పెళ్లి ఇంట విషాదం
పెళ్లి ఇంట విషాదం
Published Mon, Apr 7 2014 2:20 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
రాజాం రూరల్,న్యూస్‌లైన్: మరో పది రోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి భాజాలు మోగాల్సి ఉంది. వరుడు ఉత్సాహంగా పెళ్లి పనులను చేస్తున్నాడు. శుభలేఖలను కూడా అతనే బంధువులు, స్నేహితులకు పంచిపెడుతున్నాడు. అందరూ తప్పనిసరిగా పెళ్లికి కుటుంబ సమేతంగా వచ్చి ఆశీర్వదించి భోజనాలు చేసి మరీ వెళ్లాలని కోరుతున్నాడు. అతని ఆనందానికి అవధులు లేకుండా పోతున్న తరుణంలో దేవునికి సైతం కన్నుకుట్టిందేమోగాని శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చి మృత్యు కౌగిలిలోకి తీసుకుపోయి ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చాడు. వివరాల్లోకి వెళితే నగరపంచాయతీ పరిధిలోని సారధి గ్రామానికి చెందిన కెంబూరు రమేష్‌నాయుడు (28) శనివారం రాత్రి విజయనగరం జిల్లా బాడంగి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.
ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివిన అతను రణస్థలంలోని అరబిందో కంపెనీలో క్వాలటీ కంట్రోల్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. అలాగే రెడాక్స్ శిక్షణ కేంద్రంలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. రమేష్‌కు ఇటీవల బొబ్బిలికి చెందిన ఉమామహేశ్వరితో వివాహం కుదిరింది. ఈ నెల 16వ తేదీ వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. శుభలేఖలను కూడా బంధువులు, స్నేహితులకు పంచిపెట్టారు. ఈ క్రమంలో బొబ్బిలిలోని అత్తవారింటికి చెందిన బంధువులకు కార్డులు ఇవ్వడానికి బొబ్బిలికి చెందిన తన తోటి ఉద్యోగి సునీల్‌తో ద్విచక్ర వాహనంపై రాజాం నుంచి బొబ్బిలి వెళ్తుండగా ఎదురుగా బొబ్బిలికి చెందిన భవానీశంకర్ మరో ద్విచక్రవాహనంతో వచ్చి ఢీకొన్నాడు. ఈ సంఘటనలో రమేష్, భవానీశంకర్‌లు అక్కడకక్కడే మృతి చెందగా సునీల్ తీవ్ర గాయాలపాయ్యాడు.
విషయం తెలుసుకున్న సారధి గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం అనంతరం ఆదివారం మధ్యాహ్నం మృతదేహాల ను గ్రామానికి తరలించి అంత్యక్రియ లు జరిపారు.కాగా విద్యావంతుడైన రమేష్ రెడాక్స్‌లో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తూ ఎంతోమందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగవకాశాలు కల్పించాడని గ్రామానికి చెందిన వాడాడ వంశీకృష్ణ, మజ్జి మదన్‌మోహన్,రాజాపు విజయ్‌కుమా ర్, కరణం ఢిల్లీశ్వరరావు, పాసినపల్లి మోహన్,పొట్నూరు కిషోర్ తెలిపారు. ఇప్పటివరకు రాజాం పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 150 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు వేయిం చారని, ఆయన మృతి గ్రామానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement