Jaitra Yatra
-
ఆంతర్యంలోని ఆత్మీయతతోనే ఆశీర్వాదాలు...
అమ్మోరీయులనే శాపగ్రస్తుల సంతతికి చెందిన కనాను ప్రజలు గిబియోనీయులు. వాగ్దాన దేశమైన కనానులో యొహోషువా నాయకత్వంలో సాగుతున్న జైత్రయాత్రలో యొరికో, హాయి పట్టణాలు ధ్వంసమైనట్టే, తాము కూడా సంహారమవుతామని గ్రహించి శాంతి ఒప్పందం కోసం ఎక్కడో దూరదేశం నుండి వచ్చామంటూ గిబియోనీయులు కపట నాటకమాడి యొహోషువా శరణు కోరారు. దేవుని వద్ద విచారణ కూడా చెయ్యకుండానే, యొహోషువా వారికి ప్రమాణం చేశాడు. మూడు రోజుల తర్వాత వాస్తవం తెలిసి వారిని నిలదీస్తే, మీ దేవుడు చాలా గొప్పవాడు, మీ పక్షంగా గొప్ప కార్యాలు చేశాడని విని ఆయన శరణులో, మీ నీడలో బతకాలని నిర్ణయించుకున్నామని వారన్నారు. మాటిచ్చిన తర్వాత మడమ తిప్పకూడదన్న దేవుని పద్ధతికి లోబడి ఇశ్రాయేలీయులు తమ ప్రమాణాన్ని నిలబెట్టుకున్నారు. సంధి ఒప్పందానికి దేవుడు కూడా ఆమోదముద్ర వేశాడు. గిబియోనీయుల ఉదంతం విని ఆ వెంటనే మిగిలిన కనాను రాజులంతా కలిసి గిబియోనీయులతో సమిష్టిగా మహా యుద్ధం చెయ్యగా ఇశ్రాయేలీయులు కూడా వారికి అండగా నిలిచారు. దేవుడైతే ఒక రోజుపాటు సూర్యుణ్ణి ఉన్నచోటే నిలిపి మరీ వారికి ఘనవిజయాన్నిచ్చాడు(యొహో 10:12). ఇశ్రాయేలీయుల మధ్య పనివారుగా ఉండేందుకు అంగీకరించిన గిబియోనీయులకు, ఆలయంలో బలిపీఠం వద్ద కట్టెలు నరికే, నీళ్లు మోసితెచ్చే పనినిచ్చి, దేవుడు తన ఆరాధనా కార్యక్రమాల్లో వారికి భాగస్వామ్యాన్నిచ్చాడు. లేవీయులనే అర్చకులుండే పట్టణాల్లో దేవుడు గిబియోను పట్టణాన్నికూడా చేర్చాడు. దావీదు వద్ద ఉన్న 30 మంది మహా వీరుల్లో ఇష్మాయా అనే గిబియోనీయుడు కూడా ఉన్నాడని బైబిల్ చెబుతోంది. చక్రవర్తిగా సొలొమోను గిబియోనులో బలులర్పించినప్పుడు దేవుడు అక్కడే ప్రత్యక్షమై అతనికి వరాలనిచ్చాడు, బబులోను చెరనుండి తిరిగొచ్చిన వారిలో 95 మంది గిబియోనీయులు కూడా ఉన్నారని నెహెమ్యా రాశాడు. యెరూషలేము ప్రాకారాల పునర్నిర్మాణంలో కూడా గిబియోనీయుల ప్రస్తావన ఉంది. కాలగర్భంలో కలిసిపోవాల్సిన గిబియోనీయులకు దేవుడు ఇలా మహా చరిత్రనిచ్చాడు. కనానీయులంతా సంహారం కాగా. గిబియోనీయులు మాత్రం, దేవునికి తలవంచి, దేవుని ప్రజలతో సఖ్యత కోరుకొని తమ ప్రాణాలే కాదు, తమ ఉనికిని కూడా కాపాడుకున్నారు. పాముల వివేకం, పావురాల నిష్కపటత్వం విశ్వాసికుండాలన్న యేసుప్రభువు బోధకు గిబియోనీయలే ఉదాహరణ.తలుపు చిన్నదైతే తలవంచడమొక్కటే మార్గం. లేకపోతే తల బొప్పికట్టడం ఖాయం.అపకార దష్టితో కాక ప్రాణభీతితోనే గిబియోనీయులు కపట నాటకమాడారని దేవునికి ముందే తెలుసు. పైవేషాలను కాదు, ఆంతర్యంలో తన పట్ల వారికున్న విశ్వాసాన్ని, భయభక్తుల్ని దేవుడు చూశాడు. పైకి నీతిమంతుల్లాగా ఉన్నా ఆంతర్యంలో నిండా దుష్టత్వంతో జీవించేవాళ్లున్నారు. పైకి నాటకాలాడినా ఆంతర్యంలో ఆత్మీయత ఉన్నవాళ్లున్నారు. దేవుడు మాత్రం ఆంతర్యంలోని భక్తి, నీతి, పరిశుద్ధతను బట్టే ప్రతిస్పందిస్తాడు. కత్తితో తలపడటం కన్నా యుక్తితో మెలగడమే మెరుగనుకొని గిబియోనీయులు అలా గొప్ప ఉపద్రవం నుండి తప్పించుకోవడమే కాక, దేవుని ప్రజల్లో భాగమయ్యారు, దేవుని ఆశీర్వాదాలకూ పాత్రులయ్యారు. మనవాడు కదా, ఇలా చేయవచ్చా? అని ఇతరులను నిందించే ముందు, పైకి ఎంతో భక్తిగా, పవిత్రంగా, నీతిమంతుల్లాగా ప్రవర్తించే నా ఆంతర్యంలో లేదా మనవాళ్ళ ఆంతర్యంలో ఇంతటి మురికి కాలువలా? అని ప్రశ్నించుకునేవాడే నిజమైన విశ్వాసి. విశ్వాసి ఆంతర్యంలోని ఆత్మీయత, ఉదాత్తమైన ఆలోచనలను బట్టే దేవుడు అనూహ్యమైన విజయాలు, ఆశీర్వాదాలిస్తాడు, ఆ విశ్వాసినే కోట్లాదిమందికి ఆశీర్వాదంగా మార్చుస్తాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ Email: prabhukirant@gmail.com -
కాంగ్రెస్ నేతల మధ్య కుదరని ‘ఐ’క్యత
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జైత్రయాత్ర సభ నిర్వహణ ఏర్పాట్లు బాలారిష్టాలు దాటడం లేదు. నిర్మల్‌లో 13న నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు గడువు సరిగ్గా ఆరు రోజులే ఉంది. ఓ వైపు ఆ పా ర్టీలో కొలిక్కిరాని గ్రూపు తగాదాలు.. మరోవైపు రెండు రోజుల ముందు మొదల య్యే రచ్చబండ మూడో విడత.. 12, 13 తేదీల్లో ఢిల్లీకి టీ-మంత్రుల పయనం.. ఇవన్నీ జైత్రయాత్రకు ప్రతిబంధకాలుగా కనిపిస్తున్నాయి. నిర్మల్ కేంద్రంగా నిర్వహించే సభకు సక్సెస్ చేయడం కోసం బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డితో విభేదాలున్న మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు దూరంగా ఉన్నారు. ఆయనతోపాటు ముథోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ తదితరులు హాజరుకాలేదు. ఓ వైపు అధికార కార్యక్రమాలు, మరోవైపు టీ-మంత్రుల పర్యటనల నేపథ్యంలో సభను 13న నిర్వహిస్తారా? లేక మరో రోజుకు వాయిదా వేస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డీసీసీ సభకు ప్రేమ్‌సాగర్ దూరం నిర్మల్‌లో 13న నిర్వహించే బహిరంగ సభ సక్సెస్ కోసం ఆదిలాబాద్ డీసీసీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు రాలేదు. అదేవిధంగా ఆ పార్టీ ఎమ్మెల్సీ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ సుల్తాన్ అహ్మద్, మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ సమావేశానికి హాజరు కాలేదు. అయితే డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి వర్గంగా ఉన్న నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నడిపెల్లి దివాకర్‌రావు కార్యకర్తలతో హాజరయ్యారు. ప్రేమ్‌సాగర్‌రావు గ్రూపునకు చెందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, జాదవ్ అనిల్‌కుమార్‌లతోపాటు పలువురు మార్కెట్ కమిటీ చైర్మన్లు, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు సమావేశంలో పాల్గొన్నారు. రెండు వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు హాజరైనా, ఆశించిన స్థాయిలో కార్యకర్తలు హాజరయ్యేలా నాయకత్వం తీసుకున్న చర్యలు కనిపించలేదు. జైత్రయాత్ర సభ సక్సెస్‌కు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని భావించి ఏర్పాటు చేసిన సమావేశానికి కేడర్ అంతంత మాత్రంగానే హాజరుకావడం, రెండు గ్రూపులకు చెందిన కొందరు నేతలు హాజరైనా ముఖ్య నేతల గైర్హాజరు కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది. జైత్రయాత్రపై రచ్చబండ ప్రభావం నిర్మల్‌లో 13న జైత్రయాత్ర సదస్సుకు కాంగ్రెస్ పార్టీ భారీ సన్నాహాలు చేస్తుండగా అంతకు రెండు రోజుల ముందే రచ్చబండ మూడో విడతకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇటు జైత్రయాత్ర సభ, అటు మూడో విడత రచ్చబండ రెండు కూడా పార్టీకి ప్రతిష్టాత్మకమే. ఈ నేపథ్యంలో జైత్రయాత్ర సభ నిర్వహిస్తే రచ్చబండ ప్రభావం పడే అవకాశం ఉంది. సమైక్యాంధ్ర, తెలంగాణకు చెందిన మంత్రులు ఈనెల 12,13 తేదీల్లో వేర్వేరుగా కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)ను కలిసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రుల బృందం వేర్వేరుగా తెలంగాణ విభజనకు సంబంధించిన 11 విధివిధానాలను సూచించిన నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లడం టీ-మంత్రులకు అనివార్యం. ఈ నేపథ్యంలో జైత్రయాత్ర సభకు టీ-మంత్రులు హాజరయ్యే అవకాశం లేదని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఒకరు ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే రచ్చబండ కార్యక్రమాన్ని రద్దు చేస్తేనే జైత్రయాత్ర సభను సక్సెస్ చేసుకోవచ్చని.. దీనికి నిర్మల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, ఆత్రం సక్కు చొరవ చూపి ప్రభుత్వం ప్రకటన చేయించాలని సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి సూచించడం గమనార్హం. ఈ క్రమంలో నిర్మల్‌లో సభపై స్పష్టత రావాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
మారిన వేదిక?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘జైత్రయాత్ర’ సభ నిర్వహణపై కాంగ్రెస్ జిల్లా నేతల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు. తొలుత ఈ నెల 21న జిల్లాలో కాంగ్రెస్ సభను నిర్వహించేలా షెడ్యూలు రూపొందించారు. ఆ తర్వాత షెడ్యూలును ఒక రోజు ముందుకు జరిపి 20వ తేదీనే సభ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే జైత్రయాత్ర నిర్వహణ ఈ నెల 25వ తేదీ తర్వాతే ఉంటుందనేది తాజా సమాచారం. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రాతినిథ్యం వహిస్తున్న అందోలు నియోజకవర్గం కేంద్రం జోగిపేటలో జైత్రయాత్ర సభ నిర్వహణపై తొలుత చర్చలు సాగాయి. అధికార పార్టీ జిల్లా నేతలు కూడా సుముఖత వ్యక్తం చేశారు. తాజాగా సభ నిర్వహణ వేదికను జోగిపేటలో కాకుండా మరోచోటకు మార్చాలని నేతలు నిర్ణయించారు. పార్టీ అత్యంత బలహీనంగా ఉన్న సిద్దిపేటలో సభ ఏర్పాటు చేసే దిశగా చర్చలు సాగుతున్నాయి. సమీప బంధువు వివాహ వేడుక ఏర్పాట్లలో మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నిమగ్నమై ఉండటంతో సభ నిర్వహణ తేదీని వాయిదా వేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తిరిగి వచ్చిన తర్వాత కాంగ్రెస్ జిల్లా నేతల భేటీ జరుగుతుందని తెలుస్తోంది. కాగా సిద్దిపేటలో సభ ఏర్పాటు వెనుక తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతల వ్యూహం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్‌లో పార్టీ విలీనం ఉండబోదంటూ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటిస్తుండటంతో టీఆర్ఎస్ పురిటిగడ్డ సిద్దిపేట కేంద్రంగా సభ నిర్వహించాలనే నిర్ణయానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు వచ్చారు. సిద్దిపేటలో జరిగే సభకు జిల్లాతో పాటు పొరుగునే ఉన్న కరీంనగర్ నుంచి కూడా జన సమీకరణ జరపాలనే యోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అయితే పార్టీ బలహీనంగా ఉన్న చోట జన సమీకరణలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా అభాసుపాలవుతామనే ఆందోళన కాంగ్రెస్ నేతలను వెన్నాడుతోంది. సంగారెడ్డిలో భారీ సభ? ఇక సంగారెడ్డి ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి సొంతంగా జిల్లా కేంద్రంలో భారీ సభ నిర్వహించే యోచనలో ఉన్నారు. జైత్రయాత్ర సభకు ఆయన హాజరయ్యే అవకాశం లేకపోవడంతో నియోజకవర్గంలో తన ఉనికి చాటుకునే రీతిలో సభ నిర్వహణ ఉంటుందని ఎమ్మెల్యే సన్నిహితులు చెబుతున్నారు. సోనియా అభినందన పేరిట నిర్వహించే ఈ సభను కూడా టీ కాంగ్రెస్ సభకు తీసిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. -
కాంగ్రెస్‌లో రభస
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఏర్పాటు ప్రకటనతో జైత్రయాత్ర సదస్సు ఏర్పాట్లకోసం నిర్వహించిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో గ్రూపు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. పలు నియోజకవర్గాల నేతలు పరస్పరం వాదులాటకు దిగారు. కొందరు నేతలు ఏకంగా ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో పార్టీపరంగా అన్ని జిల్లాల్లో జైత్రయాత్ర పేరిట భారీ సదస్సులు నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారు. ఇందులో భాగంగా కరీంనగర్లో ఈ నెల 27న సదస్సు నిర్వహించాల్సి ఉంది. జైత్రయాత్ర సదస్సు విజయవంతం చేసేందుకు గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. డీసీసీ అధ్యక్షుడు కొండూరి రవీందర్రావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సదస్సు ఏర్పాట్లపై కంటే నియోజకవర్గాల్లోని గ్రూపు రాజకీయాలు, సమన్వయలేమి అంశాలే ఎక్కువగా చర్చకు వచ్చాయి. కాంగ్రెస్‌కు సంబంధించి జిల్లాలో రెండు వర్గాలుగా ఉన్న మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్ ఈ భేటీలోనూ ఇదే రకంగా వ్యవహరించారు. మంత్రి శ్రీధర్‌బాబు యథావిధిగా ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. కరీంనగర్లో పార్టీ పరిస్థితి బాగాలేదని చెప్పుకొచ్చారు. నేతల మధ్య సమన్వయం ఉండడంలేదని, జిల్లా కేంద్రంలోనే ఇలా ఉంటే ఈ ప్రభావం మిగిలిన నియోజకవర్గాల్లోనూ పడుతోందని అన్నారు. ప్రత్యర్థి పార్టీల నేతల విమర్శలపై పార్టీ పదవుల్లో ఉన్నవారు ఆశించిన మేరకు స్పందించడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవన్నీ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావుతోనే స్పష్టం చేశారు. అయితే అసలు ఉద్దేశం మాత్రం ఎంపీ పొన్నం ప్రభాకర్ లక్ష్యంగా ఉందని సమావేశంలో ఉన్న నేతలు చెబుతున్నారు. పొన్నం ప్రభాకర్ అనుచరుడు కన్న కృష్ట ప్రస్తుతం కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయనతోపాటు పలువురు పొన్నం అనుచరులు మంత్రిపై వచ్చిన విమర్శలను ఖండించడంలో చొరవ తీసుకోవడంలేదనే ఉద్దేశంతోనే ఇలా అన్నట్లు భేటీలో ఉన్న నేతలు అంటున్నారు. కరీంనగర్లో పార్టీ నేతల సమన్వయలోపంపై మంత్రి వివరంగా మాట్లాడిన తర్వాత... మంత్రికి దగ్గరగా ఉండే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ భేటీలో మరింత తీవ్రంగా స్పందించారు. ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌తో ఇటీవల పెరిగిన సవాళ్ల రాజకీయంలో టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు రవీందర్‌సింగ్ స్పందిస్తుంటే... కాంగ్రెస్ నగర పార్టీ నేతలు ఎందుకు మాట్లాడరని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో అసంతృప్తి ఉన్న మంత్రి శ్రీధర్‌బాబు అండతోనే భేటీలో అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఇలా మాట్లాడినట్లు ఎంపీ వర్గీయులు చెబుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ మైనారిటీ సెల్ నగర కన్వీనరుగా నియమితుడైన ఓ నేత స్వీట్లు తెచ్చి అక్కడి నేతలకు ఇస్తుంటే... ఎంపీ పొన్నం జోక్యం చేసుకుని తమకు తెలియకుండా పదవులు ఎలా ఇచ్చుకుంటారని అనడం కొద్దిసేపు వాగ్వాదానికి దారితీసింది. మైనారిటీ నేతలపై ఎంపీ ప్రశ్నలకు వారు తీవ్రంగా స్పందించారు. ‘మాకు నామినేటెడ్ పదవులు లేవు. మీరు ఇప్పించేందుకు జోక్యం చేసుకోరు. పార్టీలోని చిన్న పదవులు ఇచ్చుకుంటే వాటిపైనా మాట్లాడుతారు. అసలు మైనారిటీల గురించి మీరు ఏం చేశారు. ఇతర పార్టీలోని మైనారిటీ నేతలు మమ్మల్ని చూసే నవ్వే పరిస్థితి ఉంది. చిన్న పదవులు కూడా ఇంత రాజకీయం ఏమిటి’ అని ప్రశ్నించగా, ఎంపీ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. రామగుండం నియోజకవర్గంలోని ముఖ్యనేతలు కోలెటి దామోదర్, బాబర్‌సలీంపాషా ఒకరిపై ఒకరు కేకలు వేసుకున్నారు. రామగుండంలో బీపీఎల్ ధర్మల్ ప్లాంటు తరలింపుపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని కోలేటి దామోదర్ ప్రకటించడంపై బాబర్ సలీంపాషా తీవ్రంగా స్పందించారు. అలా ప్రకటించడానికి దామోదర్ ఎవరని ప్రశ్నించారు. అఖిలపక్షం అనే మాటలు ఏమిటని, నియోజకవర్గ ఇన్చార్జి అయిన తాను లేకుండా ఎలా కార్యక్రమాలు చేస్తారని గట్టిగా అడిగారు. ఇద్దరి మధ్యమాటల తీవ్రత పెరగడంతో మంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. ఇలా సమావేశంలో పలుసార్లు మంత్రి సర్దిచెపాల్సిన స్థాయిలో నేతలే ఒకరినొకరు తిట్టుకున్నంత పని చేశారు. భేటీ ప్రధాన ఉద్దేశం కంటే ఇవే ఎక్కువ కావడంతో చివరికి... సదస్సు ఏర్పాట్లపై చర్చించారు. మొదట ఈ నెల 24నే ఈ సదస్సు జరగాల్సి ఉన్నా తాజాగా 27కు వాయిదా వేశారు. -
‘జైత్రయాత్ర’ను విజయవంతం చేయండి
టవర్‌సర్కిల్, న్యూస్‌లైన్ : ఈనెల 27న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించే జైత్రయాత్ర సభను విజయవంతం చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. గురువారం జైత్రయాత్ర సభ ఏర్పాట్లపై డీసీసీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చొరవతో అక్టోబర్ 3న కేంద్ర కేబినేట్ తెలంగాణ నోట్‌కు ఆమోదముద్ర వేసినందుకు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలపడం, ఈ విషయంపై విస్తృతంగా ప్రచారం చేసేందుకు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జైత్రయాత్ర విజయవంతానికి నియోజకవర్గాల వారీగా శుక్రవారం నుంచి సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు.సభకు తెలంగాణలోని పది జిల్లాల్లోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు నాయకులు , కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు కె.రవీందర్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, ఎమ్మెల్సీలు సంతోష్‌కుమార్, భానుప్రసాద్‌రావు, టి.జీవన్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కోడూరి సత్యనారాయణగౌడ్, కోలేటి దామోదర్, బాబర్‌సలీంపాషా, ఎం.సురేందర్‌రెడ్డి, డి.శంకర్, జువ్వాడి కృష్ణారావు, కేతిరి సుదర్శన్‌రెడ్డి, కన్న కృష్ణ, వై.సునీల్‌రావు, కౌశిక హరి, సర్వర్‌పాషా, అంజనీప్రసాద్, గుగ్గిళ్ల జయశ్రీ, కోమటిరెడ్డి నరెందర్‌రెడ్డి, నిఖిల్‌చక్రవర్తి, జితేందర్ పాల్గొన్నారు. -
బోధన్ ముస్తాబు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :జైత్రయాత్ర సభకు జిల్లా నలుమూలల నుంచి 50వేల మందిని తరలించనున్నారు. ఇందుకోసం బస్సులు, లారీలు, డీసీఎంలు, సుమోలు, జీపులు ఇతర వాహనాలను సమకూర్చుతున్నారు. బోధన్ పట్టణం నుంచే 15 వేల మందిని తరలిస్తున్నారు. ఈ మేరకు డ్వాక్రా మహిళల సమీకరణంపై దృష్టి సారిం చినట్టు తెలుస్తోంది. మిగతా నియోజకవర్గాల నుంచి మూడు వేలు మొదలుకుని ఐదు వేల వరకు జనాలను తరలించేందుకు కృషి చేస్తున్నారు. వేదిక అలంకరణపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. కళాకారుల కోసం ప్రత్యేకంగా ఒక వేదికను ఏర్పాటు చేశారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, సీనియర్ నేతలు హాజరు కానుండటంతో భారీ పోలీసు బందో బస్తును ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బహిరంగసభ జరుగనుంది. కేంద్ర సహాయ మంత్రి బలరాం నాయక్ , ఉప ముఖ్యమంత్రి దామోద ర రాజనర్సింహ, పలువురు టీ మంత్రులు, ఎం పీలు,ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు రానున్నారు. పెండింగ్ సమస్యలు చర్చకు వచ్చేనా.. తెలంగాణకు తలమానికంగా నిలిచిన నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని బోధన్ ప్రాంతవాసులు కోరుతున్నారు. 2002లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేశారు. ఉపాధి కోల్పోయిన కార్మికులు కొంతమంది ఆత్మహత్య లు చేసుకున్నా పట్టించుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. తర్వాత కాంగ్రెస్ హయాంలో శాసన సభాసంఘం నిజాంషుగర్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిఫార్సులు చేసినప్పటికీ సీమాంధ్ర పాలకులు పట్టించు కోలేద ని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఫ్యాక్టరీని ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నిజాం సాగర్‌కు బ్యా లెన్సింగ్ రిజర్వాయర్‌గా నిర్మించిన సింగూరు విషయంలో తెలంగాణ మంత్రులు ఆలోచిం చాలని రైతులు కోరుతున్నారు. సాగు.. తాగు నీరు సింగూరు ప్రాజెక్టు నీటిని నిజామాబాద్, మెదక్ జిల్లాలకే కేటాయించాల్సి ఉన్నప్పటికీ కృష్ణా, గోదావరి బేసిన్ పరిధిలో ఉన్న హైదరాబాద్‌కు తాగునీటి అవసరాల కోసం ఆంధ్ర పాలకులు అప్పట్లో తరలించుకుపోయిన విషయాన్ని గుర్తించాలంటున్నారు. అదేవిధంగా 1960 సంవత్సరంలో రైతుల భాగస్వామ్యంతో సారంగాపూర్ వద్ద ఏర్పాటైన నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారాన్ని పరిరక్షించేం దు కు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జిలా ్లలో మారుమూల ప్రాంతమైన జుక్కల్ నియోజక వర్గంలోని మద్నూరు, బిచ్కుంద మండలా ల పరిధిలో 22 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే మహారాష్ట్ర-ఆంధ్రప్రదేశ్ అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అయిన లెండి పనులు సత్వరమే పూర్తి చేయాలంటున్నారు. ఆర్మూర్ ప్రాం తంలో పసుపు శుద్ధి కార్మాగారాన్ని ఏర్పాటు చేయాలని, యువతకు ఉపాధి కల్పించేందుకు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వరకు ఇం డస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. అనేక ఏళ్లుగా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రధాన సమస్యలపై కాంగ్రెస్ జైత్రయాత్ర సభకు వస్తున్న కాంగ్రెస్ పెద్దలు దృష్టిసారించాలని విపక్షాలతో పాటు తెలంగాణ వాదులు, ప్రజలు కోరుతున్నారు. -
కొండూరి... కొన్ని రోజులే!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీందర్రావును పదవి నుంచి తొలగించడం ఖాయమైంది. తెలంగాణ రాష్ట్రం తమ వల్లే వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఈ నెల 24న జిల్లాలో నిర్వహించతలపెట్టిన జైత్రయాత్ర సదస్సులోపే ఈ మార్పు జరిగే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ ముఖ్యనేతలు చెబుతున్నారు. సదస్సు ఏర్పాట్లలో ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తే మాత్రం... ఈ కార్యక్రమం తర్వాత మార్పు ప్రక్రియ ఉంటుందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటన తర్వాత పార్టీ పరంగా ఆశించిన కార్యక్రమాలు లేకపోవడం, అప్పుడప్పుడు ఏదైనా కార్యక్రమం నిర్వహించినా కాంగ్రెస్ పార్టీ ఘనతలుగా కాకుండా ఒకరిద్దరి తరపున మాట్లాడే వ్యక్తిగా ముద్రపడడం, సొంత నియోజకవర్గం సిరిసిల్లలో గ్రూపు రాజకీయాలు... కలిసి కొండూరి పదవికి ఎసరు వచ్చినట్లు తెలుస్తోంది. సాధారణ ఎన్నికలను ఎదుర్కొనే సమర్థుడైన మరో నాయకుడి పేరును డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఏకాభిప్రాయంతో సూచిం చాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కొన్నిరోజుల క్రితమే మంత్రి శ్రీధర్‌బాబుకు చెప్పినట్టు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఎవరి పేరు చెప్పాలనే విషయంలో స్పష్టత రాకపోవ డం వల్లే రవీందర్రావును మార్చడంలో ఆలస్యమవుతోందని పేర్కొంటున్నారు. ఇప్పుడు కాకు న్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక పీసీసీలు ఏర్పాటయ్యే సమయంలో అయినా మార్పు జరుగుతుందని చెబుతున్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రె స్ కార్యక్రమాలను ఆశించిన మేర జరపకపోవ డం వల్లే కొండూరి రవీందర్రావును పదవి నుంచి తప్పించాలని అధిష్టానం నిర్ణయించిన ట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తర్వాత కూడా కాంగ్రెస్‌కు ప్రయోజనం కలిగే కార్యక్రమాలను రవీందర్రావు నిర్వహిం చిన పరిస్థితులు లేవు. మొదటి నుంచి తెలంగాణవాదం ఎక్కువగా ఉన్న జిల్లాలో పరిస్థితులను అనుకూలంగా మలుచుకుని టీఆర్ఎస్కు దీటు గా కార్యక్రమాలు నిర్వహించకపోవడంపై జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన చేసిన తర్వాత అన్ని జిల్లాల్లో సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపే సదస్సులు నిర్వహించారు. మన జిల్లాలో మాత్రం... సర్పంచులకు సన్మానసభ మాత్రమే నిర్వహించారు. సోనియాగాంధీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎం దుకనే ఉద్దేశంతో సర్పంచుల సన్మానసభలోనే సోనియాగాంధీకి కృతజ్ఞతలు అని ఓ తీర్మానం చేసి వదిలేశారు. జిల్లాలోని పార్టీ ప్రధాన నేతల అనుమతితోనే ఇలా చేసినట్లు రవీందర్రావు వర్గీయులు చెబుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి ఈ విషయంపై ఫిర్యాదులు వెళ్లాయి. ఎన్నికల తరుణంలో మరింత క్రియాశీలంగా ఉండాల్సిన అధ్యక్షుడి తీరు దీనికి విరుద్ధంగా ఉందని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షుడిగా రవీందర్రావు వ్యవహారశైలి సరిగా ఉండడం లేదని వివరించారు. సొంత నియోజకవర్గం సిరి సిల్లలోనే మిగిలిన నాయకులను కలుపుకునిపోవడంలో విఫలమవుతున్నారని, గత నెలలో జరి గిన పలు సంఘటనలను వివరిస్తూ గతంలోనే ఫిర్యాదులు వెళ్లాయి. సాధారణ ఎన్నికల దగ్గరపడుతున్నా... నెలకోసారి కూడా జిల్లా పార్టీ ఆఫీసులో సమావేశాలు గానీ, కార్యక్రమాలు గానీ జరగడం లేదు. డీసీసీ అధ్యక్ష పదవి నుం చి మార్చుతున్నట్లు తెలిసినందువల్లే రవీందర్రావు ఇటీవల పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యక్రమాలను పూర్తిగా తగ్గించినట్లు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. జోడు పదవుల అం శం కూడా ఆయనకు ఇబ్బందిగా మారింది. కేడీసీసీబీ అధ్యక్షుడిగా డీసీసీ అధ్యక్షుడిగా రెండు పదవుల్లో ఆయన కొనసాగుతున్నారు. రవీందర్రావును పదవినుంచి తప్పించడం ఖాయమవడంతో తదుపరి ఈ పదవికి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణగౌడ్, నేరెళ్ల శారద, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, కె.సుదర్శన్‌రెడ్డి, తుమ్మేటి సమ్మిరెడ్డి, హెచ్.వేణుగోపాల్‌రావు పేర్లను పరిగణనలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవీందర్రావు సామాజిక వర్గానికే మళ్లీ పదవిని ఇచ్చే పరిస్థితి వస్తే ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, సునీల్‌రావుకు అవకాశాలు ఉంటాయి. సాధా ర ణ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌కు మళ్లీ పదవి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ప్రచారం కూడా జరుగుతోంది. పదవుల ఎంపికలో ఆశ్చర్యం కలిగించే కాంగ్రెస్‌లో అనూహ్యంగా ఇతర నేతల పేర్లు పరిశీలనలోకి వచ్చే అవకాశం సైతం ఉందని పార్టీశ్రేణులు అంటున్నాయి.