సాక్షి, అమరావతి బ్యూరో : అనేక ఇబ్బందులతో తమ సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్న ఫిర్యాదుదారులకు నిరాశ తప్పడం లేదు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో సోమవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో గ్రీవెన్స్ హాల్ కిటకిటలాడింది. అయితే ఉదయం నుంచి పడిగాపులు పడినా సీఎం దర్శనం లభించకపోవడంతో వారంతా నిరాశతో వెనుదిరిగారు. తమ బాధలు ముఖ్యమంత్రితో చెప్పుకుందామని ఇక్కడికి వస్తే ఆయన లేరని అధికారులు చెప్పడంతో బాధితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలా చేయడంపై అక్కడ ఉన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు పి. సైదులునాయక్. గుంటూరు జిల్లా అమరావతి నుంచి సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చాడు. రెండేళ్ల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లూ కోల్పోయాడు. కుటుంబానికి జీవనాధారమైన ఆయన ప్రస్తుతం ఏ పనీ చేసుకోలేని దుస్థితిలో ఉన్నాడు. భార్య, ఇద్దరు పిల్లల పోషణ కష్టంగా మారింది. రుణం అందిస్తే చిన్నపాటి దుకాణం పెట్టుకొని బతకాలని భావించాడు. ఇందు కోసం అధికారులను కలసేందుకు గత ఏడాది నవంబర్ నుంచి సెక్రటరియేట్‌కు వస్తూనే ఉన్నాడు. నెలలో రెండు, మూడు సార్లు వచ్చినా ఆయన గోడు ఆలకించే నాథుడే కరువయ్యారు. ఎంత వేడుకున్నా అధికారులు గ్రీవెన్స్ హాలులోకి పంపించకుండా ఇబ్బంది పెట్టారు. సీఎం వద్దకు పంపించాలని ఎన్నిమార్లు వేడుకున్నా పట్టించుకున్న పాపానపోలేదని సైదులునాయక్ కన్నీరుమున్నీరయ్యాడు. కాళ్లు లేవని కనీసంగా కూడా కనికరించలేదని ఆవేదన చెందారు. పిల్లలను అప్పులు చేసి మరీ చదివించుకుంటున్నాని పేర్కొన్నారు. రోజురోజుకీ కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారిందని చెప్పారు. ఈ నేపథ్యంలో తనకు ప్రభుత్వం రుణం మంజూరుచేసి ఆదుకొని తన జీవితాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment