ముఖ్యమంత్రిది బోగస్ సర్వే
► సంగారెడ్డి ప్రజాగర్జనకు తరలిరండి
► మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
కరీంనగర్: సర్వేల పేరిట సీఎం కేసీఆర్ మాయచేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. మూడేళ్లుగా ఇచ్చిన వాగ్దానాలను అమలుచేయకుండా కాలయాపన చేస్తూ ప్రజలను దగా చేస్తున్నారన్నారు. సర్వేల మీద సర్వేలుచేస్తూ ఎమ్మెల్యేలకు మార్కులు వేస్తూ ప్రజా సమస్యలను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు.
111 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలుస్తారని జోస్యం చెబుతున్న సీఎం ఎన్నికలకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్వే ఓ బూటకమని, ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా సీఎం తీరు ఉందన్నారు. జూన్ 1న సంగారెడ్డిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజాగర్జన బహిరంగసభకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హాజరుకానున్నారని. అన్నివర్గాల ప్రజలు భారీఎత్తున తరలిరావాలని కోరారు. కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు కర్ర రాజశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి ఆకుల ప్రకాశ్, ఒంటెల రత్నాకర్, అనుబంధ విభాగాల అధ్యక్షుడు దిండిగాల మధు, ఉప్పరి రవి, తాళ్లపల్లి శ్రీనివాస్, కటుకం వెంకటరమణ, పొన్నం శ్రీనివాస్, పొన్నం సత్యం, పాల్గొన్నారు.