Ponam Prabhakar
-
విఘ్నం కలిగించొద్దు
-
‘పార్టీ మారితే చావుడప్పు కొడతాం’
సాక్షి, హైదరాబాద్: రాఫెల్ కుంభకోణంపై టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకే విభజన హామీలపై పోరాడుతున్నట్లు టీఆర్ఎస్ ఎంపీలు నటిస్తున్నారని విమర్శించారు. ఆదివారం ఆయన కరీంనగర్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాఫెల్ కుంభకోణంలో వాస్తవాలను ప్రజలకు వివరిస్తామన్నారు. రూ.526 కోట్లకు వచ్చే విమానాలను 1600 కోట్లకు ఎందుకు కొన్నారో తెలపాలని పొన్నం డిమాండ్ చేశారు. రాఫెల్ తయారికి హెచ్‌ఎఎల్‌లాంటి నవరత్న కంపెనీని కాదని ఎలాంటి అనుభవంలేని రిలయన్స్ కు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘‘రాఫెల్ విషయంలో కేంద్రం సుప్రీంకోర్టును తప్పదోవ పట్టించింది. రాఫెల్ ఒప్పందంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయడానికి ప్రధాని మోదీ ఎందుకు భయపడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ ఇక దుకాణం మూసుకోవాలి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించకుండా కేసీఆర్ ఫ్రెంట్ కోసం తిరుగుతున్నారు. మంత్రివర్గ విస్తరణ కోసం కాంగ్రెస పార్టీ ఎమ్మెల్యేల కోసం చూస్తున్నారు. టీఆర్ఎస్లో సమర్థులు లేరా?. శాసనమండలి సభ్యులను టీఆర్ఎస్లో విలీనం చేయడం సరికాదు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన నేతల ఇంటి ముందు చావు డప్పుకొట్టి శవయాత్రలు చేయాలని పార్టీని కోరాను. ఓటమితో మేం కుంగిపోలేదు. ఓటమికి కారణలేంటో విశ్లేషిస్తున్నాం. రాష్ట్రపతి రాక కోసం ఖర్చుపెట్టిన ఆరు కోట్లతో ఆసుపత్రి నిర్మించి ఉంటే ప్రజలకు ఉపయోగపడేది. -
రెండు లక్షలకు పైగా ఓట్లు గల్లంతు : పొన్నం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ మాజీం ఎంపీ పొన్న ప్రభాకర్ ఆరోపించారు. ఈ విషయాన్ని ఇదివరకే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014లో కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో 15 లక్షల, 50వేల, 834 ఓట్లు ఉంటే ప్రస్తుతం 13 లక్షల, 23 వేల, 433 ఓట్లు మాత్రమే ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఒక్క కరీంనగర్ పార్లమెంట్‌లోనే రెండు లక్షల ఇరవైవేలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయని తెలిపారు. ఓటర్ల జాబీతాలో జరుగుతున్న అవకతవకలకు బాధ్యలెవరని ఆయన ప్రశ్నించారు. ఒక్క కరీంనగర్ శాసనసభ నియోజవర్గంలోనే తొంభైవేలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. దీనిపై ఎన్నికల కమిషన్ సీరియస్‌గా స్పందించాలి. వీ.ఆర్వో పరీక్షలకు వెళ్లేందుకు బస్సుల సౌకర్యం లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కంగర కోలాన్ సభకు మాత్రం లక్షల బస్సులను తరలించారు. పరీక్షకు హాజరైనా మహిళల పుస్తెలు, మెట్టెలు తీసి వారిని అవమానపరిచారు. ఆ చర్యకు పాల్పడిని అధికారులపై చర్యలు తీసుకోవాలి. గవర్నర్ కూడా దీనిపై స్పందించాలి’’ అని పేర్కొన్నారు. -
‘ప్రగతి నివేదన’ అట్టర్ ఫ్లాప్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొంగరకలాన్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, కొండను తవ్వి ఎలుకను తీసిన చందంగా బహిరంగ సభ ఉందని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఘాటుగా విమర్శించారు. సోమవారం ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తామని, ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నామని కారాలు బీరాలు పలికిన టీఆర్ఎస్ నేతలు బహిరంగ సభ పేలవంగా సాగడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బహిరంగ సభ ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా తప్ప ఒరిగిందేమి లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వారం రోజులుగా చేసిన హంగామా అంతా ఇంతా కాదని, అధికార దర్పంతో, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు లెక్కలేసి జనాన్ని తరలించాలని సూచించిన ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అప్రజాస్వామిక పాలన సాగిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు తగిన శాస్తి జరిగిందని అన్నారు. కొత్త నిర్ణయాలు, జరిగిన అభివృద్ధిపై బహిరంగ సభ వేదిక నుంచి సీఎం ప్రసంగిస్తారని పదేపదే వల్లేవేసిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి ప్రసంగం పేలవంగా సాగడంతో గందరగోళంలో పడ్డారని అన్నారు. తెలంగాణ సాధనకు అమరులైన వారికి, బంధుమిత్ర కుటుంబాలకు వేదిక పైనుంచి ఏమి హామీ ఇచ్చారని ప్రశ్నించారు. అమరులవీరుల స్మారకార్థం నిర్మిస్తామన్న స్మృతి వనం నిర్మించలేదని మండిపడ్డారు. హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందని, హుస్సేన్ సాగర్ శుద్ధి, హైదరాబాద్ డల్లాస్, కరీంనగర్ లండన్ లాంటి హామీలపై మాట్లాడకుండా కమ్యూనిటీ భవనాలు, గొర్రెలు, బర్రెలు, ప్రాజెక్టులపై మాట్లాడటం ప్రజలను మభ్యపెట్టడమేనని విమర్శించారు. విద్య, వైద్య రంగాలు నాలుగేళ్లలో మరింత వెనుకబాటుకు గురయ్యాయని, శాతవాహన యూనివర్సిటీకి వీసీని నియమించలేని దుస్థితి నెలకొందని అన్నారు. బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే దేశిని చిన్నమల్లయ్య గురించి ప్రస్తావించడం విడ్డూరంగా ఉందని, ఆయన అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాక, మరణించాక కుటుంబాన్ని కూడా పరామర్శించలేని కేసీఆర్ శవరాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్, కాళోజీ నారాయణరావు, కొండా లక్ష్మణ్‌బాపూజీ, డాక్టర్ సినారెలు మరణించిన సమయంలో వారి స్మారకార్థం నిర్మిస్తామన్న విగ్రహాలు, ఘాట్లు ఏమయ్యాయని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు బోయిన్పల్లి వెంకటరామారావు మరణిస్తే ముఖ్యమంత్రి హోదాలో కరీంనగర్‌కు వచ్చి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించిన సమయంలో ఇచ్చిన హామీలకే దిక్కులేకుండా పోయిందని కేసీఆర్ తీరు ఓడ దాటాక ‘ఓడ మల్లన్న రేవు దాటాక బోడ మల్లన్న’ అన్న చందంగా ఉందని మండిపడ్డారు. టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తుంటే కాంగ్రెస్ నేతలకు లాగులు తడుస్తున్నాయని పదే పదే విమర్శించిన టీఆర్ఎస్ నేతలకు బహిరంగ సభ అట్టర్‌ఫ్లాప్ కావడంతో టీఆర్ఎస్ నేతల లాగులే తడుస్తున్నాయని అన్నారు. ప్రజాసంఘాలు, ప్రభుత్వ ప్రతినిధులతో స్టేట్ అడ్వయిజరీ కమిటీ వేస్తామన్న పెద్దమనిషి ఇప్పటికీ దాని ఊసెత్తడం లేదని, నిన్నటికి నిన్న పొరుగు రాష్ట్రం పోలీసులు వరవరరావును అరెస్టు చేసి తీసుకెళ్తే కేసీఆర్ కనీసంగా మాట్లాడలేదన్నారు. ఇసుక దందాలో రూ.1900 కోట్ల ఆదాయం వచ్చిందంటున్న ఆయన తెరవెనుక ఆయన సన్నిహితుల జేబుల్లోకి వెళ్లిన రూ.1900 కోట్ల గురించి ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. దళితుల ప్రాణాలు బలిగొన్న గోల్డ్‌మైన్ పేరుతో ఇసుకదందా చేసిన సంతోష్‌రావుకు రాజ్యసభ సభ్యునిగా ప్రమోషన్ ఇస్తే ఈ ప్రభుత్వాధినేతను ఏమనాలని ప్రశ్నించారు. గులాబీ వాడిపోయిందని టీఆర్ఎస్ పార్టీ మాటలు ప్రజలు ఇక నమ్మబోరని, గారడి మాటలు కట్టిపెట్టకపోతే ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని హెచ్చరించారు. విలేకర్ల సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యరావు, ఆకుల ప్రకాష్, చాడగోండ బుచ్చిరెడ్డి, బాశెట్టి కిషన్, కటుకం వెంకటరమణ, బోనాల శ్రీనివాస్, పొన్నం శ్రీనివాస్, పడిశెట్టి భూమయ్య, శ్రీరాముల కిషన్, తదితరులు పాల్గొన్నారు. -
వేములవాడ టీ కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలు
సాక్షి, సిరిసిల్లా : రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల మధ్య అంతర్గతంగా ఉన్న విబేధాలు మరో సారి భగ్గుమన్నాయి. తాజాగా సిరిసిల్లా జిల్లాలో కొనగాల మహేశ్, ఆది శ్రీనివాస్ వర్గాలుగా విడిపోయ్యాయి. దీంతో వేములవాడ పట్టణంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మృత్యుంజయం పాల్గొన్న సమావేశాన్ని మహేశ్ వర్గం వారు పూర్తిగా బహిష్కరించడంతో సొంత నియోజకవర్గంలోనే పొన్నంకు చుక్కెదురైంది. మాజీ ఎంపీ ప్రభాకర్ ఒంటెద్దు పోకడలకు విసిగిపోయి.. ఆయన నిర్వహించిన సమావేశానికి ఏఐసీసీ సభ్యులు కొనగాల మహేశ్‌తో సహా, మనోహర్ రెడ్డి, చంద్రశేఖర్, గంగాధర్, మండల అధ్యక్షులు, ఎంపీపీలు, సీనియర్ నాయకులు దూరంగా ఉన్నారు. వీరంతా కలసి కోరుట్లలో క్యాంప్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వేములవాడలో పార్టీని కాపాడుకునే విషయమై ఏఐసీసీ సభ్యులు కొనగాల మహేశ్ హైదరాబాద్ నుంచి చక్రం తిప్పుతున్నారు. -
ముఖ్యమంత్రిది బోగస్ సర్వే
► సంగారెడ్డి ప్రజాగర్జనకు తరలిరండి ► మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కరీంనగర్: సర్వేల పేరిట సీఎం కేసీఆర్ మాయచేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. మూడేళ్లుగా ఇచ్చిన వాగ్దానాలను అమలుచేయకుండా కాలయాపన చేస్తూ ప్రజలను దగా చేస్తున్నారన్నారు. సర్వేల మీద సర్వేలుచేస్తూ ఎమ్మెల్యేలకు మార్కులు వేస్తూ ప్రజా సమస్యలను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. 111 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలుస్తారని జోస్యం చెబుతున్న సీఎం ఎన్నికలకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్వే ఓ బూటకమని, ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా సీఎం తీరు ఉందన్నారు. జూన్ 1న సంగారెడ్డిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజాగర్జన బహిరంగసభకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హాజరుకానున్నారని. అన్నివర్గాల ప్రజలు భారీఎత్తున తరలిరావాలని కోరారు. కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు కర్ర రాజశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి ఆకుల ప్రకాశ్, ఒంటెల రత్నాకర్, అనుబంధ విభాగాల అధ్యక్షుడు దిండిగాల మధు, ఉప్పరి రవి, తాళ్లపల్లి శ్రీనివాస్, కటుకం వెంకటరమణ, పొన్నం శ్రీనివాస్, పొన్నం సత్యం, పాల్గొన్నారు. -
నల్లధనం వెలికితీత ఏమైంది : పొన్నం
కరీంనగర్: తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నల్లధనాన్ని వెలికి తీస్తామన్న బీజేపీ నాయకుల హామీ ఏమైందని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. గురువారం తన కార్యాలయంలో మోడీ పాలనపై భారతీయ కాంగ్రెస్ పార్టీ ‘ఆరు నెలల యూటర్న్ సర్కార్’ అనే పేరున రిలీజ్ చేసిన 30 పేజీల బుక్‌లెట్‌ను పత్రికలకు విడుదల చేశారు. పాకిస్థాన్ విషయంలో మన్మో హన్ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని విమర్శించిన బీజేపీ ఇప్పుడు పిల్లిమొగ్గలు వేస్తూ ఆ దేశంతో సంబంధాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని విమర్శించారు. ఆధార్‌ను చెల్లని కాగితంగా అభివర్ణించి ఇప్పుడు ప్రతి పథకానికి ఆధార్ కార్డును లింక్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి వాటిని స్వంత పథకాలుగా చెప్పుకొని పాలన బీజేపీ నేతలు పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. -
ప్రచార గడువు ముగిశాక బైక్ షికార్లు
వేములవాడ/సిరిసిల్లటౌన్, న్యూస్‌లైన్: ఎన్నికల ప్రచారానికి తెరపడ్డాక కూడా కాంగ్రెస్ నాయకులు ఊరుకోలేదు. మోడల్ కోడ్ కన్నుగప్పి పార్టీ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్.. వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ అభ్యర్థులతో ఆయా పట్టణాల్లో బైక్ షికార్లు చేశారు. ఇది వివాదాస్పదమైంది. సిరిసిల్లలో అభ్యర్థి కొండూరి రవీందర్‌రావుతో బైక్‌పై వెళ్లి నేరుగా ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. స్థానిక నెహ్రూనగర్ అంబాభవానీ ఆలయం వద్ద వందమందితో సమావేశమయ్యారని స్థానికు లు తెలిపారు. సుందరయ్యనగర్‌లో ప్రజలను ఓట్లను అభ్యర్థించారు. అక్కడి నుంచి పద్మనగర్‌కు వస్తున్నారని తెలుసుకున్న స్థానికులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. విషయం పోలీసులకు తెలియడంతో ఇరువర్గాలను చెదరగొట్టారు. ప్రచార వివాదం ముదురుతుందన్న భావనతో అభ్యర్థులు వెనుదిరిగినట్లు స్థానికులు తెలిపారు. మంగళవారం రాత్రి వేములవాడ రాజన్నను పొన్నం దర్శించుకున్నారు. అంతకుముందే ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మ వెంకటేశ్వర్లును బైక్‌పై ఎక్కిం చుకుని వీధుల్లో తిరిగారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థుల తీరును తీవ్రంగా ఖండి స్తున్నారు. ప్రచార గడువు ముగిశాక ఓటర్లను కలవడంపై మోడల్‌కోడ్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొంటున్నారు. కార్యకర్తలను కలిసిన పొన్నం! బోయినపల్లి: పొన్నం ప్రభాకర్ మంగళవారం పార్టీ స్థానిక కార్యాలయంలో కార్యకర్తలను కలిసివెళ్లినట్లు తెలిసింది. ప్రచా ర సమయంలో మండలానికి రాలేదు. కార్యకర్తలు అంసతృప్తికి గురి కాకుండా ఆయన ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. -
అతిరథులొచ్చినా అంతే..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : అతిరథ నేతలు పర్యటించినా.. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు సమసిపోలేదు. ప్రచార పర్వం ముగుస్తున్నా.. నేతల మధ్య సఖ్యత ఆమడదూరంగానే ఉంది. తమలో విభేదాలు లేవని చెప్పేందుకు అవకాశం దొరికినప్పుడల్లా కలిసికట్టుగా ఫోజులిచ్చిన జిల్లాలోని ముఖ్య నేతలు తీరా ఎన్నికల సమయంలో ఎవరికివారుగా చెల్లాచెదురయ్యారు. పోటీ తీవ్రంగా ఉండటంతో మంత్రి శ్రీధర్‌బాబు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి సహా ఎమ్మెల్యే అభ్యర్థులందరూ సొంత నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. ఎంపీ పొన్నం ప్రభాకర్, వివేక్ తమ సెగ్మెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలు కలియదిరుగుతున్నారు. అంతకుమించి నేతలంద రూ ఏకతాటిపైకి వచ్చి.. అసమ్మతి వర్గీయులను.. పార్టీ అభ్యర్థులకు స్థానికంగా ఎదురవుతున్న చిక్కుముళ్లను విప్పేం దుకు ప్రయత్నం చేయటం లేదు. ఎక్కడివారక్కడే.. ఎవరికివారుగా గిరి గీసుకున్నట్లుగా ప్రచారంలో తలమునకలయ్యారు. జిల్లా లో ఆరు నియోజకవర్గాల్లో పార్టీలో విభేదాలు అభ్యర్థుల ప్రచారానికి బ్రేకులు వేస్తున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు మిగతా వారిని సముదాయించి.. సఖ్యతతో కలుపుకుపోవటం లో విఫలమయ్యారు. దీంతో టిక్కెట్ల రేసులో ఉన్న కలహాలు.. విభేదా లు ఇప్పటికీ అభ్యర్థులను వెంటాడుతున్నాయి. రామగుండం, కోరుట్ల నియోజకవర్గాలో పార్టీ టికెట్లు ఆశించి భంగపడ్డ అభ్యర్థులు..రెబల్స్‌గా బరిలోకి దిగినా ముఖ్య నేతలు నచ్చజెప్పే ప్రయత్నం లేదు. అక్కడ తిరుగుబాటు జోరును తట్టుకోలేక పార్టీ అభ్యర్థులు చిక్కుల్లో పడ్డారు. హుజూరాబాద్, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో అసంతృప్తులు.. లోపాయకారీగా ఇతర పార్టీలతో చేతులు కలిపారు. సొంత పార్టీ అభ్యర్థుల పాలిట గుదిబండగా మారారు. కొందరు ఇప్పటికీ ప్రచారంలో పాలుపంచుకోవటం లేదు. రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి బాబర్ సలీంపాషాకు ఇంటిపోరు మొదలైంది. పార్టీ కేడర్ మొత్తం తన వెంట ఉన్నప్పటికీ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ కౌశిక హరినాథ్ పోటీలో ఉండటంతో ఇరకాటంలో పడ్డా రు. కోరుట్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థి కొమొరెడ్డి రామ్‌లుకు తిరుగుబాటు సవాలుగా మారింది. పార్టీ టికె ట్ రాకపోవటంతో జువ్వాడి నర్సింగరావు ఇండిపెండెంట్‌గా పోటీలో నిలిచారు. పార్టీ కేడర్‌ను సగానికిపైగా తనవైపునకు తిప్పుకున్నారు. నువ్వా,నేనా అంటూ పార్టీ అభ్యర్థికి సవాలు విసురుతున్నారు. హుజూరాబాద్‌లో ఇప్పటికీ పార్టీ నేతలు నాలుగు గ్రూపులుగా చెల్లాచెదురుగానే ఉన్నారు. పార్టీ అభ్యర్థి కేతిరి సుదర్శన్‌రెడ్డికి వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, తుమ్మేటి సమ్మిరెడ్డి సహకరించడం లేదు. వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి బొమ్మ వెంకటేశ్వర్లుకు పార్టీ శ్రేణుల సహకారం అంతంత మాత్రంగానే ఉంది. టికెట్ ఆశించిన ఏనుగు మనోహర్‌రెడ్డి వర్గం మొత్తం టీఆర్ఎస్లో చేరిపోయింది. ఆయన సైతం ప్రచారంలో అంటీముట్టన్నట్లు ఉంటున్నారు. పెద్దపల్లిలో టిక్కెట్టు ఆశించిన నేత లు పార్టీ ప్రచారంలో కలిసి కదలటం లేదు. సిరిసిల్లలో కాంగ్రె స్ పార్టీ అభ్యర్థి కొండూరి రవీందర్రావును అసమ్మతి బెడద వెంటాడుతోంది. టికెట్ దక్కని కేకే మహేందర్‌రెడ్డి లోపాయికారిగా బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లుగా ప్రచారం జోరందుకుం ది. పార్టీ మారి టిక్కెట్టు దక్కించుకోవటంతో చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుద్దాల దేవయ్యకు కాంగ్రెస్ నేతల సహకా రం కొత్త కొత్తగానే ఉంది. మంథనిలో శ్రీధర్‌బాబు, ధర్మపురి అభ్యర్థి మాజీ జెడ్పీ చైర్మన్ అడ్లూరి లక్ష్మన్కుమార్లకు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి జి.వివేక్‌కు ఎన్నికలకు ముందు బేధాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. ప్రచారంలో కలిసి కదులుతున్నారు. -
గవర్నర్‌ను కలిసిన ఎంపీ పొన్నం ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ శుక్రవారం సాయంత్రం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిశారు. విద్యుత్ కోతలవల్ల కరీంనగర్ జిల్లాలో రైతుల చేతికి రాబోయే పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని, మరో 15 రోజులపాటు విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. తన విజ్ఞప్తి పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. తెలంగాణలో విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించాలనే ఉద్దేశంతోనే నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యుత్ కేటాయింపుల విషయంలో ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. -
కాంగ్రెస్‌లో టిక్కెట్ల లొల్లి
కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ టికెట్ల లొల్లి ముదిరింది. టిక్కెట్లు కేటాయించే విషయంలో ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్ మధ్య గొడవ మొదలైంది. తన అనుచరుల పేర్లతో ఎంపీ ఓ జాబితా సిద్ధం చేయగా.. ఏకపక్షంగా ఎలా చేస్తారని సంతోష్‌కుమార్ ఫైర్ అయ్యారు. పార్టీ కోసం పనిచేసిన వారికి అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు నివాసంలో శుక్రవారం వీరిద్దరి మధ్య రగడ జరిగింది. కరీంనగర్‌సిటీ, న్యూస్‌లైన్ : నగరంలోని 50 డివిజన్లకు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన పీసీసీ పరిశీలకుడు శ్రీరాంభద్రయ్య.. అభ్యర్థుల ఎంపిక కోసం రెండు రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేశారు. ఇందులో భాగంగా శుక్రవారం మాజీమంత్రి శ్రీధర్‌బాబుతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపిక జాబితాకు తుది రూపం ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా తాను రూపొందించిన జాబితాను అందించారు. అందులో శ్రీధర్‌బాబు అనుచరవర్గంగా గుర్తింపు పొందిన వి.అంజన్‌కుమార్, ఆమ ఆనంద్, ఇమ్రాన్, ఆకుల రాము వంటి వారి పేర్లు లేకపోవడంతో గొడవ మొదలైంది. అక్కడే ఉన్న ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్ తన స్వభావానికి భిన్నంగా ఎంపీ వైఖరిపై విరుచుకుపడడంతో అక్కడున్న నాయకులంతా అవాక్కయినట్లు సమాచారం. పార్టీ కోసం పనిచేస్తున్న అంజన్‌కుమార్, ఇమ్రాన్, ఆమ ఆనంద్, రాము తదితరుల అభ్యర్థిత్వాన్ని ఎంపీ కావాలనే తిరస్కరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎంపీ ఇచ్చిన జాబితాను ప్రకటిస్తే ఆ మరుక్షణమే మీడియా సమావేశంలో ఎండగడుతానని శ్రీధర్‌బాబును హెచ్చరిస్తూ అక్కడినుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. గొడవకు కారణమిది.. నగరంలోని 3వ డివిజన్ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్ సతీమణి శ్రీదేవి పార్టీ తరఫున నామినేషన్ వేశారు. పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు అర్ష మల్లేశం సతీమణి, మాజీ కౌన్సిలర్ కిరణ్మయి (బీసీ) కూడా పార్టీ నుంచే నామినేషన్ దాఖలు చేశారు. శ్రీదేవికి బదులు కిరణ్మయికి.. 19వ డివిజన్ నుంచి ఇమ్రాన్ టికెట్ ఆశిస్తున్నా.. చింతల కిషన్ వైపు, 32వ డివిజన్ నుంచి బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆమ ఆనంద్ టికెట్ ఆశిస్తున్నా.. పొన్నం శ్రీనివాస్‌కు.. 38వ డివిజన్ నుంచి ఆకుల రాము భార్య శిల్ప టికెట్ అడుగుతున్నా.. ఎంపీ పొన్నం మాత్రం సునీల్ కుటుంబంవైపు మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే అంజన్‌కుమార్, ఆమ ఆనంద్, ఇమ్రాన్, ఆకుల రాము ఇటీవలి కాలంలో శ్రీధర్‌బాబుకు ముఖ్యఅనుచరగణంగా ముద్రపడడం గమనార్హం. -
సభ వేళ... గ్రూపుల గోల
సాధారణ ఎన్నికలకు అధికార పార్టీని సన్నద్ధం చేయడం లక్ష్యంగా నిర్వహిస్తున్న తెలంగాణ కృతజ్ఞత సభ దగ్గరపడుతున్న కొద్ది జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు ముదురుతున్నాయి. జిల్లా స్థాయిలో పార్టీని రెండుగా విభజించిన మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్‌ల మార్గంలోనే నియోజకవర్గాల నేతలు పయనిస్తున్నారు. నాలుగైదు నియోజకవర్గాల్లో తప్పితే అంతటా అధికార పార్టీ గ్రూపులుగా విడిపోయింది. కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు ఎదిగితే తమకు ఇబ్బంది అనే కారణంతో మంత్రి, ఎంపీ అందరినీ అణగదొక్కుతున్నారు. ఇవీ గ్రూపు రాజకీయాలకు మరింత ఊతమిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : మంత్రి, ఎంపీలే స్వయంగా గ్రూపు రాజకీయాలను నడుపుతూ కింది స్థాయి నేతలకు ఇలాంటివి వద్దని చెప్పే పరిస్థితి లేకపోవడంతో అధికార పార్టీలో అయోమయ పరిస్థితి కొనసాగుతోంది. మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్ వర్గ రాజకీయాలతో ఇబ్బందులు ఉన్నా ఇన్నాళ్లు సర్దుకున్న నేతలు ఇప్పుడు ఇద్దరికీ దూరమవుతున్నారు. ఇద్దరిలో ఒకరికి సన్నిహితంగా ఉంటే మరొకరికి కోపం వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ రెండు నెలలుగా ఇద్దరికీ అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లా స్థాయి కార్యక్రమాలకు తాను ఒక్కడే హాజరవుతూ ప్రత్యేకతను నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి మొదటి నుంచి ఇలాగే వ్యవహరిస్తున్నారు. వీరిని గమనిస్తున్న నియోజకవర్గ స్థాయి నేతలు ఎవరికి వారు సొంత దారుల్లోనే వచ్చే ఎన్నికల్లో బరిలో దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్‌ల గ్రూపు రాజకీయాలతో విసిగి దూరమవుతున్న నేతల తీరు... అన్ని కలిసి జిల్లా కాంగ్రెస్ తరపున నవంబరు 24న తలపెట్టిన తెలంగాణ కృతజ్ఞత సభ నిర్వహణపై ప్రభావం పడుతోందని అధికార పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి, ఎంపీలపైనే భారం.. నాలుగేళ్ల తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లాలో నిర్వహిస్తున్న భారీ బహిరంగసభ కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో లక్ష మందితో నిర్వహిస్తామని ప్రకటించిన ఈ సభ అక్టోబరు 27న జరగాల్సి ఉండగా, జోరు వానల కారణంగా ఈ నెల 24కు వాయిదా పడింది. మొదటి తేదీలోనే సభ జరుగుతుందని భావించి జిల్లాలోని నేతలు జనసమీకరణకు ప్రయత్నాలు చేశారు. జనసమీకరణ లక్ష్యం చేరుకుంటామని భావించారు. తెలంగాణ విషయంలో కేంద్రం ముందుకే పోతుండడంతో ఎన్నికల్లో సానుకూలత ఉంటుందని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం పోటీ అనేది జనసమీకరణకు అనుకూలంగా మారాల్సి ఉండగా జిల్లాలో దీనికి విరుద్ధంగా కనిపిస్తోంది. అభ్యర్థిత్వం విషయంలో గ్యారెంటీ లేనప్పుడు తామేందుకు ఖర్చు పెట్టుకోవాలని నేతల భావిస్తున్నారు. సభ నిర్వహణ కోసం ఇప్పటికే ఒకసారి ఖర్చు పెట్టామని... మళ్లీ అంటే తమ వల్ల కాదని అంటున్నారు. జిల్లా పార్టీలో అంతా తామై నడిపిస్తున్న మంత్రి, ఎంపీలు ఇప్పుడు బాధ్యతలు తమపైనే వేయడం సమంజసం కాదని చెబుతున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సభ పూర్తయ్యే సరికి జిల్లా, నియోజవర్గ స్థాయిలోని గ్రూపు రాజకీయాలు ఇంకా తీవ్రమయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చల్మెడ లక్ష్మీనర్సింహరావు వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేయాలని భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణగౌడ్, మాజీ మేయర్ డి.శంకర్, వై.సునీల్‌రావు ఇక్కడి నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. జిల్లా కేంద్రంలో బలమైన నేత ఉంటే తమకు ఇబ్బంది అనే ఉద్దేశంతో మంత్రి, ఎంపీలు అందరికీ వేర్వేరుగా సహకరిస్తున్నారు. జిల్లా కేంద్రం తర్వాత కీలకమైన రామగుండం నియోజకవర్గంలోను ఒకే నేత ఎదగకుండా మంత్రి శ్రీధర్‌బాబు ఎక్కువ మందిని ప్రోత్సహిస్తున్నారు. నియోజకవర్గంలో ఆరు గ్రూపులు ఉంటే... అన్ని వర్గాల నాయకులు మంత్రి శ్రీధర్‌బాబు అనుచరులుగానే ఉన్నారు. బాబర్‌సలీంపాషా, కౌషిక్ హరి, హర్కర వేణుగోపాల్‌రావు, కోలేటి దామోదర్, తానిపర్తి గోపాల్‌రావు, బడికెల రాజలింగం ఇక్కడ నాయకత్వం కోసం పోటీ పడుతున్నారు. డీసీసీ చైర్మన్ కె.రవీందర్రావు సొంత నియోజకవర్గం సిరిసిల్లలో రెండుమూడు నెలలు స్తబ్ధుగా ఉన్న వర్గ రాజకీయం మళ్లీ మొదలైంది. ఇన్నాళ్లు మంత్రి శ్రీధర్‌బాబుకు వ్యతిరేకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం ఇటీవలే దగ్గరయ్యారు. తాజాగా మృత్యుంజయంకు మళ్లీ పీసీసీ అధికార ప్రతినిధి పదవి రావడంతో మళ్లీ గ్రూపు రాజకీయాలు పెరిగే పరిస్థితి నెలకొంది. వీరిద్దరు కాకుండా పీసీసీ మరో అధికార ప్రతినిధి సిహెచ్.ఉమేశ్‌రావు, ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన కేకే.మహేందర్‌రెడ్డి ఇక్కడ టిక్కెట్ కోసం వేచిచూస్తున్నారు. హుస్నాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి వ్యతిరేకంగా కేతిరి సుదర్శన్‌రెడ్డి బహిరంగానే పని చేస్తున్నారు. బొమ్మ శ్రీరాంచక్రవర్తి ఇదే పనిలో ఉన్నారు. వీరిద్దరికి తోడు ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ గ్రూపుల సమీకరణలు మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ముకుందరెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు ఇక్కడ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ సీనియర్ నేత సి.సత్యనారాయణరెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ముకుందరెడ్డి ముందుకు వెళ్తున్నారు. నియోజకవర్గంలో ముకుందరెడ్డి ఎక్కువగా తిరుగుతున్నారు. ఎమ్మెల్సీ భానుప్రసాదరావు నెలకోసారి కూడా నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈయనకు ఇబ్బందికరంగా మారుతోంది. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నాలుగు వర్గాలుగా ఉంది. ఇక్కడ తనకు ఇబ్బంది లేకుండా చేసుకునేందుకు కేతిరి సుదర్శన్‌రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రవీణ్‌రెడ్డిని ఇబ్బంది పెడుతున్నారు. ఈయనకు తోడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, పరిపాటి రవీందర్‌రెడ్డి, తుమ్మేటి సమ్మిరెడ్డి టిక్కెట్ రేసులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. వేములవాడలో కాంగ్రెస్‌కు మొదటి నుంచి నాయకత్వ సమస్య ఉంటోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి పని చేసుకుంటూపోతున్నారు. ఎంపీ పొన్నం ప్రభాకర్ భవిష్యత్ యోచనతో ఇక్కడ ఇతర నాయకులను ఎదగకుండా చేస్తున్నారనే అభిప్రాయం ఉంది. కోరుట్ల నియోజకవర్గంలోనూ మాజీ మంత్రి జువ్వాడి కుటుంబం, మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రాములు, జె.ఎన్.వెంకట్, కల్వకుంట్ల సుజిత్‌రావు తలో దిక్కుగా పని చేసుకుంటున్నారు. చొప్పదండి నియోజకవర్గంలో సీనియర్ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్యను ఎదుర్కొనే నాయకుడు కాంగ్రెస్‌కు ఇప్పటికీ ఎవరూ లేని పరిస్థితి ఉంది. -
సుజల స్రవంతి.. తీర్చేనా దాహార్తి!
సాక్షి, కరీంనగర్ : జిల్లా ప్రజల దాహార్తి తీరనుంది. ప్రజలందరికీ రక్షితనీటి సరఫరాకు అవసరమైన రూ.930 కోట్ల నిధుల మంజూరుకు మంత్రి శ్రీధర్‌బాబు, కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేసిన విన్నపానికి రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరాశాఖ మంత్రి కె.జానారెడ్డి సానుకూలంగా స్పందించారు. విడతల వారీగా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ నగర తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని తరలించేందుకు రూ.3,500 కోట్లతో సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. జిల్లా నుంచి నీటిని తరలిస్తూ జిల్లా గొంతు తడపకపోవడం పట్ల ఎంపీ పొన్నం ప్రభాకర్ పలు వేదికల మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 10 నెలల కిందట ముఖ్యమంత్రి కిరణ్ హుస్నాబాద్ రాగా ప్రభాకర్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. జిల్లా అంతటా తాగునీటి సమస్య పరిష్కారమయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటికే ఉన్న అన్ని పథకాలను అనుసంధానం చేస్తూ కొత్త పథకాలను చేరుస్తూ ప్రణాళిక తయారీలో అధికారులు జాప్యం చేశారు. గత నెల 27న జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నాల లక్ష్మయ్య నిర్వహించిన సమీక్షలో ఎంపీ ఈ విషయాన్ని లేవనెత్తి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నాల కూడా అధికారుల తీరును తప్పుబట్టారు. ఆయన ఆదేశాలతో ఐదురోజుల్లో ప్రణాళికను సిద్ధం చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు శనివారం సమగ్ర అంచనాలను ప్రభుత్వానికి పంపించారు. ఈ నిధులు మంజూరు చేయాలని జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ఆదివారం మంత్రి జానారెడ్డిని కలిసి విన్నవించగా ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. -
కాంగ్రెస్‌లో రభస
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఏర్పాటు ప్రకటనతో జైత్రయాత్ర సదస్సు ఏర్పాట్లకోసం నిర్వహించిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో గ్రూపు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. పలు నియోజకవర్గాల నేతలు పరస్పరం వాదులాటకు దిగారు. కొందరు నేతలు ఏకంగా ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో పార్టీపరంగా అన్ని జిల్లాల్లో జైత్రయాత్ర పేరిట భారీ సదస్సులు నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారు. ఇందులో భాగంగా కరీంనగర్లో ఈ నెల 27న సదస్సు నిర్వహించాల్సి ఉంది. జైత్రయాత్ర సదస్సు విజయవంతం చేసేందుకు గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. డీసీసీ అధ్యక్షుడు కొండూరి రవీందర్రావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సదస్సు ఏర్పాట్లపై కంటే నియోజకవర్గాల్లోని గ్రూపు రాజకీయాలు, సమన్వయలేమి అంశాలే ఎక్కువగా చర్చకు వచ్చాయి. కాంగ్రెస్‌కు సంబంధించి జిల్లాలో రెండు వర్గాలుగా ఉన్న మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్ ఈ భేటీలోనూ ఇదే రకంగా వ్యవహరించారు. మంత్రి శ్రీధర్‌బాబు యథావిధిగా ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. కరీంనగర్లో పార్టీ పరిస్థితి బాగాలేదని చెప్పుకొచ్చారు. నేతల మధ్య సమన్వయం ఉండడంలేదని, జిల్లా కేంద్రంలోనే ఇలా ఉంటే ఈ ప్రభావం మిగిలిన నియోజకవర్గాల్లోనూ పడుతోందని అన్నారు. ప్రత్యర్థి పార్టీల నేతల విమర్శలపై పార్టీ పదవుల్లో ఉన్నవారు ఆశించిన మేరకు స్పందించడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవన్నీ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావుతోనే స్పష్టం చేశారు. అయితే అసలు ఉద్దేశం మాత్రం ఎంపీ పొన్నం ప్రభాకర్ లక్ష్యంగా ఉందని సమావేశంలో ఉన్న నేతలు చెబుతున్నారు. పొన్నం ప్రభాకర్ అనుచరుడు కన్న కృష్ట ప్రస్తుతం కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయనతోపాటు పలువురు పొన్నం అనుచరులు మంత్రిపై వచ్చిన విమర్శలను ఖండించడంలో చొరవ తీసుకోవడంలేదనే ఉద్దేశంతోనే ఇలా అన్నట్లు భేటీలో ఉన్న నేతలు అంటున్నారు. కరీంనగర్లో పార్టీ నేతల సమన్వయలోపంపై మంత్రి వివరంగా మాట్లాడిన తర్వాత... మంత్రికి దగ్గరగా ఉండే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ భేటీలో మరింత తీవ్రంగా స్పందించారు. ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌తో ఇటీవల పెరిగిన సవాళ్ల రాజకీయంలో టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు రవీందర్‌సింగ్ స్పందిస్తుంటే... కాంగ్రెస్ నగర పార్టీ నేతలు ఎందుకు మాట్లాడరని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో అసంతృప్తి ఉన్న మంత్రి శ్రీధర్‌బాబు అండతోనే భేటీలో అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఇలా మాట్లాడినట్లు ఎంపీ వర్గీయులు చెబుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ మైనారిటీ సెల్ నగర కన్వీనరుగా నియమితుడైన ఓ నేత స్వీట్లు తెచ్చి అక్కడి నేతలకు ఇస్తుంటే... ఎంపీ పొన్నం జోక్యం చేసుకుని తమకు తెలియకుండా పదవులు ఎలా ఇచ్చుకుంటారని అనడం కొద్దిసేపు వాగ్వాదానికి దారితీసింది. మైనారిటీ నేతలపై ఎంపీ ప్రశ్నలకు వారు తీవ్రంగా స్పందించారు. ‘మాకు నామినేటెడ్ పదవులు లేవు. మీరు ఇప్పించేందుకు జోక్యం చేసుకోరు. పార్టీలోని చిన్న పదవులు ఇచ్చుకుంటే వాటిపైనా మాట్లాడుతారు. అసలు మైనారిటీల గురించి మీరు ఏం చేశారు. ఇతర పార్టీలోని మైనారిటీ నేతలు మమ్మల్ని చూసే నవ్వే పరిస్థితి ఉంది. చిన్న పదవులు కూడా ఇంత రాజకీయం ఏమిటి’ అని ప్రశ్నించగా, ఎంపీ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. రామగుండం నియోజకవర్గంలోని ముఖ్యనేతలు కోలెటి దామోదర్, బాబర్‌సలీంపాషా ఒకరిపై ఒకరు కేకలు వేసుకున్నారు. రామగుండంలో బీపీఎల్ ధర్మల్ ప్లాంటు తరలింపుపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని కోలేటి దామోదర్ ప్రకటించడంపై బాబర్ సలీంపాషా తీవ్రంగా స్పందించారు. అలా ప్రకటించడానికి దామోదర్ ఎవరని ప్రశ్నించారు. అఖిలపక్షం అనే మాటలు ఏమిటని, నియోజకవర్గ ఇన్చార్జి అయిన తాను లేకుండా ఎలా కార్యక్రమాలు చేస్తారని గట్టిగా అడిగారు. ఇద్దరి మధ్యమాటల తీవ్రత పెరగడంతో మంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. ఇలా సమావేశంలో పలుసార్లు మంత్రి సర్దిచెపాల్సిన స్థాయిలో నేతలే ఒకరినొకరు తిట్టుకున్నంత పని చేశారు. భేటీ ప్రధాన ఉద్దేశం కంటే ఇవే ఎక్కువ కావడంతో చివరికి... సదస్సు ఏర్పాట్లపై చర్చించారు. మొదట ఈ నెల 24నే ఈ సదస్సు జరగాల్సి ఉన్నా తాజాగా 27కు వాయిదా వేశారు. -
కంగాళీ కాంగ్రెస్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : అధికార పార్టీలో జిల్లాకు సంబంధించి మంత్రి శ్రీధర్‌బాబుతో ఎంపీలు పొన్నం ప్రభాకర్, జి.వివేకానందకు తీవ్రస్థాయిలో విభేదాలుండేవి. మంత్రితో తమకున్న విభేదాల కారణంగా ఎంపీలు ఇద్దరూ ఒక్కటిగా ఉండేవారు. పెద్దపల్లి ఎంపీ వివేకానంద కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరడంతో ఇప్పుడు జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా ఉంది. తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత ఈ రెండు వర్గాల మధ్య దూరం మరింత పెరిగినట్లు కాంగ్రెస్ శ్రేణులే చెబుతున్నాయి. తెలంగాణ ప్రకటనకు ముందు తనకు చెక్ పెట్టేందుకు మంత్రి ప్రయత్నించాడనే కారణంతో ఎంపీ పొన్నం ప్రభాకర్ ఉండేవారు. సిరిసిల్ల అర్బన్ బ్యాంకు వ్యవహారంతో ఇది మరింత తీవ్రమైంది. తెలంగాణ ప్రకటన వచ్చాక వీరిద్దరి క్రెడిట్ ఫైట్ రూపంలో ఇది కొనసాగుతోంది. సీనియర్ నేతలు ఉన్న నియోజకవర్గాల్లో మినహాయిస్తే... అన్ని చోట్ల మూడు గ్రూపులు, ఆరు వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.రవీందర్రావు సొంత నియోజకవర్గం సిరిసిల్లలో గ్రూపులు ఎక్కువగా ఉన్నాయి. రవీందర్‌రావుకు పోటీగా ఇక్కడ పీసీసీ అధికార ప్రతినిధి సీహెచ్.ఉమేశ్‌రావు, మాజీ అధికార ప్రతినిధి కె.మృత్యుంజయం వేర్వేరు వర్గాలుగా ఉన్నారు. ఇటీవలే మళ్లీ కాంగ్రెస్‌లో చేరిన కె.కె.మహేందర్‌రెడ్డి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పని చేస్తే... అప్పుడు ఆధిప్యత పోరు నాలుగు వర్గాలకు పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గంలో మూడు గ్రూపులు ఉన్నాయి. ప్రవీణ్‌రెడ్డి సొంతంగానే ముందుకు వెళ్తూ మంత్రి శ్రీధర్‌బాబుతో సమన్వయంతో ఉన్నారు. ఎమ్మెల్యేకు పోటీగా ఇక్కడ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రత్యేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన బొమ్మ వెంకటేశ్వర్లు కుమారుడు, పీసీసీ కార్యదర్శి శ్రీరాంచక్రవర్తి మంత్రితో సన్నిహితంగానే ఉంటూనే ప్రత్యేక వర్గాన్ని నడిపిస్తున్నారు. పెద్దపల్లిలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన గీట్ల ముకుందరెడ్డి ఇటీవల మళ్లీ క్రియాశీలమయ్యారు. ఇక్కడ ఎమ్మెల్సీ భానుప్రసాదరావు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. టికెట్ తనదేనని ముకుందరెడ్డి అంటున్నారు. ఇక్కడ ఎమ్మెల్సీకే మంత్రి సహకరిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రెండు గ్రూపులుగా ఉన్న ఇక్కడ ఇతర పార్టీలోని ఒక ముఖ్యనేతను తీసుకువచ్చేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. హుజూరాబాద్‌లో ఇప్పటికే నాలుగు వర్గాలు ఉన్నాయి. కొత్తగా మరో ఇద్దరు నియోజకవర్గస్థాయి నేతలు కూడా అధికార పార్టీలోకి వచ్చే పరిస్థితి ఉంది. ప్రస్తుతం కేతిరి సుదర్శన్‌రెడ్డి, వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, పరిపాటి రవీందర్‌రెడ్డి, తుమ్మేటి సమ్మిరెడ్డి ఎవరికి వారే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా నాలుగు గ్రూపులతో ఇక్కడ అధికార పార్టీ సుదీర్ఘకాలంగా అధికారానికి దూరంగానే ఉంటోంది. వేములవాడలో కాంగ్రెస్‌కు మొదటి నుంచి నాయకత్వ సమస్య ఉంటోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈయన ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు, మంత్రి శ్రీధర్‌బాబుకు దగ్గరగా ఉంటారు. తెలంగాణ ప్రకటన తర్వాత ఇక్కడ రాజకీయం మారుతోంది. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ఇద్దరు ముఖ్య నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తీగల రవీందర్‌గౌడ్, చెన్నమనేని శ్రీకుమార్ సోమవారం కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిసింది. వీరితోపాటు మరోనేత కూడా త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనుండడంతో ఇక్కడ అధికార పార్టీలో గ్రూపులు పెరిగే పరిస్థితి ఉంది. కరీంనగర్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన చల్మెడ లక్ష్మీనర్సింహారావు వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎంపీ పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్‌బాబు ఆశీస్సులతో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణగౌడ్, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, వై.సునీల్‌రావు ఇక్కడి నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడ వర్గ రాజకీయాలు అంతర్గతంగానే ఉన్నాయి. కోరుట్ల నియోజకవర్గంలోనూ నాలుగు వర్గాలు ఉన్నాయి. మాజీ మంత్రి జువ్వాడి కుటుంబం, మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రామ్‌లు, జె.ఎన్.వెంకట్, కల్వకుంట్ల సుజిత్‌రావు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ గ్రూపు రాజకీయాలతోనే ఓడిపోయిన కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా ఉంది. రామగుండం నియోజకవర్గంలో అధికార పార్టీ అరడజను గ్రూపులుగా ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన బాబర్‌సలీంపాషా, కౌశికహరి, హర్కర వేణుగోపాల్‌రావు, కోలేటి దామోదర్, తానిపర్తి గోపాల్‌రావు, బడితల రాజలింగం తలో వర్గంగా పని చేస్తున్నారు. వీరు కాకుండా మంత్రికి ఇక్కడ ఎప్పుడూ ప్రత్యేకంగా ఓ వర్గం ఉంటోంది. చొప్పదండి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గునుకొండ బాబు మళ్లీ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమ సంఘానికి చెందిన ఓ నాయకుడు సైతం ఇక్కడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు ప్రాతినిథ్యం వహిస్తున్న మంథని, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ ఎమ్మెల్యేగా ఉన్న మానకొండూరు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి నియోజకవర్గం జగిత్యాల, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇన్‌చార్జీగా ఉన్న ధర్మపురి నియోజకవర్గాల్లో మాత్రం గ్రూపులు కనిపించడం లేదు. -
సర్వాయి పాపన్న స్ఫూర్తితో ఉద్యమిద్దాం
సాక్షి, హైదరాబాద్ : కల్లుగీత వృత్తిని రక్షించుకుంటూ పొటీ ప్రపంచంలో నిలదొక్కుకునేందుకు ఐక్యత చాటుదామని టీ-ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో జాతి బాగు కోసం కలిసి ఉద్యమిద్దామన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో గౌడ్విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పాపన్న 363వ జయంతిని పురస్కరించుకొని గౌడ్ మహనీయుల జయంత్యుత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ కల్లుగీత వృత్తి ద్వారా ఆర్థికంగా ఎదుగుతూ పోటీ ప్రపంచంలో రాజకీయంగా ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత కులాన్ని ఎలా రక్షించుకోవాలా? అనే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. సభలో చేసే తీర్మానాల అమలుకు అందరం కలిసి పనిచేద్దామన్నారు. నటుడు సుమన్ మాట్లాడుతూ గొప్ప చరిత్ర కలిగిన నాయకుడు సర్దార్ పాపన్న అని కొనియాడారు. సమస్యలపై కలిసి పోరాడేందుకు ఇదే సరైన సమయమన్నారు. గీత కార్మికులకు బీమా పాలసీ ఒకటి తీసుకురావాలన్నారు. విద్యే ఆస్తి అనీ దీన్ని గౌడ కులస్తులెవరూ మరువకూడదని కోరారు. ఐఏఎస్ అధికారి అనిత మాట్లాడుతూ ఐక్యంగా ముందుకు సాగితే గౌడ్లు కూడా అగ్రకులాలకు సమానంగా ఎదుగుతారన్నారు. ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో కల్లుకు నిర్ణీత రేటు నిర్ణయిద్దామని-డెయిరీని కూడా ఏర్పాటు చేసుకుందామన్నారు. టీడీపీ నేత వీరేందర్‌గౌడ్ మాట్లాడుతూ ఏదైనా పోరాడి సాధించుకోమని సర్ధార్ పాపన్న ఆనాడే చెప్పారన్నారు. టీడీపీ నేత అరవింద్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ సరికొత్త సామాజిక తెలంగాణను నిర్మించుకుందామన్నారు. అనంతరం కటింగ్ డౌ ట్రీ రూల్ నెంబర్ 27,(1968) జీఓ అమలు ఎక్సైజ్‌శాఖతో కావటంలేదనీ, దాన్ని ఫారెస్ట్, పోలీసు శాఖలకు మార్పు చేయించాలని, పాపన్న జయంత్యుత్సవాలను ప్రభుత్వమే జరపాలని, ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహం ఏర్పాటు చేసి, చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పొందుపరచాలని తీర్మానించారు. పాపన్న పేరుతో ఉన్న క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సభ నిర్వాహకులు రామారావుగౌడ్, పి.లక్ష్మణ్‌గౌడ్, డాక్టర్ ఎం.ఎస్.గౌడ్, డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, దత్తాద్రిగౌడ్ పాల్గొన్నారు. -
మితిమీరుతున్న సీమాంధ్రుల ఆందోళన
టవర్‌సర్కిల్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు సీమాంధ్రులు చేస్తున్న ఆందోళన మితిమీరుతోందని ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఏఐసీసీ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుపై తిరుమలలో జరిగిన దాడిని ఖం డించారు. శనివారం ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. కలిసి ఉండాలంటూనే తెలంగాణ ప్రజాప్రతినిధులపై దాడికి దిగడం సరికాదన్నా రు. తెలంగాణలో శాంతియుతంగా ఉద్యమిస్తుంటే ఉక్కుపాదంతో అణచివేసిన పోలీసులు.. సీమాంధ్రలో హింస జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సీమాంధ్రుల ఆందోళనలకు సహకరిస్తున్న డీజీపీని వెంటనే మార్చాల ని డిమాండ్ చేశారు. డీజీపీ వైఖరిపై ప్రధాని, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. సిరిసిల్లలో చేనేత పరి శ్రమను ఆధునీకరించేందుకు కేంద్ర మం త్రులతో మాట్లాడుతున్నానని చెప్పారు. ఆత్మహత్యలు లేకుండా అన్ని విధాలా చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్ర యత్నిస్తామని భరోసా ఇచ్చారు. సమావేశంలో నాయకులు సునీల్‌రావు, కర్ర రాజశేఖర్, కన్న కృష్ణ, అంజనీప్రసాద్, గందె మహేష్, సదానందచారి, మెండె చంద్రశేఖర్, బుచ్చిరెడ్డి, మోసిన్, ఎం.రాజేందర్, మనోహర్‌రెడ్డి, మదు తదిత రులు పాల్గొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి రెట్టింపు కృషి అవసరం వేములవాడ : తెలంగాణ పునర్నిర్మాణంలో రెట్టింపు కృషి అవసరమని ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం ఆయన రాజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఉద్యోగులు ఆయనను ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి ప్రజలెవరూ అశాంతికి తావివ్వలేదని, సీమాంధ్రులు కృత్రిమ ఉద్యమం ముసుగులో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. రమేశ్ సుప్రీంకు వెళ్తాననడం సరికాదు ఎమ్మెల్యే పదవికి అనర్హుడంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రమేశ్‌బాబు సుప్రీంకోర్టుకు వెళ్తాననడం సరికాదన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి, ఆలయ ఉద్యోగుల సంఘం నాయకులు హరికిషన్, తిరుపతి రావు, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, శ్రీరాములు, నునుగొండ రాజేందర్, కాంగ్రెస్ నాయకులు కట్కూరి శ్రీనివాస్, చిలుక రమేశ్, దైత కుమార్, శేఖర్, శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.