మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
రవీంద్రభారతిలో ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
గన్‌ఫౌండ్రి (హైదరాబాద్): చిన్న లోపాన్ని చూసుకొని మానసికంగా కుంగిపోవద్దని ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. త్వరలోనే దివ్యాంగులకు పెన్షన్ పెంచడంతో పాటు వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దివ్యాంగులకు రూ.300 పెన్షన్ ఇస్తోందని అది రూ.3 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. గత 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్‌ను ఒక్క రూపాయి కూడా పెంచకపోవడం దారుణమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ బుచి్చనేని వీరయ్య మాట్లాడుతూ, రాబోయే రెండు నెలల్లో 40 శాతం వైకల్యానికి ఉచితంగా సహాయ ఉపకరణాలు పంచుతున్నట్లు ప్రకటించారు.
అనంతరం వివిధ రంగాలలో అద్భుత విజయాలు సాధించిన దివ్యాంగులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు దివ్యాంగులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కాళ్లులేని దివ్యాంగులకు మంత్రి సీతక్క స్వయంగా కృత్రిమ కాళ్లను తొడిగారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రాంచంద్రన్, డైరెక్టర్ శైలజ, జీఎం.ప్రభంజన్‌రావులతో పాటు వివిధ వికలాంగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment