గ'ఘన' విజయం | Gslv Mark III fired successfully | Sakshi
Sakshi News home page

గ'ఘన' విజయం

Published Tue, Jun 6 2017 1:40 AM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM

గ'ఘన' విజయం

గ'ఘన' విజయం

జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3డీ1 ప్రయోగం సక్సెస్‌
కక్ష్యలోకి చేరిన ఉపగ్రహం జీశాట్‌–19
16.20 నిమిషాల్లో పూర్తయిన ప్రయోగం
ఇస్రోకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు


శ్రీహరికోట (సూళ్లూరుపేట): క్షణాలు కరిగిపోతున్నాయి.. 3, 2, 1, 0.. ఉత్కంఠకు తెరదించుతూ.. మువ్వన్నెల పతాకను మరోసారి సగర్వంగా ఎగరేస్తూ.. నిప్పులు చిమ్ముకుంటూ జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3డీ1 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది! 3,136 కిలోల బరువున్న భారీ ఉపగ్రహం జీశాట్‌–19ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది! భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా ఒదిగిపోయింది.

ప్రయోగం సాగిందిలా..
జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3డీ1న ప్రయోగం విజయవంతమవడంతో ఇస్రో పదిహేడేళ్ల కఠోర శ్రమ ఫలించింది. బాహుబలిగా అభివర్ణిస్తున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3డీ1 ప్రయోగానికి ఆదివారం సాయంత్రం 3.58 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. సోమవారం సరిగ్గా సాయంత్రం 5.28 గంటలకు రాకెట్‌ నింగికేగింది. ఒక్కో దశ విజయవంతం అయ్యేకొద్దీ శాస్త్రవేత్తల ముఖాల్లో విజయగర్వం తొణికిసలాడింది. రాకెట్‌కు మొదటి దశలో రెండు వైపులా అమర్చిన రెండు ఘన ఇంధన స్ట్రాపాన్‌ బూస్టర్లు (ఎస్‌–200), రెండో దశలో అమర్చిన 110 టన్నుల ద్రవ ఇంధనం (ఎల్‌–110) దశలు సమర్థంగా పనిచేశాయి. కీలకమైన మూడో దశలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 25 టన్నుల క్రయోజనిక్‌ ఇంధనం (సీ–25) మండి రాకెట్‌ను 175 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చింది. తర్వాత రాకెట్‌పై భాగంలో అమర్చిన 3,136 కిలోల  జీశాట్‌–19 సమాచార ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టారు. ప్రయోగం మొత్తం 16.20 నిమిషాల్లో పూర్తయింది.

ఈ విజయంతో భవిష్యత్‌లో 3 టన్నుల నుంచి 5 టన్నుల బరువు కలిగిన సమాచార ఉపగ్రహాల (కమ్యూనికేషన్‌ శాటిలైట్స్‌)తో పాటు చంద్రయాన్‌–2 ప్రయోగంలో రోవర్‌ను, అలాగే స్పేస్‌ షటిల్‌ ప్రోగ్రాంలో భాగంగా మానవుడిని అంతరిక్షంలోకి పంపగలమని శాస్త్రవేత్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఉపగ్రహం కక్ష్యలోకి చేరగానే బెంగళూరులోని హసన్‌లో ఉన్న మాస్టర్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం) నుంచి అంతా సవ్యంగా ఉన్నట్టు ప్రకటన వెలువడింది. ప్రయోగం విజయవంతం కాగానే మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు.

ప్రపంచదేశాల్లో తిరుగులేని శక్తిగా..
తాజా ప్రయోగంతో ప్రపంచ దేశాల్లో భారత్‌ తిరుగులేని శక్తిగా అవతరించింది. పదిహేడేళ్లుగా ఇస్రో ఎస్‌–200 ఘన ఇంధన బూస్టర్లు, ఎల్‌–100 ద్రవ ఇంధన దశ, సీ–25 క్రయోజనిక్‌ ఇంజిన్లను అభివృద్ధి చేసుకోవడానికి ఎన్నో పరిశోధనలు చేసింది. 2014 డిసెంబర్‌ 14న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3డీ1 రాకెట్‌ను ప్రయోగాత్మకంగా ప్రయోగించి ఎస్‌–200,  ఎల్‌–110 సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. ఆ ప్రయోగంలో సీ–25 లేకుండా డమ్మీని ఉపయోగించారు. తాజాగా సీ–25కు అనేక రకాల భూస్థిర పరీక్షలు నిర్వహించి పూర్తిస్థాయిలో ప్రయోగించారు.

ఈ ప్రయోగం ఎవరెస్ట్‌లాంటిది
జీఎస్‌ ఎల్‌వీ మార్క్‌–3డీ1 విజయం పదిహేడేళ్ల కఠోర శ్రమకు గుర్తింపు అని, ఇది ఊహలకందని విజయ మని ఇస్రో చైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ పేర్కొ న్నారు. ‘‘ఇన్నాళ్లు చేసిన ప్రయోగాలు ఒక ఎత్త యితే ఈ ప్రయోగం ఎవరెస్ట్‌ అంత ఎత్తు’’ అని అన్నారు. భారత్‌ ప్రపంచం వైపు చూసే స్థాయి నుంచి నేడు ప్రపంచమంతా భారత్‌ వైపు చూసే స్థాయికి చేరుకోగలిగామని.. ఈ విజయం ప్రతి భారతీయుడిని తలెత్తెకునేలా చేసిం దని చెప్పారు. ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో ఏటా 12 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు, 2 జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–2, మార్క్‌–3 ప్రయోగాలు చేయగలమన్న నమ్మకం కుదిరింద న్నారు. జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం విజయవంతమైన తరువాత శ్రీహరికోటలోని షార్‌లో మీడియాతో మాట్లాడారు.

మార్క్‌–3 రాకెట్‌ను రెండింతలు బలోపేతం చేసి భారీ ప్రయోగాలకు సిద్ధమవుతామన్నారు. ఇంతటి ఘన విజయం సాధించడానికి అహర్నిశలు కృషి చేసిన ఇస్రో సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా క్రయోజనిక్‌ దశను రూ పొందించడంలో ఎంతో పరిణతిని సా«ధించా మని, ప్రపంచంలో అతి తక్కువ దేశాలకే ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం ఉందని చెప్పారు. ఈ రాకెట్‌ ద్వారా పంపిన ఉపగ్రహంలో అమర్చిన కే–బ్యాండ్, కేయూ బ్యాండ్‌ హైఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌పాండర్లు.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిం చేందుకు దోహదపడతాయని చెప్పారు.

వ్యయం తగ్గిస్తున్నాం..
రాబోయే రెండేళ్లలో ఎలక్ట్రికల్‌ ప్రొపల్షన్‌ వ్యవస్థల ను అభివృద్ధి చేసి, ఉపగ్రహాల బరువును తగ్గిస్తా మని.. తద్వారా రాకెట్‌ బరువును తగ్గించి ప్రయో గ వ్యయాన్ని బాగా తగ్గిస్తామని తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే పరిశోధన ముమ్మరం చేశామని తెలిపారు. ఇక భవిష్యత్తు అంతా భారీ ప్రయోగాలే లక్ష్యంగా చేసుకోనున్నామని.. అందులో భాగంగా పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ సామర్థ్యాన్ని పెంచి ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు.

వచ్చే ఏడాది చంద్రయాన్‌–2
ఈ నెల 23న పీఎస్‌ఎల్‌వీ సీ38, ఆ వెంటనే మరో జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–2 ప్రయోగం ఉంటుందని తెలిపారు. 5.5 టన్నుల బరువుండే జీశాట్‌–11 ఉపగ్రహాన్ని తయారుచేస్తున్నామని.. దానిని ఫ్రాన్స్‌లోని గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నామని వెల్లడించారు. 2018 ప్రథమార్థంలో సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఉపగ్రహాన్ని, చంద్రుడిపై పరిశోధనకు చంద్రయాన్‌–2 ఉపగ్రహాన్ని పంపనున్నామని చెప్పారు.

జీశాట్‌–19 ఉపగ్రహంతో ఉపయోగాలివీ..
దేశంలో టెలివిజన్‌ ప్రసారాలు, టెలికాం రంగంలో విస్తృత సేవలు, ఇంటర్నెట్‌ వేగవంతం అవడమే కాకుండా అత్యంత అధునాతనమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌లో ఇంటర్నెట్‌ను వేగవంతం చేయడానికి ఎంతో ఉపకరిస్తుంది. ఉపగ్రహంలో కేయూ బ్యాండ్‌ హైయర్‌ ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌పాండర్స్‌తో పాటు జియో స్టేషనరీ రేడియేషన్‌ స్పెక్ట్రోమీటర్‌ అనే పేలోడ్స్‌ అమర్చి పంపారు. ఇప్పటికే  ఇస్రోకు చెందిన 14 సమాచార ఉపగ్రహాలు అంతరిక్ష కక్ష్యలో పనిచేస్తూ 275 ట్రాన్స్‌పాండర్లతో దేశవాళి డీటీహెచ్‌ ప్రసారాలు, టెలికాం సేవలు అందిస్తున్నాయి.

అయితే దేశంలో 400 ట్రాన్స్‌పాండర్లు దాకా డిమాండ్‌ ఉంది. తాజా విజయంతో రాబోయే రెండుమూడేళ్లలో జీఎస్‌ఎల్వీ రాకెట్ల ద్వారా 450 టాన్స్‌పాండర్లను అందుబాటులోకి తేవాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో 850 టీవీ చానళ్లు ఉంటే అందులో 650 చానళ్లను ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 300 చానళ్లకు మాత్రమే వీశాట్‌ లింక్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఇస్రో అంతర్గతంగా వాణిజ్యపరంగా 120 ట్రాన్స్‌పాండర్లను ఉపయోగించుకుంటోంది. జీశాట్‌–19 ఉపగ్రహంతో సమాచార వ్యవస్థలో అత్యంత అధునాతమైన సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఈ ఉపగ్రహం సుమారు 10 ఏళ్ల పాటు సేవలు అందిస్తుంది.

పదిహేడేళ్ల శ్రమ ఫలితమిది
సూళ్లూరుపేట: భారీ ఉపగ్రహాలను నింగి లోకి తీసుకెళ్లగల జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 రాకెట్‌ అభివృద్ధి, విజయం వెనుక ఇస్రో పదిహేడేళ్లు కఠోర శ్రమ, నిరంతర కృషి దాగుంది. సుమారు 3 నుంచి 5 టన్నుల బరువైన సమాచార ఉపగ్రహాలను ప్ర యోగించేందుకు.. మనుషులను అంత రిక్షంలోకి తీసుకెళ్లేందుకు.. చంద్రుడు, అంగారకుడి మీద పరిశోధనల కోసం రోవర్లను పంపేందుకు భారీ రాకెట్లు అవసరం. ఇస్రో 2000లో దీనిపై ప్రతిపా దన చేయగా కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిం ది. దాంతో మార్క్‌–3 తరహా భారీ రాకెట్‌ అభివృద్ధిపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. 2003లో ఈ ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్లు నిధులు మంజూరు చేశారు. ఆ నిధుల్లో రూ.700 కోట్లతో షార్‌లో ప్రయోగానికి అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించారు.

అన్ని దశలూ భారీగానే..: పీఎస్‌ఎల్‌వీ, సాధారణ జీఎస్‌ఎల్‌వీ రాకెట్లలోని మొదటి దశలో సుమారు 138, 142 టన్నుల ఘన ఇంధనాన్ని వాడతారు. అయి తే భారీ రాకెట్‌ రూపకల్పనలో భాగంగా మార్క్‌3 ప్రయోగం మొదటి దశలో 200 టన్నుల చొప్పున ఘన ఇంధనాన్ని నింపిన రెండు స్ట్రాపాన్‌ (ఎస్‌–200) బూస్టర్లు అవసరమని గుర్తించారు. వీటిని షార్‌లోని ఘన ఇంధనం తయారీ విభాగం(స్ప్రాబ్‌)లోనే తయారు చేశారు. 2010 జనవరి 24న ఈఎస్‌–200 స్ట్రాపాన్‌ బూస్టర్లకు భూస్థిర పరీక్షలు నిర్వహించి విజయం సాధించారు.  రెండో దశలో సాధారణంగా 40 టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగిస్తుండగా.. మార్క్‌ 3 తరహా కోసం 110 టన్నుల ఇంధనాన్ని నింపిన బూస్టర్ల(ఎల్‌–110) ను వినియోగించారు.

వీటిని తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న లిక్విడ్‌ ప్రొపెల్లెంట్‌ స్పేస్‌ సెంటర్‌లో తయారు చేశారు. మూడోదశలో అత్యంత శక్తివంత మైన క్రయోజనిక్‌ ఇంజన్లను వినియోగిస్తారు. సాధారణ జీఎస్‌ఎల్‌వీలో ఈ దశలో 12.5 టన్నుల ఇంధనాన్ని వినియోగించగా.. మార్క్‌3 కోసం 25 టన్నులు వినియోగించాల్సి వచ్చింది. 12.5 టన్నుల క్రయోజనిక్‌ దశ రూపకల్పన కోసమే అప్పట్లో ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా కష్టపడ్డారు. తాజాగా 25 టన్నుల క్రయోదశ (సీ–25) అభివృద్ధి కోసం రెండేళ్లు పట్టింది. అయితే మొత్తంగా పూర్తిస్థాయిలో క్రయోజనిక్‌ దశ అభివృద్ధిలో ఇస్రో విజయం సాధించింది.

59 ప్రయోగాలు.. విజయాలు 51
ఇస్రో సోమవారం నిర్వహించిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3డీ1 ప్రయోగంతో 59 ప్రయోగాలు పూర్తి చేసుకుంది. ఇందులో 51 ప్రయోగాలు విజయవంతం కావడం గమనార్హం. వీటిల్లో ఇప్పటివరకు ఎక్కువగా పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలే విజయవంతంకాగా.. తాజాగా జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లోనూ వరుస విజయాలు ప్రారంభమయ్యాయి. క్రయోజనిక్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో జీఎస్‌ఎల్‌వీ డీ5, డీ6, మార్క్‌–3 ప్రయోగాత్మక ప్రయోగం, ఎఫ్‌–09 ప్రయోగాలతో పాటు తాజాగా మార్క్‌–3డీ1 ప్రయోగం కూడా వరుసగా విజయవంతమైంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.

ఆరేళ్లుగా అపజయమే లేదు..
2011 నుంచి ఇప్పటిదాకా వరుస విజయాల బాటలో సాగుతున్న ఇస్రో, షార్‌ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆరు పీఎస్‌ఎల్‌వీ రాకెట్లు, ఒక జీఎస్‌ఎల్‌వీ, ఆర్‌ఎల్‌వీ–టీడీ, ఏటీవీ వంటి రెండు ప్రయోగాత్మక ప్రయోగాలు విజయం సాధించి 2016 సంవత్సరమంతా విజయాల బాటలో నడవగా... 2017లోనూ మూడో విజయాన్ని అందుకున్నారు.

అగ్రదేశాల సరసన
- జీఎస్‌ఎల్‌వీ–మార్క్‌3ని ప్రయోగించడం ద్వారా భారత్‌ భారీ ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యం కలిగిన ఆరో దేశంగా గుర్తింపు పొందింది. ఇప్పటిదాకా భారీ ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యం అమెరికా, రష్యా, చైనా, జపాన్, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీలకు మాత్రమే ఉంది.
- 3 వేల కిలోల బరువు దాటితే దాన్ని భారీ ఉపగ్రహంగా పరిగణిస్తారు.
- పాతతరం ఉపగ్రహాలతో పోలిస్తే జీశాట్‌–19 సామర్థ్యం చాలా ఎక్కువ. ఇది ఆరేడు పాత ఉపగ్రహాలకు సమానం.
- ఇతర దేశాలతో పోలిస్తే భారీ ఉపగ్రహ ప్రయోగానికి భారత్‌కు అయ్యే ఖర్చు చాలా తక్కువ. మిగతా వాళ్లకంటే 60 నుంచి 70 శాతం తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు.
- సమాచార ఉపగ్రహ ప్రయోగ మార్కెట్‌లో సింహభాగం వాటా ప్రైవేటు సంస్థలు స్పేస్‌ ఎక్స్, అరియేన్‌లదే. 10 టన్నుల ఉపగ్రహాలను కూడా మోసుకెళ్లగల రాకెట్లు వీటి వద్ద ఉన్నాయి.
- 5 టన్నుల దాకా బరువుండే ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి స్పేస్‌ ఎక్స్‌ సంస్థ తమ ఫాల్కన్‌–9 రాకెట్‌ను వాడుతుంది. దీనికి రూ.400 కోట్లు ఛార్జి చేస్తుంది.
- భారత్‌ ఇప్పటిదాకా 21 దేశాలకు చెందిన 79 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే అంతర్జాతీయ విపణిలో భారత్‌ వాటా 0.6 శాతం మాత్రమే.
- భవిష్యత్తులో మనుషులను అంతరిక్షంలోకి పంపడానికి ఇస్రో సిద్ధమవుతోంది. ఇందుకోసం రూ.12,500 కోట్లు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఒకవేళ ప్రభుత్వం అనుమతిస్తే ఈ మిషన్‌లో జీఎస్‌ఎల్‌వీ– మార్క్‌3 రాకెటే కీలకం కానుంది. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపగల సామర్థ్యం ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనాలకే ఉంది.    – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

దేశం గర్విస్తోంది: ప్రణబ్‌
జీఎస్‌ఎల్వీ–మార్క్‌ 3 ప్రయో గం విజయవంతమైనందుకు దేశం గర్విస్తోందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖ ర్జీ అన్నారు. ఇస్రో చైర్మన్‌ కిరణ్‌కు ప్రణబ్‌ అభినందన లేఖ పంపారు. ఈ విజయం చరిత్రాత్మకమైనదనీ, బృందంలోని శాస్త్రవేత్తలకు, ఇంజినీర్లకు, సాంకేతిక నిపుణు లకు.. ఈ ప్రయోగంలో భాగమైన వారికి తన తరఫున శుభా కాంక్షలు తెలియజేయాలని ఇస్రో చైర్మన్‌ను కోరారు.

శాస్త్రవేత్తలకు అభినందనలు
ఉపగ్రహ ప్రయోగం విజయం పై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయంతో తర్వాతి తరం ఉపగ్రహా సామర్థ్యానికి మనం మరింత చేరువయ్యామన్నారు. ‘అంకితభావంతో పని చేసి జీఎస్‌ఎల్వీ–మార్క్‌3 డీ1/జీశాట్‌– 19 ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

దేశం గర్వించే విజయం: సోనియా
జీఎస్‌ఎల్వీ ప్రయోగం సక్సెస్‌ కావడంతో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశం గర్వించేలా ఇస్రో సాధించిన మరో ప్రధాన విజయమిది’ అని ఆమె పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌ అభినందనలు
ఇస్రోకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో తర్వాతి తరం ఉపగ్రహాల ప్రయోగానికి మరింతగా దగ్గరైందని కొనియాడారు. ఈ రోజు సాధించిన విజయం పట్ల దేశం గర్వపడుతోందన్నారు.    

మరో అరుదైన ఘనత: చంద్రబాబు
ఇస్రో చరిత్రలో ఇది మరో అరుదైన ఘనతని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  అభినందించారు. శ్రీహరికోట నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం భారతావని గర్వించదగ్గ విజయమన్నారు.

అగ్రదేశాల సరసన నిలిపారు: జగన్‌
జీఎస్‌ఎల్‌వీ– మార్క్‌3డీ1 ప్రయోగం విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఈ విజయం కమ్యూనికేషన్ల రంగంలో కొత్త శక్తి ఇస్తుందని అన్నారు. ఈ ప్రతిష్టాత్మక భారీ ప్రయోగంతో మన దేశం అంతరిక్ష రంగంలోని అగ్రగామి దేశాల సరసన చేరిందని వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement