సాధారణ ఎన్నికలకు అధికార పార్టీని సన్నద్ధం చేయడం లక్ష్యంగా నిర్వహిస్తున్న తెలంగాణ కృతజ్ఞత సభ దగ్గరపడుతున్న కొద్ది జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు ముదురుతున్నాయి. జిల్లా స్థాయిలో పార్టీని రెండుగా విభజించిన మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్‌ల మార్గంలోనే నియోజకవర్గాల నేతలు పయనిస్తున్నారు. నాలుగైదు నియోజకవర్గాల్లో తప్పితే అంతటా అధికార పార్టీ గ్రూపులుగా విడిపోయింది. కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు ఎదిగితే తమకు ఇబ్బంది అనే కారణంతో మంత్రి, ఎంపీ అందరినీ అణగదొక్కుతున్నారు. ఇవీ గ్రూపు రాజకీయాలకు మరింత ఊతమిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : మంత్రి, ఎంపీలే స్వయంగా గ్రూపు రాజకీయాలను నడుపుతూ కింది స్థాయి నేతలకు ఇలాంటివి వద్దని చెప్పే పరిస్థితి లేకపోవడంతో అధికార పార్టీలో అయోమయ పరిస్థితి కొనసాగుతోంది. మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్ వర్గ రాజకీయాలతో ఇబ్బందులు ఉన్నా ఇన్నాళ్లు సర్దుకున్న నేతలు ఇప్పుడు ఇద్దరికీ దూరమవుతున్నారు.
ఇద్దరిలో ఒకరికి సన్నిహితంగా ఉంటే మరొకరికి కోపం వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ రెండు నెలలుగా ఇద్దరికీ అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లా స్థాయి కార్యక్రమాలకు తాను ఒక్కడే హాజరవుతూ ప్రత్యేకతను నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి మొదటి నుంచి ఇలాగే వ్యవహరిస్తున్నారు. వీరిని గమనిస్తున్న నియోజకవర్గ స్థాయి నేతలు ఎవరికి వారు సొంత దారుల్లోనే
వచ్చే ఎన్నికల్లో బరిలో దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్‌ల గ్రూపు రాజకీయాలతో విసిగి దూరమవుతున్న నేతల తీరు... అన్ని కలిసి జిల్లా కాంగ్రెస్ తరపున నవంబరు 24న తలపెట్టిన తెలంగాణ కృతజ్ఞత సభ నిర్వహణపై ప్రభావం పడుతోందని అధికార పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మంత్రి, ఎంపీలపైనే భారం..
నాలుగేళ్ల తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లాలో నిర్వహిస్తున్న భారీ బహిరంగసభ కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో లక్ష మందితో నిర్వహిస్తామని ప్రకటించిన ఈ సభ అక్టోబరు 27న జరగాల్సి ఉండగా, జోరు వానల కారణంగా ఈ నెల 24కు వాయిదా పడింది. మొదటి తేదీలోనే సభ జరుగుతుందని భావించి జిల్లాలోని నేతలు జనసమీకరణకు ప్రయత్నాలు చేశారు. జనసమీకరణ లక్ష్యం చేరుకుంటామని భావించారు. తెలంగాణ విషయంలో కేంద్రం ముందుకే పోతుండడంతో ఎన్నికల్లో సానుకూలత ఉంటుందని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం పోటీ అనేది జనసమీకరణకు అనుకూలంగా మారాల్సి ఉండగా జిల్లాలో దీనికి విరుద్ధంగా కనిపిస్తోంది.
అభ్యర్థిత్వం విషయంలో గ్యారెంటీ లేనప్పుడు తామేందుకు ఖర్చు పెట్టుకోవాలని నేతల భావిస్తున్నారు. సభ నిర్వహణ కోసం ఇప్పటికే ఒకసారి ఖర్చు పెట్టామని... మళ్లీ అంటే తమ వల్ల కాదని అంటున్నారు. జిల్లా పార్టీలో అంతా తామై నడిపిస్తున్న మంత్రి, ఎంపీలు ఇప్పుడు బాధ్యతలు తమపైనే వేయడం సమంజసం కాదని చెబుతున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సభ పూర్తయ్యే సరికి జిల్లా, నియోజవర్గ స్థాయిలోని గ్రూపు రాజకీయాలు ఇంకా తీవ్రమయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు.
కరీంనగర్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చల్మెడ లక్ష్మీనర్సింహరావు వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేయాలని భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణగౌడ్, మాజీ మేయర్ డి.శంకర్, వై.సునీల్‌రావు ఇక్కడి నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. జిల్లా కేంద్రంలో బలమైన నేత ఉంటే తమకు ఇబ్బంది అనే ఉద్దేశంతో మంత్రి, ఎంపీలు అందరికీ వేర్వేరుగా సహకరిస్తున్నారు.
జిల్లా కేంద్రం తర్వాత కీలకమైన రామగుండం నియోజకవర్గంలోను ఒకే నేత ఎదగకుండా మంత్రి శ్రీధర్‌బాబు ఎక్కువ మందిని ప్రోత్సహిస్తున్నారు. నియోజకవర్గంలో ఆరు గ్రూపులు ఉంటే... అన్ని వర్గాల నాయకులు మంత్రి శ్రీధర్‌బాబు అనుచరులుగానే ఉన్నారు. బాబర్‌సలీంపాషా, కౌషిక్ హరి, హర్కర వేణుగోపాల్‌రావు, కోలేటి దామోదర్, తానిపర్తి గోపాల్‌రావు, బడికెల రాజలింగం ఇక్కడ నాయకత్వం కోసం పోటీ పడుతున్నారు.
డీసీసీ చైర్మన్ కె.రవీందర్‌రావు సొంత నియోజకవర్గం సిరిసిల్లలో రెండుమూడు నెలలు స్తబ్ధుగా ఉన్న వర్గ రాజకీయం మళ్లీ మొదలైంది. ఇన్నాళ్లు మంత్రి శ్రీధర్‌బాబుకు వ్యతిరేకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం ఇటీవలే దగ్గరయ్యారు.
తాజాగా మృత్యుంజయంకు మళ్లీ పీసీసీ అధికార ప్రతినిధి పదవి రావడంతో మళ్లీ గ్రూపు రాజకీయాలు పెరిగే పరిస్థితి నెలకొంది. వీరిద్దరు కాకుండా పీసీసీ మరో అధికార ప్రతినిధి సిహెచ్.ఉమేశ్‌రావు, ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన కేకే.మహేందర్‌రెడ్డి ఇక్కడ టిక్కెట్ కోసం వేచిచూస్తున్నారు.
హుస్నాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి వ్యతిరేకంగా కేతిరి సుదర్శన్‌రెడ్డి బహిరంగానే పని చేస్తున్నారు. బొమ్మ శ్రీరాంచక్రవర్తి ఇదే పనిలో ఉన్నారు. వీరిద్దరికి తోడు ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
పెద్దపల్లిలో కాంగ్రెస్ గ్రూపుల సమీకరణలు మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ముకుందరెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు ఇక్కడ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. టీఆర్‌ఎస్ సీనియర్ నేత సి.సత్యనారాయణరెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ముకుందరెడ్డి ముందుకు వెళ్తున్నారు. నియోజకవర్గంలో ముకుందరెడ్డి ఎక్కువగా తిరుగుతున్నారు. ఎమ్మెల్సీ భానుప్రసాదరావు నెలకోసారి కూడా నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈయనకు ఇబ్బందికరంగా మారుతోంది.
హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నాలుగు వర్గాలుగా ఉంది. ఇక్కడ తనకు ఇబ్బంది లేకుండా చేసుకునేందుకు కేతిరి సుదర్శన్‌రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రవీణ్‌రెడ్డిని ఇబ్బంది పెడుతున్నారు. ఈయనకు తోడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, పరిపాటి రవీందర్‌రెడ్డి, తుమ్మేటి సమ్మిరెడ్డి టిక్కెట్ రేసులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
వేములవాడలో కాంగ్రెస్‌కు మొదటి నుంచి నాయకత్వ సమస్య ఉంటోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి పని చేసుకుంటూపోతున్నారు. ఎంపీ పొన్నం ప్రభాకర్ భవిష్యత్ యోచనతో ఇక్కడ ఇతర నాయకులను ఎదగకుండా చేస్తున్నారనే అభిప్రాయం ఉంది.
కోరుట్ల నియోజకవర్గంలోనూ మాజీ మంత్రి జువ్వాడి కుటుంబం, మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రాములు, జె.ఎన్.వెంకట్, కల్వకుంట్ల సుజిత్‌రావు తలో దిక్కుగా పని చేసుకుంటున్నారు.
చొప్పదండి నియోజకవర్గంలో సీనియర్ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్యను ఎదుర్కొనే నాయకుడు కాంగ్రెస్‌కు ఇప్పటికీ ఎవరూ లేని పరిస్థితి ఉంది.
సభ వేళ... గ్రూపుల గోల
Published Fri, Nov 15 2013 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM
Advertisement