సర్వాయి పాపన్న స్ఫూర్తితో ఉద్యమిద్దాం
సాక్షి, హైదరాబాద్ : కల్లుగీత వృత్తిని రక్షించుకుంటూ పొటీ ప్రపంచంలో నిలదొక్కుకునేందుకు ఐక్యత చాటుదామని టీ-ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో జాతి బాగు కోసం కలిసి ఉద్యమిద్దామన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో గౌడ్‌విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పాపన్న 363వ జయంతిని పురస్కరించుకొని గౌడ్ మహనీయుల జయంత్యుత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ కల్లుగీత వృత్తి ద్వారా ఆర్థికంగా ఎదుగుతూ పోటీ ప్రపంచంలో రాజకీయంగా ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత కులాన్ని ఎలా రక్షించుకోవాలా? అనే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. సభలో చేసే తీర్మానాల అమలుకు అందరం కలిసి పనిచేద్దామన్నారు. నటుడు సుమన్ మాట్లాడుతూ గొప్ప చరిత్ర కలిగిన నాయకుడు సర్దార్ పాపన్న అని కొనియాడారు. సమస్యలపై కలిసి పోరాడేందుకు ఇదే సరైన సమయమన్నారు. గీత కార్మికులకు బీమా పాలసీ ఒకటి తీసుకురావాలన్నారు. విద్యే ఆస్తి అనీ దీన్ని గౌడ కులస్తులెవరూ మరువకూడదని కోరారు. ఐఏఎస్ అధికారి అనిత మాట్లాడుతూ ఐక్యంగా ముందుకు సాగితే గౌడ్‌లు కూడా అగ్రకులాలకు సమానంగా ఎదుగుతారన్నారు. ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో కల్లుకు నిర్ణీత రేటు నిర్ణయిద్దామని-డెయిరీని కూడా ఏర్పాటు చేసుకుందామన్నారు.
టీడీపీ నేత వీరేందర్‌గౌడ్ మాట్లాడుతూ ఏదైనా పోరాడి సాధించుకోమని సర్ధార్ పాపన్న ఆనాడే చెప్పారన్నారు. టీడీపీ నేత అరవింద్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ సరికొత్త సామాజిక తెలంగాణను నిర్మించుకుందామన్నారు. అనంతరం కటింగ్ డౌ ట్రీ రూల్ నెంబర్ 27,(1968) జీఓ అమలు ఎక్సైజ్‌శాఖతో కావటంలేదనీ, దాన్ని ఫారెస్ట్, పోలీసు శాఖలకు మార్పు చేయించాలని, పాపన్న జయంత్యుత్సవాలను ప్రభుత్వమే జరపాలని, ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహం ఏర్పాటు చేసి, చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పొందుపరచాలని తీర్మానించారు. పాపన్న పేరుతో ఉన్న క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సభ నిర్వాహకులు రామారావుగౌడ్, పి.లక్ష్మణ్‌గౌడ్, డాక్టర్ ఎం.ఎస్.గౌడ్, డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, దత్తాద్రిగౌడ్ పాల్గొన్నారు.