అమ్మోరీయులనే శాపగ్రస్తుల సంతతికి చెందిన కనాను ప్రజలు గిబియోనీయులు. వాగ్దాన దేశమైన కనానులో యొహోషువా నాయకత్వంలో సాగుతున్న జైత్రయాత్రలో యొరికో, హాయి పట్టణాలు ధ్వంసమైనట్టే, తాము కూడా సంహారమవుతామని గ్రహించి శాంతి ఒప్పందం కోసం ఎక్కడో దూరదేశం నుండి వచ్చామంటూ గిబియోనీయులు కపట నాటకమాడి యొహోషువా శరణు కోరారు. దేవుని వద్ద విచారణ కూడా చెయ్యకుండానే, యొహోషువా వారికి ప్రమాణం చేశాడు. మూడు రోజుల తర్వాత వాస్తవం తెలిసి వారిని నిలదీస్తే, మీ దేవుడు చాలా గొప్పవాడు, మీ పక్షంగా గొప్ప కార్యాలు చేశాడని విని ఆయన శరణులో, మీ నీడలో బతకాలని నిర్ణయించుకున్నామని వారన్నారు. మాటిచ్చిన తర్వాత మడమ తిప్పకూడదన్న దేవుని పద్ధతికి లోబడి ఇశ్రాయేలీయులు తమ ప్రమాణాన్ని నిలబెట్టుకున్నారు.
సంధి ఒప్పందానికి దేవుడు కూడా ఆమోదముద్ర వేశాడు. గిబియోనీయుల ఉదంతం విని ఆ వెంటనే మిగిలిన కనాను రాజులంతా కలిసి గిబియోనీయులతో సమిష్టిగా మహా యుద్ధం చెయ్యగా ఇశ్రాయేలీయులు కూడా వారికి అండగా నిలిచారు. దేవుడైతే ఒక రోజుపాటు సూర్యుణ్ణి ఉన్నచోటే నిలిపి మరీ వారికి ఘనవిజయాన్నిచ్చాడు(యొహో 10:12). ఇశ్రాయేలీయుల మధ్య పనివారుగా ఉండేందుకు అంగీకరించిన గిబియోనీయులకు, ఆలయంలో బలిపీఠం వద్ద కట్టెలు నరికే, నీళ్లు మోసితెచ్చే పనినిచ్చి, దేవుడు తన ఆరాధనా కార్యక్రమాల్లో వారికి భాగస్వామ్యాన్నిచ్చాడు. లేవీయులనే అర్చకులుండే పట్టణాల్లో దేవుడు గిబియోను పట్టణాన్నికూడా చేర్చాడు. దావీదు వద్ద ఉన్న 30 మంది మహా వీరుల్లో ఇష్మాయా అనే గిబియోనీయుడు కూడా ఉన్నాడని బైబిల్ చెబుతోంది.
చక్రవర్తిగా సొలొమోను గిబియోనులో బలులర్పించినప్పుడు దేవుడు అక్కడే ప్రత్యక్షమై అతనికి వరాలనిచ్చాడు, బబులోను చెరనుండి తిరిగొచ్చిన వారిలో 95 మంది గిబియోనీయులు కూడా ఉన్నారని నెహెమ్యా రాశాడు. యెరూషలేము ప్రాకారాల పునర్నిర్మాణంలో కూడా గిబియోనీయుల ప్రస్తావన ఉంది. కాలగర్భంలో కలిసిపోవాల్సిన గిబియోనీయులకు దేవుడు ఇలా మహా చరిత్రనిచ్చాడు. కనానీయులంతా సంహారం కాగా. గిబియోనీయులు మాత్రం, దేవునికి తలవంచి, దేవుని ప్రజలతో సఖ్యత కోరుకొని తమ ప్రాణాలే కాదు, తమ ఉనికిని కూడా కాపాడుకున్నారు. పాముల వివేకం, పావురాల నిష్కపటత్వం విశ్వాసికుండాలన్న యేసుప్రభువు బోధకు గిబియోనీయలే ఉదాహరణ.తలుపు చిన్నదైతే తలవంచడమొక్కటే మార్గం. లేకపోతే తల బొప్పికట్టడం ఖాయం.అపకార దష్టితో కాక ప్రాణభీతితోనే గిబియోనీయులు కపట నాటకమాడారని దేవునికి ముందే తెలుసు.
పైవేషాలను కాదు, ఆంతర్యంలో తన పట్ల వారికున్న విశ్వాసాన్ని, భయభక్తుల్ని దేవుడు చూశాడు. పైకి నీతిమంతుల్లాగా ఉన్నా ఆంతర్యంలో నిండా దుష్టత్వంతో జీవించేవాళ్లున్నారు. పైకి నాటకాలాడినా ఆంతర్యంలో ఆత్మీయత ఉన్నవాళ్లున్నారు. దేవుడు మాత్రం ఆంతర్యంలోని భక్తి, నీతి, పరిశుద్ధతను బట్టే ప్రతిస్పందిస్తాడు. కత్తితో తలపడటం కన్నా యుక్తితో మెలగడమే మెరుగనుకొని గిబియోనీయులు అలా గొప్ప ఉపద్రవం నుండి తప్పించుకోవడమే కాక, దేవుని ప్రజల్లో భాగమయ్యారు, దేవుని ఆశీర్వాదాలకూ పాత్రులయ్యారు. మనవాడు కదా, ఇలా చేయవచ్చా? అని ఇతరులను నిందించే ముందు, పైకి ఎంతో భక్తిగా, పవిత్రంగా, నీతిమంతుల్లాగా ప్రవర్తించే నా ఆంతర్యంలో లేదా మనవాళ్ళ ఆంతర్యంలో ఇంతటి మురికి కాలువలా? అని ప్రశ్నించుకునేవాడే నిజమైన విశ్వాసి. విశ్వాసి ఆంతర్యంలోని ఆత్మీయత, ఉదాత్తమైన ఆలోచనలను బట్టే దేవుడు అనూహ్యమైన విజయాలు, ఆశీర్వాదాలిస్తాడు, ఆ విశ్వాసినే కోట్లాదిమందికి ఆశీర్వాదంగా మార్చుస్తాడు.
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్
Email: prabhukirant@gmail.com
Comments
Please login to add a commentAdd a comment