సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : అతిరథ నేతలు పర్యటించినా.. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు సమసిపోలేదు. ప్రచార పర్వం ముగుస్తున్నా.. నేతల మధ్య సఖ్యత ఆమడదూరంగానే ఉంది. తమలో విభేదాలు లేవని చెప్పేందుకు అవకాశం దొరికినప్పుడల్లా కలిసికట్టుగా ఫోజులిచ్చిన జిల్లాలోని ముఖ్య నేతలు తీరా ఎన్నికల సమయంలో ఎవరికివారుగా చెల్లాచెదురయ్యారు. పోటీ తీవ్రంగా ఉండటంతో మంత్రి శ్రీధర్‌బాబు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి సహా ఎమ్మెల్యే అభ్యర్థులందరూ సొంత నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. ఎంపీ పొన్నం ప్రభాకర్, వివేక్ తమ సెగ్మెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలు కలియదిరుగుతున్నారు. అంతకుమించి నేతలంద రూ ఏకతాటిపైకి వచ్చి.. అసమ్మతి వర్గీయులను.. పార్టీ అభ్యర్థులకు స్థానికంగా ఎదురవుతున్న చిక్కుముళ్లను విప్పేం దుకు ప్రయత్నం చేయటం లేదు. ఎక్కడివారక్కడే.. ఎవరికివారుగా గిరి గీసుకున్నట్లుగా ప్రచారంలో తలమునకలయ్యారు. జిల్లా లో ఆరు నియోజకవర్గాల్లో పార్టీలో విభేదాలు అభ్యర్థుల ప్రచారానికి బ్రేకులు వేస్తున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు మిగతా వారిని సముదాయించి.. సఖ్యతతో కలుపుకుపోవటం లో విఫలమయ్యారు. దీంతో టిక్కెట్ల రేసులో ఉన్న కలహాలు.. విభేదా లు ఇప్పటికీ అభ్యర్థులను వెంటాడుతున్నాయి.
రామగుండం, కోరుట్ల నియోజకవర్గాలో పార్టీ టికెట్లు ఆశించి భంగపడ్డ అభ్యర్థులు..రెబల్స్‌గా బరిలోకి దిగినా ముఖ్య నేతలు నచ్చజెప్పే ప్రయత్నం లేదు. అక్కడ తిరుగుబాటు జోరును తట్టుకోలేక పార్టీ అభ్యర్థులు చిక్కుల్లో పడ్డారు. హుజూరాబాద్, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో అసంతృప్తులు.. లోపాయకారీగా ఇతర పార్టీలతో చేతులు కలిపారు. సొంత పార్టీ అభ్యర్థుల పాలిట గుదిబండగా మారారు. కొందరు ఇప్పటికీ ప్రచారంలో పాలుపంచుకోవటం లేదు.
రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి బాబర్ సలీంపాషాకు ఇంటిపోరు మొదలైంది. పార్టీ కేడర్ మొత్తం తన వెంట ఉన్నప్పటికీ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ కౌశిక హరినాథ్ పోటీలో ఉండటంతో ఇరకాటంలో పడ్డా రు. కోరుట్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థి కొమొరెడ్డి రామ్‌లుకు తిరుగుబాటు సవాలుగా మారింది. పార్టీ టికె ట్ రాకపోవటంతో జువ్వాడి నర్సింగరావు ఇండిపెండెంట్‌గా పోటీలో నిలిచారు. పార్టీ కేడర్‌ను సగానికిపైగా తనవైపునకు తిప్పుకున్నారు.
నువ్వా,నేనా అంటూ పార్టీ అభ్యర్థికి సవాలు విసురుతున్నారు. హుజూరాబాద్‌లో ఇప్పటికీ పార్టీ నేతలు నాలుగు గ్రూపులుగా చెల్లాచెదురుగానే ఉన్నారు. పార్టీ అభ్యర్థి కేతిరి సుదర్శన్‌రెడ్డికి వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, తుమ్మేటి సమ్మిరెడ్డి సహకరించడం లేదు. వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి బొమ్మ వెంకటేశ్వర్లుకు పార్టీ శ్రేణుల సహకారం అంతంత మాత్రంగానే ఉంది.
టికెట్ ఆశించిన ఏనుగు మనోహర్‌రెడ్డి వర్గం మొత్తం టీఆర్‌ఎస్‌లో చేరిపోయింది. ఆయన సైతం ప్రచారంలో అంటీముట్టన్నట్లు ఉంటున్నారు. పెద్దపల్లిలో టిక్కెట్టు ఆశించిన నేత లు పార్టీ ప్రచారంలో కలిసి కదలటం లేదు. సిరిసిల్లలో కాంగ్రె స్ పార్టీ అభ్యర్థి కొండూరి రవీందర్‌రావును అసమ్మతి బెడద వెంటాడుతోంది. టికెట్ దక్కని కేకే మహేందర్‌రెడ్డి లోపాయికారిగా బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లుగా ప్రచారం జోరందుకుం ది. పార్టీ మారి టిక్కెట్టు దక్కించుకోవటంతో చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుద్దాల దేవయ్యకు కాంగ్రెస్ నేతల సహకా రం కొత్త కొత్తగానే ఉంది. మంథనిలో శ్రీధర్‌బాబు, ధర్మపురి అభ్యర్థి మాజీ జెడ్పీ చైర్మన్ అడ్లూరి లక్ష్మన్‌కుమార్‌లకు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి జి.వివేక్‌కు ఎన్నికలకు ముందు బేధాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. ప్రచారంలో కలిసి కదులుతున్నారు.
అతిరథులొచ్చినా అంతే..
Published Sat, Apr 26 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 6:31 AM
Advertisement
Advertisement