కంగాళీ కాంగ్రెస్ | Clashes in telangana congress party | Sakshi
Sakshi News home page

కంగాళీ కాంగ్రెస్

Published Sun, Sep 15 2013 4:09 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

Clashes in telangana congress party

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : అధికార పార్టీలో జిల్లాకు సంబంధించి మంత్రి శ్రీధర్‌బాబుతో ఎంపీలు పొన్నం ప్రభాకర్, జి.వివేకానందకు తీవ్రస్థాయిలో విభేదాలుండేవి. మంత్రితో తమకున్న విభేదాల కారణంగా ఎంపీలు ఇద్దరూ ఒక్కటిగా ఉండేవారు. పెద్దపల్లి ఎంపీ వివేకానంద కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఇప్పుడు జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా ఉంది. తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత ఈ రెండు వర్గాల మధ్య దూరం మరింత పెరిగినట్లు కాంగ్రెస్ శ్రేణులే చెబుతున్నాయి. తెలంగాణ ప్రకటనకు ముందు తనకు చెక్ పెట్టేందుకు మంత్రి ప్రయత్నించాడనే కారణంతో ఎంపీ పొన్నం ప్రభాకర్ ఉండేవారు. సిరిసిల్ల అర్బన్ బ్యాంకు వ్యవహారంతో ఇది మరింత తీవ్రమైంది. తెలంగాణ ప్రకటన వచ్చాక వీరిద్దరి క్రెడిట్ ఫైట్ రూపంలో ఇది కొనసాగుతోంది. సీనియర్ నేతలు ఉన్న నియోజకవర్గాల్లో మినహాయిస్తే... అన్ని చోట్ల మూడు గ్రూపులు, ఆరు వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ ఉంది.
 
  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.రవీందర్‌రావు సొంత నియోజకవర్గం సిరిసిల్లలో గ్రూపులు ఎక్కువగా ఉన్నాయి. రవీందర్‌రావుకు పోటీగా ఇక్కడ పీసీసీ అధికార ప్రతినిధి సీహెచ్.ఉమేశ్‌రావు, మాజీ అధికార ప్రతినిధి కె.మృత్యుంజయం వేర్వేరు వర్గాలుగా ఉన్నారు. ఇటీవలే మళ్లీ కాంగ్రెస్‌లో చేరిన కె.కె.మహేందర్‌రెడ్డి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పని చేస్తే... అప్పుడు ఆధిప్యత పోరు నాలుగు వర్గాలకు పెరుగుతుంది.
 
   కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గంలో  మూడు గ్రూపులు ఉన్నాయి. ప్రవీణ్‌రెడ్డి సొంతంగానే ముందుకు వెళ్తూ మంత్రి శ్రీధర్‌బాబుతో సమన్వయంతో ఉన్నారు. ఎమ్మెల్యేకు పోటీగా ఇక్కడ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రత్యేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన బొమ్మ వెంకటేశ్వర్లు కుమారుడు, పీసీసీ కార్యదర్శి శ్రీరాంచక్రవర్తి మంత్రితో సన్నిహితంగానే ఉంటూనే ప్రత్యేక వర్గాన్ని నడిపిస్తున్నారు.
 
   పెద్దపల్లిలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన గీట్ల ముకుందరెడ్డి ఇటీవల మళ్లీ క్రియాశీలమయ్యారు. ఇక్కడ ఎమ్మెల్సీ భానుప్రసాదరావు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. టికెట్ తనదేనని ముకుందరెడ్డి అంటున్నారు. ఇక్కడ ఎమ్మెల్సీకే మంత్రి సహకరిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రెండు గ్రూపులుగా ఉన్న ఇక్కడ ఇతర పార్టీలోని ఒక ముఖ్యనేతను తీసుకువచ్చేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
 
   హుజూరాబాద్‌లో ఇప్పటికే నాలుగు వర్గాలు ఉన్నాయి. కొత్తగా మరో ఇద్దరు నియోజకవర్గస్థాయి నేతలు కూడా అధికార పార్టీలోకి వచ్చే పరిస్థితి ఉంది. ప్రస్తుతం కేతిరి సుదర్శన్‌రెడ్డి, వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, పరిపాటి రవీందర్‌రెడ్డి, తుమ్మేటి సమ్మిరెడ్డి ఎవరికి వారే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా నాలుగు గ్రూపులతో ఇక్కడ అధికార పార్టీ సుదీర్ఘకాలంగా అధికారానికి దూరంగానే ఉంటోంది.
 
   వేములవాడలో కాంగ్రెస్‌కు మొదటి నుంచి నాయకత్వ సమస్య ఉంటోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈయన ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు, మంత్రి శ్రీధర్‌బాబుకు దగ్గరగా ఉంటారు. తెలంగాణ ప్రకటన తర్వాత ఇక్కడ రాజకీయం మారుతోంది. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ఇద్దరు ముఖ్య నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తీగల రవీందర్‌గౌడ్, చెన్నమనేని శ్రీకుమార్ సోమవారం కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిసింది. వీరితోపాటు మరోనేత కూడా త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనుండడంతో ఇక్కడ అధికార పార్టీలో గ్రూపులు పెరిగే పరిస్థితి ఉంది.
 
   కరీంనగర్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన చల్మెడ లక్ష్మీనర్సింహారావు వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎంపీ పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్‌బాబు ఆశీస్సులతో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణగౌడ్, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, వై.సునీల్‌రావు ఇక్కడి నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడ వర్గ రాజకీయాలు అంతర్గతంగానే ఉన్నాయి.
 
   కోరుట్ల నియోజకవర్గంలోనూ నాలుగు వర్గాలు ఉన్నాయి. మాజీ మంత్రి జువ్వాడి కుటుంబం, మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రామ్‌లు, జె.ఎన్.వెంకట్, కల్వకుంట్ల సుజిత్‌రావు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ గ్రూపు రాజకీయాలతోనే ఓడిపోయిన కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా ఉంది.
 
   రామగుండం నియోజకవర్గంలో అధికార పార్టీ అరడజను గ్రూపులుగా ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన బాబర్‌సలీంపాషా, కౌశికహరి, హర్కర వేణుగోపాల్‌రావు, కోలేటి దామోదర్, తానిపర్తి గోపాల్‌రావు, బడితల రాజలింగం తలో వర్గంగా పని చేస్తున్నారు. వీరు కాకుండా మంత్రికి ఇక్కడ ఎప్పుడూ ప్రత్యేకంగా ఓ వర్గం ఉంటోంది.
 
   చొప్పదండి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గునుకొండ బాబు మళ్లీ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమ సంఘానికి చెందిన ఓ నాయకుడు సైతం ఇక్కడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
 
   మంత్రి శ్రీధర్‌బాబు ప్రాతినిథ్యం వహిస్తున్న మంథని, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ ఎమ్మెల్యేగా ఉన్న మానకొండూరు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి నియోజకవర్గం జగిత్యాల, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇన్‌చార్జీగా ఉన్న ధర్మపురి నియోజకవర్గాల్లో మాత్రం గ్రూపులు కనిపించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement