సాక్షిప్రతినిధి, కరీంనగర్ : కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఏర్పాటు ప్రకటనతో జైత్రయాత్ర సదస్సు ఏర్పాట్లకోసం నిర్వహించిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో గ్రూపు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. పలు నియోజకవర్గాల నేతలు పరస్పరం వాదులాటకు దిగారు. కొందరు నేతలు ఏకంగా ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో పార్టీపరంగా అన్ని జిల్లాల్లో జైత్రయాత్ర పేరిట భారీ సదస్సులు నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారు. ఇందులో భాగంగా కరీంనగర్‌లో ఈ నెల 27న సదస్సు నిర్వహించాల్సి ఉంది. జైత్రయాత్ర సదస్సు విజయవంతం చేసేందుకు గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. డీసీసీ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సదస్సు ఏర్పాట్లపై కంటే నియోజకవర్గాల్లోని గ్రూపు రాజకీయాలు, సమన్వయలేమి అంశాలే ఎక్కువగా చర్చకు వచ్చాయి.
కాంగ్రెస్‌కు సంబంధించి జిల్లాలో రెండు వర్గాలుగా ఉన్న మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్ ఈ భేటీలోనూ ఇదే రకంగా వ్యవహరించారు. మంత్రి శ్రీధర్‌బాబు యథావిధిగా ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. కరీంనగర్‌లో పార్టీ పరిస్థితి బాగాలేదని చెప్పుకొచ్చారు. నేతల మధ్య సమన్వయం ఉండడంలేదని, జిల్లా కేంద్రంలోనే ఇలా ఉంటే ఈ ప్రభావం మిగిలిన నియోజకవర్గాల్లోనూ పడుతోందని అన్నారు. ప్రత్యర్థి పార్టీల నేతల విమర్శలపై పార్టీ పదవుల్లో ఉన్నవారు ఆశించిన మేరకు స్పందించడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవన్నీ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావుతోనే స్పష్టం చేశారు. అయితే అసలు ఉద్దేశం మాత్రం ఎంపీ పొన్నం ప్రభాకర్ లక్ష్యంగా ఉందని సమావేశంలో ఉన్న నేతలు చెబుతున్నారు. పొన్నం ప్రభాకర్ అనుచరుడు కన్న కృష్ట ప్రస్తుతం కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయనతోపాటు పలువురు పొన్నం అనుచరులు మంత్రిపై వచ్చిన విమర్శలను ఖండించడంలో చొరవ తీసుకోవడంలేదనే ఉద్దేశంతోనే ఇలా అన్నట్లు భేటీలో ఉన్న నేతలు అంటున్నారు.
కరీంనగర్‌లో పార్టీ నేతల సమన్వయలోపంపై మంత్రి వివరంగా మాట్లాడిన తర్వాత... మంత్రికి దగ్గరగా ఉండే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ భేటీలో మరింత తీవ్రంగా స్పందించారు. ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌తో ఇటీవల పెరిగిన సవాళ్ల రాజకీయంలో టీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు రవీందర్‌సింగ్ స్పందిస్తుంటే... కాంగ్రెస్ నగర పార్టీ నేతలు ఎందుకు మాట్లాడరని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో అసంతృప్తి ఉన్న మంత్రి శ్రీధర్‌బాబు అండతోనే భేటీలో అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఇలా మాట్లాడినట్లు ఎంపీ వర్గీయులు చెబుతున్నారు.
ఇటీవల కాంగ్రెస్ మైనారిటీ సెల్ నగర కన్వీనరుగా నియమితుడైన ఓ నేత స్వీట్లు తెచ్చి అక్కడి నేతలకు ఇస్తుంటే... ఎంపీ పొన్నం జోక్యం చేసుకుని తమకు తెలియకుండా పదవులు ఎలా ఇచ్చుకుంటారని అనడం కొద్దిసేపు వాగ్వాదానికి దారితీసింది. మైనారిటీ నేతలపై ఎంపీ ప్రశ్నలకు వారు తీవ్రంగా స్పందించారు. ‘మాకు నామినేటెడ్ పదవులు లేవు. మీరు ఇప్పించేందుకు జోక్యం చేసుకోరు. పార్టీలోని చిన్న పదవులు ఇచ్చుకుంటే వాటిపైనా మాట్లాడుతారు. అసలు మైనారిటీల గురించి మీరు ఏం చేశారు. ఇతర పార్టీలోని మైనారిటీ నేతలు మమ్మల్ని చూసే నవ్వే పరిస్థితి ఉంది. చిన్న పదవులు కూడా ఇంత రాజకీయం ఏమిటి’ అని ప్రశ్నించగా, ఎంపీ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.
రామగుండం నియోజకవర్గంలోని ముఖ్యనేతలు కోలెటి దామోదర్, బాబర్‌సలీంపాషా ఒకరిపై ఒకరు కేకలు వేసుకున్నారు. రామగుండంలో బీపీఎల్ ధర్మల్ ప్లాంటు తరలింపుపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని కోలేటి దామోదర్ ప్రకటించడంపై బాబర్ సలీంపాషా తీవ్రంగా స్పందించారు. అలా ప్రకటించడానికి దామోదర్ ఎవరని ప్రశ్నించారు. అఖిలపక్షం అనే మాటలు ఏమిటని, నియోజకవర్గ ఇన్‌చార్జి అయిన తాను లేకుండా ఎలా కార్యక్రమాలు చేస్తారని గట్టిగా అడిగారు. ఇద్దరి మధ్యమాటల తీవ్రత పెరగడంతో మంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. ఇలా సమావేశంలో పలుసార్లు మంత్రి సర్దిచెపాల్సిన స్థాయిలో నేతలే ఒకరినొకరు తిట్టుకున్నంత పని చేశారు. భేటీ ప్రధాన ఉద్దేశం కంటే ఇవే ఎక్కువ కావడంతో చివరికి... సదస్సు ఏర్పాట్లపై చర్చించారు. మొదట ఈ నెల 24నే ఈ సదస్సు జరగాల్సి ఉన్నా తాజాగా 27కు వాయిదా వేశారు.
కాంగ్రెస్‌లో రభస
Published Fri, Oct 18 2013 9:16 AM | Last Updated on Fri, Sep 1 2017 11:44 PM
Advertisement
Advertisement