విశేషం. ఇన్‌టేక్ తగ్గినా చేరికలు మాత్రం అంతే వాస్తవానికి దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం సీట్ల సంఖ్య గత పదేళ్లలో భారీగా తగ్గింది. పదేళ్లక్రితం 30 లక్షల నుంచి 31 లక్షల వరకు సీట్లు ఉండగా ఇప్పుడది 23 లక్షలకు తగ్గింది. సీట్ల సంఖ్య తగ్గినా చేరికల్లో మాత్రం మార్పు లేదు. గతంలో పలు విద్యా సంస్థలు సదుపాయాలు లేకున్నా కోర్సులకు అనుమతులు తెచ్చుకొనేవి. వీటివల్ల సాంకేతిక విద్య నాసిరకంగా మారుతుండడంతో సదుపాయాలున్న వాటికే ఏఐసీటీఈ అనుమతులిస్తోంది. ప్రమాణాల మేరకు సదుపాయాలు లేకున్నా, చేరికలు వరుసగా మూడేళ్లు 25 శాతానికి లోపు ఉన్నా వాటికి అనుమతులను రద్దు చేస్తోంది. దీంతో పలు కాలేజీలు మూతపడ్డాయి. కంప్యూటర్ సైన్సు సీట్లకే డిమాండ్ విద్యార్థులు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్న కంప్యూటర్ సైన్సు, తత్సంబంధిత కోర్సులవైపు దృష్టి సారిస్తున్నారు. దానికోసం కాలేజీలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా వెనక్కు తగ్గడం లేదు. ఇతర కోర్సుల్లో చేరికలు అంతంతమాత్రమే. ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) కోర్సుకే పరిమితమైన ఈ డిమాండ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెరి్నంగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), బ్లాక్ చైన్, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, 3డీ ప్రింటింగ్ అండ్ డిజైన్, వర్చువల్ రియాలిటీ, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ (ఏఆర్), బిగ్ డేటా వంటి అంశాలలో నేరుగా లేదా కాంబినేషన్లో వివిధ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటి బోధనకు అవసరమైన సదుపాయాలను కొన్ని ప్రముఖ కాలేజీలు మాత్రమే కల్పిస్తున్నాయి. మిగతా కళాశాలలు సంప్రదాయ కోర్సులతోనే నెట్టుకొస్తున్నాయి. సంప్రదాయ కోర్ గ్రూప్ కోర్సుల వైపు విద్యార్థులను మళ్లించడానికి ఇతర అంశాలను వీటికి మైనర్ కోర్సులుగా జతచేయాలని ఏఐసీటీఈ ఆలోచిస్తోంది. ఈ కోర్సుల్లోని నూతన అంశాలపై అధ్యాపకులకు శిక్షణ కూడా ఇస్తోంది. లెక్చరర్ల కోసం ఇంటర్న్‌షిప్ కోర్సులు కూడా నిర్వహిస్తోంది. రాష్ట్రంలో చేరికలు 80 శాతం పైనే దేశంలోని పరిస్థితులకు భిన్నంగా రాష్ట్రంలో చేరికలు 80 శాతానికి పైగా ఉండటం విశేషం. గత మూడేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యలతో చేరికలు భారీగా పెరుగుతున్నాయి. జగనన్న విద్యా దీవెన కింద రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే వారందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. ఆర్థిక భారం లేకపోవడంతో విద్యార్థులు ఎక్కువగా ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. జగనన్న వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికి ఏటా రూ.20 వేలు అదనంగా ఇస్తున్నారు. ఇంజనీరింగ్ సిలబస్‌ను సంస్కరించి ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా కొత్త అంశాలను జోడించారు. ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలతో శిక్షణ, సర్టిఫికేషన్ కోర్సులను అందుబాటులోకి తెచ్చారు. జగనన్న విద్యా దీవెన కింద ఇప్పటివరకు రూ.9051.57కోట్లు అందించారు. దీని ద్వారా ఇంజనీరింగ్‌తో పాటు ఇతర కోర్సులకు చెందిన 24,74,544 మంది విద్యార్థులకు మేలు చేకూరింది. జగనన్న వసతి దీవెన కింద ఇప్పటివరకు రూ.3,349.57కోట్లు అందించగా 18,77,863 మందికి లబ్ధి చేకూరింది. కాలేజీలకు న్యాక్ గుర్తింపును తప్పనిసరి చేశారు. ప్రమాణాలు మెరుగుపరుచుకోని కాలేజీలకు అనుమతులు రద్దు చేస్తున్నారు. గత ఏడాది ప్రవేశాలు సరిగా లేని 28 కాలేజీల్లో ప్రవేశాలు నిలిపివేశారు. ఒక్క విద్యార్థీ చేరని మరో 22 కాలేజీల అనుమతులు రద్దు చేశారు. దీంతో కాలేజీల్లో వసతులు, బోధనలో నాణ్యత మెరుగుపడుతున్నాయి. ఈ చర్యలతో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2022–23 విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోటా సీట్లు 1,13,403 కాగా, అందులో 95,968 (85 శాతం) భర్తీ అయ్యాయి. యాజమాన్య కోటా, స్పాట్ అడ్మిషన్లతో పాటు చూస్తే 1,21,836 (76 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. గత నాలుగేళ్ల గణాంకాలు చూస్తే ఏటా భర్తీ అయ్యే సీట్ల సంఖ్య పెరుగుతుండడం విశేషం. -
‘ఇంజనీరింగ్, ఫార్మసీ’ కన్వీనర్ కోటా ప్రవేశాలకు పచ్చజెండా
ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈనెల 19 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని సూచించింది. అలాగే బీ కేటగిరీ సీట్ల భర్తీ కోసం కాలేజీల్లో, ఆన్లైన్లో దరఖాస్తులను అందుబాటులో ఉంచాలని, దరఖాస్తులను ఆహ్వానిస్తూ రెండు ప్రముఖ దినపత్రికల్లో నోటిఫికేషన్లు జారీ చేయాలని నాన్ మైనారిటీ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీలో ప్రభుత్వం అసాధారణ జాప్యం చేస్తోందని, దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ హైదరాబాద్‌కు చెందిన టి.లీలాకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన కోర్టు గురువారం దాన్ని మరోసారి విచారించింది. ‘‘దరఖాస్తు ప్రతులను ప్రతి కాలేజీ కూడా తమ నోటీసు బోర్డులో ఉంచాలి. అలాగే దరఖాస్తు కాపీని ప్రతి కాలేజీ.. ఏ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉందో ఆ యూనివర్సిటీకి పంపాలి. ప్రతి విశ్వవిద్యాలయం ఆ దరఖాస్తును తమ నోటీసు బోర్డుల్లో ఉంచడంతోపాటు తమ వెబ్సైట్లలో సైతం అందుబాటులో ఉంచాలి. దీనివల్ల బీ కేటగిరీ ప్రవేశాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆ దరఖాస్తును కాపీ చేసుకుని ఆయా కాలేజీలకు సమర్పించే అవకాశం ఉంటుంది’’ అని కోర్టు తెలిపింది. యాజమాన్యాలు తమ కాలేజీ దరఖాస్తును ఉన్నత విద్యా మండలికి కూడా అందుబాటులో ఉంచాలని న్యాయస్థానం సూచించింది. దాన్ని విద్యా మండలి తమ నోటీస్ బోర్డ్‌లో ఉంచాలని తెలిపింది. బీ కేటగిరీ సీట్లలో ప్రవేశాలు పొందాలనుకుంటున్న విద్యార్థులు దరఖాస్తులను పూరించి అవసరమైన డాక్యుమెంట్లు జత చేసి, అక్నాలెడ్జ్మెంట్తో సహా వాటిని రిజిస్టర్ పోస్టు ద్వారా ఆయా కాలేజీలకు పంపాలని పేర్కొంది. స్వయంగా లేదా ఆన్లైన్ ద్వారా తమకు అందిన దరఖాస్తులన్నింటినీ ఆయా కాలేజీలు పరిగణనలోకి తీసుకోవాలని, మెరిట్ ప్రాతిపదికన జాబితాను రూపొందించాలని స్పష్టంచేసింది. ఈ జాబితాను కాలేజీలు తమ వైబ్సైట్లలో, నోటీసు బోర్డుల్లో ఉంచాలని, జాబితాను పరిశీలన నిమిత్తం ఎంసెట్ కన్వీనర్‌కు అందుబాటులో ఉంచాలని వివరించింది. అంతకుముందు పిటిషనర్ తరఫున ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎంసెట్ ఫలితాలు విడుదలై రెండు నెలలు కావొస్తున్నా, ప్రభుత్వం ఇప్పటివరకు కౌన్సెలింగ్ జారీకి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏఐసీటీఈ నిర్దేశించిన గడువును ఎవరూ మీరడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అయితే ఇంజనీరింగ్ కోర్సుల షెడ్యూల్ పొడిగింపు కోసం సుప్రీంకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని, ప్రస్తుత విద్యా సంవత్సరానికి సెప్టెంబర్ 1 వరకు పొడిగింపునిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ప్రవేశాలన్నీ పారదర్శకంగా జరగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, ఏ కేటగిరీ అయినా, బీ కేటగిరీ అయినా ప్రవేశాల ప్రక్రియ మొత్తం ప్రతిభ ఆధారంగానే జరగాలని స్పష్టంచేశారు. 12న సమావేశం ఈనెల 12న (సోమవారం) ఎంసెట్ కమిటీ సమావేశమై నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు చేస్తుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.జయప్రకాశరావు తెలిపారు. యాజమాన్య కోటా సీట్ల భర్తీ విషయంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందిస్తామని వెల్లడించారు. 13న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.