ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
ఏపీలోని 13 జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో ‘గ్రూప్–2’ కేంద్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–2 కేటగిరీలోని 982 పోస్టులకు ఈ నెల 26న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ పరీక్ష పర్యవేక్షణ కోసం ఏపీపీఎస్సీ నుంచి అధికారులను డిప్యుటేషన్‌పై నియమించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాల వారీగా అధికారుల పేర్లు, మొబైల్ నెంబర్లను ప్రకటించారు. ఈ పరీక్షకు మొత్తం 6,57,010 మంది పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.
పరీక్ష కేంద్రానికి సంబంధించి ఏమైనా సందేహాలుంటే అభ్యర్థులు ఆయా జిల్లా కలెక్టరేట్లలో పర్యవేక్షణాధికారులను సంప్రదించవచ్చని కమిషన్ వివరించింది. పరీక్ష హాలులోకి ఉదయం 9 గంటలకు అనుమతిస్తామని తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ గుర్తింపు కార్డును తీసుకురావాలని సూచించారు. ఉదయం 9.45 గంటల తర్వాత అభ్యర్థులెవరినీ పరీక్ష హాలులోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. కాగా పరీక్షకు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అత్యధిక సంఖ్యలోనే దరఖాస్తులు అందడం విశేషం. ఈ పరీక్షకు గాను హైదరాబాదు సెంటరు నుంచి 53063 మంది పరీక్ష రాయనున్నారు.