GSLV Mark III
-
జీఎస్ఎల్వీ మార్క్3 ఎం–2 రాకెట్‌కు కౌంట్‌డౌన్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 23న ఆదివారం అర్ధరాత్రి 12 గంటల 7 సెకండ్లకు జీఎస్ఎల్వీ మార్క్3 ఎం–2 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఈ నేపథ్యంలో 22న శనివారం అర్ధరాత్రి 12 గంటల7 సెకండ్లకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి శుక్రవారం షార్‌లో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మూడు దశల రాకెట్‌ను అనుసంధానం చేసి.. ప్రయోగవేదిక అమర్చాక.. అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. తర్వాత ప్రయోగ పనులను ల్యాబ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. బోర్డు చైర్మన్ రాజరాజన్ ఆధ్వర్యంలో ల్యాబ్ మీటింగ్ నిర్వహించారు. రాకెట్‌కు మరోమారు తుది విడత తనిఖీలు నిర్వహించి లాంచ్ రిహార్సల్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా ఈ ప్రయోగం ద్వారా యునైటెడ్ కింగ్డమ్కు చెందిన 5,200 కిలోల బరువు కలిగిన 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. ఇప్పటిదాకా పీఎస్ఎల్వీ రాకెట్లను మాత్రమే వాణిజ్యపరమైన ప్రయోగాలకు ఉపయోగించేవారు. ఇప్పుడు తొలిసారిగా జీఎస్ఎల్వీ మార్క్3 రాకెట్‌ను వాణిజ్యపరమైన ప్రయోగాలకు వినియోగిస్తుండటం గమనార్హం. -
22న నింగిలోకి.. చంద్రయాన్–2
శ్రీహరికోట,(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–2 రాకెట్ ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రయోగానికి సంబంధించి ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 15వ తేదీ వేకువ జామున 2.51 గంటలకు చంద్రయాన్–2ను నింగిలోకి పంపాల్సి ఉంది. అయితే రాకెట్లో సాంకేతిక లోపాలు తలెత్తిన కారణంతో ప్రయోగాన్ని నిలిపివేశారు. 56.24 నిమిషాల ముందు కౌంట్‌డౌన్ ప్రక్రియను అర్ధంతరంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. జీఎస్ఎల్ మార్క్3–ఎం1 రాకెట్‌లోని క్రయోజనిక్ దశలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సవరించి మళ్లీ ప్రయోగానికి సిద్ధం చేస్తున్నారు. క్రయోజనిక్ దశలోని గ్యాస్ బాటిల్స్ నుంచి ట్యాంకుకు వెళ్లే పైపులు బయట నుంచి లీకేజీ కావడంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు 15వ తేదీ రాత్రి నుంచి నిద్రాహారాలు మాని క్రయోజనిక్ దశలో ఉన్నటువంటి 25 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ ఇంధనాన్ని వెనక్కి తీసేశారు. అనంతరం ట్యాంకులోని ఇంధనపు పొరలు తొలగించేందుకు నైట్రోజన్ వ్యాపర్స్‌ను లోనికి పంపి క్లీనింగ్ చేసే ప్రక్రియను వేగవంతంగా నిర్వహించారు. ఈ సాంకేతిక పరమైన లోపాన్ని పూర్తి స్థాయిలో సవరించి వారం రోజుల గడువులోనే మళ్లీ ప్రయోగానికి సిద్ధం చేయడం ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషికి నిదర్శనం. -
15వ తేదీ వేకువ జామున చంద్రయాన్–2 ప్రయోగం
సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా సతీష్ ధవన్‌స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 15వ తేదీ వేకువ జామున నిర్వహించనున్న జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ఉపగ్రహ వాహక నౌకకు శుక్రవారం లాంచ్ రిహార్సల్స్‌ను విజయవంతంగా నిర్వహించారు. అనంతరం రాకెట్‌లోని ఇంధనం నింపే ట్యాంకులకు ప్రీ ఫిల్ ప్రెజరైజేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ నెల 7వ తేదీన రాకెట్ ప్రయోగవేదిక మీదకు వచ్చిన తరువాత దశల వారీగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. శనివారం ఉదయాన్నే షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో జరుగనున్న ఎంఆర్ఆర్ సమావేశంలో ప్రయోగ సమయాన్ని, కౌంట్‌డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. సమావేశం అనంతరం ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించాక లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో మరో మారు లాంచ్ రిహార్సల్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రయోగానికి సుమారుగా 20 గంటల ముందు అంటే 14వ తేదీ ఉదయం 6.51 గంటలకు కౌంట్‌డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 15వ తేదీ వేకువజామున 2.51 గంటలకు 3,800 కిలోలు బరువు కలిగిన చంద్రయాన్–2 మిషన్‌ను మోసుకుని నింగికి దూసుకెళ్లేందుకు జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ సిద్ధంగా ఉంది. -
జాబిలమ్మ ఒడిలోకి..
ఎన్నో సవాళ్లు..మరెన్నో మైలు రాళ్లు దాటుకుని అద్భుత ప్రయోగాలు విజయవంతం చేసి మరో కీర్తి పతాకాన్ని తన సొంతం చేసుకునేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అడుగులు ముందుకువేస్తోంది. జాబిలమ్మపై వింతలూ..విశేషాలపై పరిశోధనలు చేసేందుకు చంద్రయాన్–1ను విజయవంతంగా నింగిలోకి పంపిన ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్–2ను విజయవంతం చేసి ప్రపంచ పటంలో భారత్ కీర్తి పతాకాన్ని ఎగురవేసేందుకు సిద్ధం అవుతోంది. షార్ వేదికగా ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు చేసి అంతరిక్షంలో అద్భుతం సృష్టించి అగ్రదేశాల సరసన నిలిచేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. విదేశాల నుంచి 30 ఉపగ్రహాలు 1975 నుంచి 2018 డిసెంబర్ వరకు వంద ఉపగ్రహాలను రోదసీలోకి పంపించి ఇస్రో సెంచరీని పూర్తి చేసుకుంది. ఈ ఏడాది మరో ఐదు ఉపగ్రహాలను రోదసీలోకి పంపించి సెంచరీని అధిగమించారు. ఇప్పటి వరకు పంపిన 105 ఉపగ్రహాల్లో 30 ఉపగ్రహాలను రష్యా అంతరిక్ష సంస్థ, ఫ్రెంచి గయానా కౌరు అంతరిక్ష కేంద్రాల నుంచి పంపించారు. విదేశీ వేదికల నుంచి ఇన్శాట్ సిరీస్, జీశాట్ సిరీస్, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను పంపించారు. ఇప్పటి వరకు 34 కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, 33 రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు, 14 ఎక్స్పర్మెంటల్ ఉపగ్రహాలు, 9 నావిగేషన్ వ్యవస్థ ఉపగ్రహాలు, 9 మెట్రోలాజికల్ ఉపగ్రహాలు, 2 గ్రహాంతర ఉపగ్రహాలు, ఖగోళంలోని స్థితిగతులను పరిశోధించేందుకు 2 స్పేస్ సైన్స్ ఉపగ్రహాలు, 2 స్టూడెంట్ ఉపగ్రహాలను ప్రయోగించారు. చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్–1 పేరుతో చంద్రుడి కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపించారు. అంగారకుడిపై పరిశోధనలకు మంగళ్యాన్–1 పేరుతో అంగారకుడి కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపించారు. ఈ రెండు ప్రయోగాలు మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడం ప్రపంచ దేశాలను అబ్బురపరిచింది. చంద్రుడు, అంగారకుడి కక్ష్యలోకి ఉపగ్రహాలను పంపిన అనతి కాలంలోనే చంద్రయాన్–2 ప్రతిష్టాత్మక ప్రయోగానికి ఇస్రో సిద్ధం కావడం విశేషం. చంద్రయాన్–2 పేరుతో ఏకంగా చంద్రుడిపై ల్యాండర్ దింపి రోవర్ ద్వారా చంద్రుడి మూలాలను అన్వేషించేందుకు సమయాత్తమవుతున్నారు. దీనికి ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరు పొందిన జీఎస్ఎల్వీ మార్క్–3 ద్వారా చేస్తున్నారు. ఈ తరహా రాకెట్ సిరీస్‌లో ఇది నాలుగో ప్రయోగం కావడం విశేషం. చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతం కాగానే గగన్‌యాన్ ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఇప్పటికే మూడు రకాల ప్రయోగాత్మక ప్రయోగాలు చేసి విజయాలను నమోదు చేసుకున్నారు. సాక్షి, శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సన్నద్ధమైంది. సుదీర్ఘమైన అంతరిక్ష ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఇస్రో నేడు చంద్రుడి మీద పరిశోధనలు చేసేందుకు చంద్రయాన్–2 పేరుతో ఆర్బిటర్ ద్వారా ల్యాండర్, రోవర్లు పంపించే స్థాయికి ఎదిగింది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇస్రో కీర్తి కిరీటంలో చంద్రయాన్–2 ప్రయోగం ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. దేశంలో రాకెట్ ప్రయోగాలు ప్రారంభించిన తొలినాళ్లలో 40 కిలోల ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపారు. ప్రస్తుతం నాలుగు టన్నుల బరువు కలిగిన చంద్రయాన్–2 వంటి అత్యంత శక్తివంతమైన ప్రయోగం చేసే స్థాయికి చేరింది. ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రపంచంలో నాలుగో దేశంగా ఆవిర్భవించనుంది. ఇస్రో ఇప్పటి వరకు 8 రకాల ఉపగ్రహాలను తయారు చేసి వివిధ రకాల కక్ష్యల్లోకి ప్రవేశపెట్టి ప్రపంచంలో భారత్ సత్తాను చాటింది. సముద్రాలు, భూమిని అధ్యయనం చేసేందుకు, భూమి పొరల్లో దాగి ఉన్న ఖనిజ నిక్షేపాలను గుర్తించేందుకు, పట్టణ ప్రణాళికాభివృద్ధి, వాతావరణ పరిస్థితుల అధ్యయనం, ఇంకా రైతులకు ఉపయోగపడే ఎన్నో ప్రయోజనాల కోసం దూర పరిశీలనా ఉపగ్రహాలు (రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్)ను ప్రయోగించారు. రేడియో, టెలివిజన్, డీటీహెచ్, టెలీఎడ్యుకేషన్, టెలీమెడిసన్, ఇంటర్నెట్, ఆండ్రాయిడ్ టెక్నాలజీ వంటి ఎంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు సమాచార ఉపగ్రహాలు (కమ్యూనికేషన్ శాటిలైట్స్)ను ప్రయోగించారు. ఇతర గ్రహాల పరిశోధనకు చంద్రయాన్–1, మంగళ్యాన్–1 (అంగారక ప్రయోగం) అనే రెండు గ్రహాంతర ప్రయోగాలు చేసి విజయాలను సొంతం చేసుకున్నారు. ఉపగ్రహాల సామర్థ్యాన్ని కూడా నిర్ధారించుకునేందుకు ఎక్స్పర్మెంట్ ఉపగ్రహాలు, భారతదేశానికి సొంత దిక్సూచి వ్యవస్థకు నావిగేషన్ ఉపగ్రహాలు, ఖగోళాన్ని తెలిజేసేందుకు స్పేస్ సైన్స్ ఉపగ్రహాలు, విద్యార్థులకు ఉపయోగపడే స్టూడెంట్ శాటిలైట్స్‌ను ప్రయోగించారు. ఇలా ఇప్పటి వరకు 105 ఉపగ్రహాలను పంపించి సెంచరీని అధిగమించారు. ఇప్పటి వరకు షార్ నుంచి 74 ప్రయోగాలు చేసి 105 స్వదేశీ ఉపగ్రహాలు, 297 విదేశీ ఉపగ్రహాలు, పది స్టూడెంట్ ఉపగ్రహాలు, రెండు రియూజబుల్ ప్రయోగాలు చేసి ఇస్రో తన సత్తా చాటుకుంటోంది. ఈ నెల 15న వేకువన 2.51 గంటలకు చంద్రయాన్–2 వంటి భారీ ప్రయోగానికి సిద్ధమవుతూ ఇస్రో ఖ్యాతిని ఖండంతరాలకు చాటేందుకు సిద్ధమవుతోంది. ఎస్ఎల్వీ నుంచి జీఎస్ఎల్వీ మార్క్–3 వరకు అంతరిక్షయానం ఇస్రో ఆవిర్భావంలో రోదసీలోకి ఉపగ్రహాలను పంపేం దుకు ముందుగా సౌండింగ్ రాకెట్ల ద్వారా వాతావరణాన్ని అధ్యయనం చేశారు. 1979–80లో శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎల్వీ) రాకెట్ల ద్వారా 40 కిలోల బరువు కలిగిన చిన్నపాటి ఉపగ్రహాలను భూమికి అత్యంత తక్కువ ఎత్తులోని లియో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. ఆ తరువాత ఒక అడుగుకు ముందుకేసి 1992లో ఆగ్మెంటెడ్ లాంచింగ్ వెహికల్స్ (ఏఎస్ఎల్వీ) రాకెట్ల ద్వారా 150 కిలోల బరువు కలిగిన ఉపగ్రహాలను లియో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. ఆ తరువాత 1994లో పోలార్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) రాకెట్ల ద్వారా 1400 కిలోల బరువైన రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (దూరపరిశీలనా ఉపగ్రహాలు)ను భూమికి 508 నుంచి 760 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవకక్ష్య (సన్ సింక్రోనస్ ఆర్భిట్)లోకి ప్రవేశపెట్టారు. పీఎస్ఎల్వీ రాకెట్లు ఇస్రోకు బహుళ ప్రయోజనకారిగా మారింది. వాణిజ్యపరమైన ఉపగ్రహాలు, రిమోట్ సెన్సింగ్, వాతావరణ, సమాచార ఉపగ్రహాలను సైతం పంపించేందుకు పీఎస్ఎల్వీ ఎంతో దోహదపడింది. ఆ తరువాత 2 టన్నుల నుంచి 4 టన్నుల వరకు బరువైన సమాచార ఉపగ్రహాల(కమ్యూనికేషన్ శాటిలైట్స్)ను ప్రయోగించేం దుకు 2001లో జియో శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ), జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్లను రూపొందించారు. జీఎస్ఎల్వీ రాకెట్ల ప్రయోగంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ సాంకేతిక పరమైన పరిణితి సాధించి 2 వేల కిలోల నుంచి 4 వేల కిలోల బరువు కలిగిన సమాచార ఉపగ్రహాలను రోదసీలోకి పంపించే స్థాయికి చేరింది. ప్రస్తుతం పంపబోయే చంద్రయాన్–2 ఉపగ్రహం బరువు కూడా 3.8 టన్నులు కావడం విశేషం. -
ఇస్రో ‘బాహుబలి రాకెట్’ సెల్ఫీలు చూశారా..!
న్యూఢిల్లీ: దేశ చరిత్రలోనే అతి పెద్ద ప్రయోగాన్ని చేపట్టి విజయపతాకాన్ని ఎగరేసిన ఇస్రో ‘బాహుబలి’ రాకెట్ జీఎస్ఎల్వీ మార్క్ 3డీ1 రాకెట్ మరో అద్భుతం చేసింది. తాను నింగిలోకి దూసుకెళ్లే క్రమంలో టకటకా సెల్ఫీలు తీసి పంపించింది. సెల్ఫీలు సాధారణంగా మనుషులు మాత్రమే తీసుకోవడం జరుగుతుండగా ఇలా రాకెట్లు స్వీయచిత్రాలు తీసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. దేశ చరిత్ర నలుదిశలా వ్యాపింపజేసేలా నిప్పులు చిమ్ముకుంటూ జీఎస్ఎల్వీ మార్క్3డీ1 రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన విషయం తెలిసిందే. 3,136 కిలోల బరువున్న భారీ ఉపగ్రహం జీశాట్–19ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రెండు రోజుల కిందట ఈ ప్రయోగం పూర్తికాగా తాజాగా సెల్ఫీ చిత్రాలు తీసి పంపించింది. అయితే, ప్రయోగం ప్రారంభమైన తర్వాత కూడా సోమవారం కొన్ని సెల్ఫీలు తీసుకుంది. బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్‌తో ఇన్ఫ్రారెడ్ కలర్లో కనిపిస్తూ 200 టన్నుల బూస్టర్లు ఎర్రగా మండిపోతున్న దృశ్యాలు, అనంతరం జీశ్యాట్ ఉపగ్రహాన్ని ఆర్బిట్‌లో ప్రవేశపెడుతున్నప్పటి చిత్రాలను తానే స్వయంగా చిత్రించి బుధవారం ఇస్రో శాస్త్రవేత్తలకు పంపించింది. -
గ'ఘన' విజయం
జీఎస్ఎల్వీ మార్క్–3డీ1 ప్రయోగం సక్సెస్ కక్ష్యలోకి చేరిన ఉపగ్రహం జీశాట్–19 16.20 నిమిషాల్లో పూర్తయిన ప్రయోగం ఇస్రోకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు శ్రీహరికోట (సూళ్లూరుపేట): క్షణాలు కరిగిపోతున్నాయి.. 3, 2, 1, 0.. ఉత్కంఠకు తెరదించుతూ.. మువ్వన్నెల పతాకను మరోసారి సగర్వంగా ఎగరేస్తూ.. నిప్పులు చిమ్ముకుంటూ జీఎస్ఎల్వీ మార్క్–3డీ1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది! 3,136 కిలోల బరువున్న భారీ ఉపగ్రహం జీశాట్–19ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది! భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా ఒదిగిపోయింది. ప్రయోగం సాగిందిలా.. జీఎస్ఎల్వీ మార్క్–3డీ1న ప్రయోగం విజయవంతమవడంతో ఇస్రో పదిహేడేళ్ల కఠోర శ్రమ ఫలించింది. బాహుబలిగా అభివర్ణిస్తున్న జీఎస్ఎల్వీ మార్క్–3డీ1 ప్రయోగానికి ఆదివారం సాయంత్రం 3.58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సోమవారం సరిగ్గా సాయంత్రం 5.28 గంటలకు రాకెట్ నింగికేగింది. ఒక్కో దశ విజయవంతం అయ్యేకొద్దీ శాస్త్రవేత్తల ముఖాల్లో విజయగర్వం తొణికిసలాడింది. రాకెట్‌కు మొదటి దశలో రెండు వైపులా అమర్చిన రెండు ఘన ఇంధన స్ట్రాపాన్ బూస్టర్లు (ఎస్–200), రెండో దశలో అమర్చిన 110 టన్నుల ద్రవ ఇంధనం (ఎల్–110) దశలు సమర్థంగా పనిచేశాయి. కీలకమైన మూడో దశలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనం (సీ–25) మండి రాకెట్‌ను 175 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చింది. తర్వాత రాకెట్‌పై భాగంలో అమర్చిన 3,136 కిలోల జీశాట్–19 సమాచార ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టారు. ప్రయోగం మొత్తం 16.20 నిమిషాల్లో పూర్తయింది. ఈ విజయంతో భవిష్యత్‌లో 3 టన్నుల నుంచి 5 టన్నుల బరువు కలిగిన సమాచార ఉపగ్రహాల (కమ్యూనికేషన్ శాటిలైట్స్)తో పాటు చంద్రయాన్–2 ప్రయోగంలో రోవర్‌ను, అలాగే స్పేస్ షటిల్ ప్రోగ్రాంలో భాగంగా మానవుడిని అంతరిక్షంలోకి పంపగలమని శాస్త్రవేత్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఉపగ్రహం కక్ష్యలోకి చేరగానే బెంగళూరులోని హసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ (ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం) నుంచి అంతా సవ్యంగా ఉన్నట్టు ప్రకటన వెలువడింది. ప్రయోగం విజయవంతం కాగానే మిషన్ కంట్రోల్ సెంటర్లోని శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. ప్రపంచదేశాల్లో తిరుగులేని శక్తిగా.. తాజా ప్రయోగంతో ప్రపంచ దేశాల్లో భారత్ తిరుగులేని శక్తిగా అవతరించింది. పదిహేడేళ్లుగా ఇస్రో ఎస్–200 ఘన ఇంధన బూస్టర్లు, ఎల్–100 ద్రవ ఇంధన దశ, సీ–25 క్రయోజనిక్ ఇంజిన్లను అభివృద్ధి చేసుకోవడానికి ఎన్నో పరిశోధనలు చేసింది. 2014 డిసెంబర్ 14న జీఎస్ఎల్వీ మార్క్–3డీ1 రాకెట్‌ను ప్రయోగాత్మకంగా ప్రయోగించి ఎస్–200, ఎల్–110 సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. ఆ ప్రయోగంలో సీ–25 లేకుండా డమ్మీని ఉపయోగించారు. తాజాగా సీ–25కు అనేక రకాల భూస్థిర పరీక్షలు నిర్వహించి పూర్తిస్థాయిలో ప్రయోగించారు. ఈ ప్రయోగం ఎవరెస్ట్‌లాంటిది జీఎస్ ఎల్వీ మార్క్–3డీ1 విజయం పదిహేడేళ్ల కఠోర శ్రమకు గుర్తింపు అని, ఇది ఊహలకందని విజయ మని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ పేర్కొ న్నారు. ‘‘ఇన్నాళ్లు చేసిన ప్రయోగాలు ఒక ఎత్త యితే ఈ ప్రయోగం ఎవరెస్ట్ అంత ఎత్తు’’ అని అన్నారు. భారత్ ప్రపంచం వైపు చూసే స్థాయి నుంచి నేడు ప్రపంచమంతా భారత్ వైపు చూసే స్థాయికి చేరుకోగలిగామని.. ఈ విజయం ప్రతి భారతీయుడిని తలెత్తెకునేలా చేసిం దని చెప్పారు. ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో ఏటా 12 పీఎస్ఎల్వీ ప్రయోగాలు, 2 జీఎస్ఎల్వీ మార్క్–2, మార్క్–3 ప్రయోగాలు చేయగలమన్న నమ్మకం కుదిరింద న్నారు. జీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతమైన తరువాత శ్రీహరికోటలోని షార్‌లో మీడియాతో మాట్లాడారు. మార్క్–3 రాకెట్‌ను రెండింతలు బలోపేతం చేసి భారీ ప్రయోగాలకు సిద్ధమవుతామన్నారు. ఇంతటి ఘన విజయం సాధించడానికి అహర్నిశలు కృషి చేసిన ఇస్రో సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా క్రయోజనిక్ దశను రూ పొందించడంలో ఎంతో పరిణతిని సా«ధించా మని, ప్రపంచంలో అతి తక్కువ దేశాలకే ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం ఉందని చెప్పారు. ఈ రాకెట్ ద్వారా పంపిన ఉపగ్రహంలో అమర్చిన కే–బ్యాండ్, కేయూ బ్యాండ్ హైఫ్రీక్వెన్సీ ట్రాన్స్పాండర్లు.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిం చేందుకు దోహదపడతాయని చెప్పారు. వ్యయం తగ్గిస్తున్నాం.. రాబోయే రెండేళ్లలో ఎలక్ట్రికల్ ప్రొపల్షన్ వ్యవస్థల ను అభివృద్ధి చేసి, ఉపగ్రహాల బరువును తగ్గిస్తా మని.. తద్వారా రాకెట్ బరువును తగ్గించి ప్రయో గ వ్యయాన్ని బాగా తగ్గిస్తామని తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే పరిశోధన ముమ్మరం చేశామని తెలిపారు. ఇక భవిష్యత్తు అంతా భారీ ప్రయోగాలే లక్ష్యంగా చేసుకోనున్నామని.. అందులో భాగంగా పీఎస్ఎల్వీ రాకెట్ సామర్థ్యాన్ని పెంచి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. వచ్చే ఏడాది చంద్రయాన్–2 ఈ నెల 23న పీఎస్ఎల్వీ సీ38, ఆ వెంటనే మరో జీఎస్ఎల్వీ మార్క్–2 ప్రయోగం ఉంటుందని తెలిపారు. 5.5 టన్నుల బరువుండే జీశాట్–11 ఉపగ్రహాన్ని తయారుచేస్తున్నామని.. దానిని ఫ్రాన్స్‌లోని గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నామని వెల్లడించారు. 2018 ప్రథమార్థంలో సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఉపగ్రహాన్ని, చంద్రుడిపై పరిశోధనకు చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని పంపనున్నామని చెప్పారు. జీశాట్–19 ఉపగ్రహంతో ఉపయోగాలివీ.. దేశంలో టెలివిజన్ ప్రసారాలు, టెలికాం రంగంలో విస్తృత సేవలు, ఇంటర్నెట్ వేగవంతం అవడమే కాకుండా అత్యంత అధునాతనమైన కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో ఇంటర్నెట్ను వేగవంతం చేయడానికి ఎంతో ఉపకరిస్తుంది. ఉపగ్రహంలో కేయూ బ్యాండ్ హైయర్ ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌పాండర్స్‌తో పాటు జియో స్టేషనరీ రేడియేషన్ స్పెక్ట్రోమీటర్ అనే పేలోడ్స్ అమర్చి పంపారు. ఇప్పటికే ఇస్రోకు చెందిన 14 సమాచార ఉపగ్రహాలు అంతరిక్ష కక్ష్యలో పనిచేస్తూ 275 ట్రాన్స్పాండర్లతో దేశవాళి డీటీహెచ్ ప్రసారాలు, టెలికాం సేవలు అందిస్తున్నాయి. అయితే దేశంలో 400 ట్రాన్స్పాండర్లు దాకా డిమాండ్ ఉంది. తాజా విజయంతో రాబోయే రెండుమూడేళ్లలో జీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 450 టాన్స్‌పాండర్లను అందుబాటులోకి తేవాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో 850 టీవీ చానళ్లు ఉంటే అందులో 650 చానళ్లను ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 300 చానళ్లకు మాత్రమే వీశాట్ లింక్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఇస్రో అంతర్గతంగా వాణిజ్యపరంగా 120 ట్రాన్స్పాండర్లను ఉపయోగించుకుంటోంది. జీశాట్–19 ఉపగ్రహంతో సమాచార వ్యవస్థలో అత్యంత అధునాతమైన సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఈ ఉపగ్రహం సుమారు 10 ఏళ్ల పాటు సేవలు అందిస్తుంది. పదిహేడేళ్ల శ్రమ ఫలితమిది సూళ్లూరుపేట: భారీ ఉపగ్రహాలను నింగి లోకి తీసుకెళ్లగల జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ అభివృద్ధి, విజయం వెనుక ఇస్రో పదిహేడేళ్లు కఠోర శ్రమ, నిరంతర కృషి దాగుంది. సుమారు 3 నుంచి 5 టన్నుల బరువైన సమాచార ఉపగ్రహాలను ప్ర యోగించేందుకు.. మనుషులను అంత రిక్షంలోకి తీసుకెళ్లేందుకు.. చంద్రుడు, అంగారకుడి మీద పరిశోధనల కోసం రోవర్లను పంపేందుకు భారీ రాకెట్లు అవసరం. ఇస్రో 2000లో దీనిపై ప్రతిపా దన చేయగా కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిం ది. దాంతో మార్క్–3 తరహా భారీ రాకెట్ అభివృద్ధిపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. 2003లో ఈ ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్లు నిధులు మంజూరు చేశారు. ఆ నిధుల్లో రూ.700 కోట్లతో షార్‌లో ప్రయోగానికి అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించారు. అన్ని దశలూ భారీగానే..: పీఎస్ఎల్వీ, సాధారణ జీఎస్ఎల్వీ రాకెట్లలోని మొదటి దశలో సుమారు 138, 142 టన్నుల ఘన ఇంధనాన్ని వాడతారు. అయి తే భారీ రాకెట్ రూపకల్పనలో భాగంగా మార్క్3 ప్రయోగం మొదటి దశలో 200 టన్నుల చొప్పున ఘన ఇంధనాన్ని నింపిన రెండు స్ట్రాపాన్ (ఎస్–200) బూస్టర్లు అవసరమని గుర్తించారు. వీటిని షార్‌లోని ఘన ఇంధనం తయారీ విభాగం(స్ప్రాబ్)లోనే తయారు చేశారు. 2010 జనవరి 24న ఈఎస్–200 స్ట్రాపాన్ బూస్టర్లకు భూస్థిర పరీక్షలు నిర్వహించి విజయం సాధించారు. రెండో దశలో సాధారణంగా 40 టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగిస్తుండగా.. మార్క్ 3 తరహా కోసం 110 టన్నుల ఇంధనాన్ని నింపిన బూస్టర్ల(ఎల్–110) ను వినియోగించారు. వీటిని తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న లిక్విడ్ ప్రొపెల్లెంట్ స్పేస్ సెంటర్లో తయారు చేశారు. మూడోదశలో అత్యంత శక్తివంత మైన క్రయోజనిక్ ఇంజన్లను వినియోగిస్తారు. సాధారణ జీఎస్ఎల్వీలో ఈ దశలో 12.5 టన్నుల ఇంధనాన్ని వినియోగించగా.. మార్క్3 కోసం 25 టన్నులు వినియోగించాల్సి వచ్చింది. 12.5 టన్నుల క్రయోజనిక్ దశ రూపకల్పన కోసమే అప్పట్లో ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా కష్టపడ్డారు. తాజాగా 25 టన్నుల క్రయోదశ (సీ–25) అభివృద్ధి కోసం రెండేళ్లు పట్టింది. అయితే మొత్తంగా పూర్తిస్థాయిలో క్రయోజనిక్ దశ అభివృద్ధిలో ఇస్రో విజయం సాధించింది. 59 ప్రయోగాలు.. విజయాలు 51 ఇస్రో సోమవారం నిర్వహించిన జీఎస్ఎల్వీ మార్క్–3డీ1 ప్రయోగంతో 59 ప్రయోగాలు పూర్తి చేసుకుంది. ఇందులో 51 ప్రయోగాలు విజయవంతం కావడం గమనార్హం. వీటిల్లో ఇప్పటివరకు ఎక్కువగా పీఎస్ఎల్వీ ప్రయోగాలే విజయవంతంకాగా.. తాజాగా జీఎస్ఎల్వీ సిరీస్‌లోనూ వరుస విజయాలు ప్రారంభమయ్యాయి. క్రయోజనిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో జీఎస్ఎల్వీ డీ5, డీ6, మార్క్–3 ప్రయోగాత్మక ప్రయోగం, ఎఫ్–09 ప్రయోగాలతో పాటు తాజాగా మార్క్–3డీ1 ప్రయోగం కూడా వరుసగా విజయవంతమైంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఆరేళ్లుగా అపజయమే లేదు.. 2011 నుంచి ఇప్పటిదాకా వరుస విజయాల బాటలో సాగుతున్న ఇస్రో, షార్ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆరు పీఎస్ఎల్వీ రాకెట్లు, ఒక జీఎస్ఎల్వీ, ఆర్ఎల్వీ–టీడీ, ఏటీవీ వంటి రెండు ప్రయోగాత్మక ప్రయోగాలు విజయం సాధించి 2016 సంవత్సరమంతా విజయాల బాటలో నడవగా... 2017లోనూ మూడో విజయాన్ని అందుకున్నారు. అగ్రదేశాల సరసన - జీఎస్ఎల్వీ–మార్క్3ని ప్రయోగించడం ద్వారా భారత్ భారీ ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యం కలిగిన ఆరో దేశంగా గుర్తింపు పొందింది. ఇప్పటిదాకా భారీ ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యం అమెరికా, రష్యా, చైనా, జపాన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలకు మాత్రమే ఉంది. - 3 వేల కిలోల బరువు దాటితే దాన్ని భారీ ఉపగ్రహంగా పరిగణిస్తారు. - పాతతరం ఉపగ్రహాలతో పోలిస్తే జీశాట్–19 సామర్థ్యం చాలా ఎక్కువ. ఇది ఆరేడు పాత ఉపగ్రహాలకు సమానం. - ఇతర దేశాలతో పోలిస్తే భారీ ఉపగ్రహ ప్రయోగానికి భారత్‌కు అయ్యే ఖర్చు చాలా తక్కువ. మిగతా వాళ్లకంటే 60 నుంచి 70 శాతం తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు. - సమాచార ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లో సింహభాగం వాటా ప్రైవేటు సంస్థలు స్పేస్ ఎక్స్, అరియేన్‌లదే. 10 టన్నుల ఉపగ్రహాలను కూడా మోసుకెళ్లగల రాకెట్లు వీటి వద్ద ఉన్నాయి. - 5 టన్నుల దాకా బరువుండే ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి స్పేస్ ఎక్స్ సంస్థ తమ ఫాల్కన్–9 రాకెట్‌ను వాడుతుంది. దీనికి రూ.400 కోట్లు ఛార్జి చేస్తుంది. - భారత్ ఇప్పటిదాకా 21 దేశాలకు చెందిన 79 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే అంతర్జాతీయ విపణిలో భారత్ వాటా 0.6 శాతం మాత్రమే. - భవిష్యత్తులో మనుషులను అంతరిక్షంలోకి పంపడానికి ఇస్రో సిద్ధమవుతోంది. ఇందుకోసం రూ.12,500 కోట్లు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఒకవేళ ప్రభుత్వం అనుమతిస్తే ఈ మిషన్‌లో జీఎస్ఎల్వీ– మార్క్3 రాకెటే కీలకం కానుంది. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపగల సామర్థ్యం ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనాలకే ఉంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ దేశం గర్విస్తోంది: ప్రణబ్ జీఎస్ఎల్వీ–మార్క్ 3 ప్రయో గం విజయవంతమైనందుకు దేశం గర్విస్తోందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖ ర్జీ అన్నారు. ఇస్రో చైర్మన్ కిరణ్‌కు ప్రణబ్ అభినందన లేఖ పంపారు. ఈ విజయం చరిత్రాత్మకమైనదనీ, బృందంలోని శాస్త్రవేత్తలకు, ఇంజినీర్లకు, సాంకేతిక నిపుణు లకు.. ఈ ప్రయోగంలో భాగమైన వారికి తన తరఫున శుభా కాంక్షలు తెలియజేయాలని ఇస్రో చైర్మన్‌ను కోరారు. శాస్త్రవేత్తలకు అభినందనలు ఉపగ్రహ ప్రయోగం విజయం పై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయంతో తర్వాతి తరం ఉపగ్రహా సామర్థ్యానికి మనం మరింత చేరువయ్యామన్నారు. ‘అంకితభావంతో పని చేసి జీఎస్ఎల్వీ–మార్క్3 డీ1/జీశాట్– 19 ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు’ అని ట్విటర్లో పేర్కొన్నారు. దేశం గర్వించే విజయం: సోనియా జీఎస్ఎల్వీ ప్రయోగం సక్సెస్ కావడంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశం గర్వించేలా ఇస్రో సాధించిన మరో ప్రధాన విజయమిది’ అని ఆమె పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అభినందనలు ఇస్రోకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో తర్వాతి తరం ఉపగ్రహాల ప్రయోగానికి మరింతగా దగ్గరైందని కొనియాడారు. ఈ రోజు సాధించిన విజయం పట్ల దేశం గర్వపడుతోందన్నారు. మరో అరుదైన ఘనత: చంద్రబాబు ఇస్రో చరిత్రలో ఇది మరో అరుదైన ఘనతని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభినందించారు. శ్రీహరికోట నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం భారతావని గర్వించదగ్గ విజయమన్నారు. అగ్రదేశాల సరసన నిలిపారు: జగన్ జీఎస్ఎల్వీ– మార్క్3డీ1 ప్రయోగం విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఈ విజయం కమ్యూనికేషన్ల రంగంలో కొత్త శక్తి ఇస్తుందని అన్నారు. ఈ ప్రతిష్టాత్మక భారీ ప్రయోగంతో మన దేశం అంతరిక్ష రంగంలోని అగ్రగామి దేశాల సరసన చేరిందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. -
ప్రతిష్టాత్మక విజయం
మన అంతరిక్ష శాస్త్రవేత్తల ప్రతిభాపాటవాలు మరోసారి ప్రపంచానికి వెల్లడయ్యాయి. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం(షార్)నుంచి సోమ వారం జీఎస్ఎల్వీ మార్క్–3డీ1 రాకెట్ ద్వారా జీశాట్–19 సమాచార ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు జయప్రదంగా భూ అనువర్తిత బదిలీ కక్ష్య(జీటీఓ)లో ప్రవేశపెట్టగలిగారు. టీవీ, టెలికాం రంగాల్లో ఈ ఉపగ్రహం విస్తృత సేవలందించడమే కాక ఇంటర్నెట్ను మరింత మెరుగ్గా, వేగంగా పనిచేసేలా చేయగలుగుతుంది. ఈ రాకెట్ ప్రయోగం ద్వారా అత్యంత సంక్లిష్టమైన క్రయోజనిక్ సాంకేతికతను వినియోగించ డంలో తమ నైపుణ్యం తిరుగులేనిదని ఇస్రో శాస్త్రవేత్తలు నిరూపించారు. కనుకనే పలువురు నేతలు అభివర్ణిస్తున్నట్టు ఇది అక్షరాలా చరిత్రాత్మక ఘట్టం. దాదాపు పద్దెనిమిదేళ్ల నుంచి కొనసాగిస్తున్న కఠోర పరిశ్రమ, పట్టుదల, అపజయాలను గుణపాఠంగా స్వీకరించి లోపాలను సరిదిద్దుకోగల చతురత ఈ అపురూప విజయాన్ని వారికి అందించాయి. ప్రయోగ వాహక నౌక మార్క్–3డీ1ను అందరూ ‘బాహుబలి’గా అభివర్ణిస్తున్నారు. మరికొందరు ‘తెలివైన, అణుకువగలిగిన బాలు డ’ంటున్నారు. ఈ రెండు పోలికలూ దీనికి సరిపోతాయి. ఎందుకంటే 3,136 కిలోల బరువున్న ఉపగ్రహంతో కలుపుకొని ఈ రాకెట్ బరువు దాదాపు 5,80,600 కిలోలు. ఇంత భారీ వాహక నౌక 35,975 కిలోమీటర్ల ఎత్తులోని జీటీఓలోకి ఉపగ్రహాన్ని సునాయాసంగా మోసుకెళ్లగలగటం, దాన్ని నిర్దేశిత కక్ష్యలో ఉంచడం సామాన్యం కాదు. ప్రయోగించిన సమయం నుంచి చివరివరకూ శాస్త్రవేత్తలు ఇచ్చిన ఆదేశా లను బుద్ధిగా పాటించబట్టే ఇదంతా సాధ్యమైంది. కనుక ఈ రెండు పోలికలూ దీనికి సరిపోతాయి. రాకెట్ రూపకల్పనకు వినియోగించిన విడిభాగాల్లో అత్యధికం పూర్తిగా స్వదేశంలో తయారైనవే. ఈ సందర్భంగా మార్క్–3డీ1 రాకెట్ రూపకల్పన గురించి చెప్పుకోవాలి. తొలి జీఎస్ఎల్వీ ప్రయోగం 2001లో జరిగింది. అప్పుడు 1,500 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని ఆ రాకెట్ తీసుకెళ్లగలిగింది. ఆ తర్వాత 1,900 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని పంపారు. తొమ్మిదేళ్ల వ్యవధిలో నిర్వహించిన అయిదు ప్రయోగాల అనంతరం జీఎస్ఎల్వీ తదుపరి దశ ‘మార్క్2’ మొదలైంది. అందులో 2,200 కిలోల ఉపగ్రహాన్ని జయప్రదంగా పంపగలిగారు. ఇలా మార్క్2లో అయిదుసార్లు ప్రయోగాలు నిర్వహించగా అందులో ఒక్కటి మాత్రం విఫలమైంది. గత నెల అయిదో తేదీన విజయవంతంగా ప్రయోగించిన సార్క్ ఉపగ్రహం ఆ సిరీస్‌లోనిదే. ‘మార్క్3’ దశ అత్యంత క్లిష్టమైనదీ, సవాళ్లతో కూడుకుని ఉన్నదీ. దీన్ని సాకారం చేసుకోవడంలో శాస్త్రవేత్తలు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వారికి అడు గడుగునా సమస్యలెదురయ్యాయి. వారెదుర్కొన్న సవాళ్లన్నిటిలో దేశీయ క్రయోజ నిక్ ఇంజన్ రూపకల్పన కీలకమైనది. సరిగ్గా ఏడేళ్లక్రితం...అంటే 2010 ఏప్రిల్‌లో జీఎస్ఎల్వీ రాకెట్లో తొలిసారి దేశీయ క్రయోజనిక్ ఇంజన్‌ను ఉపయోగించినప్పుడు అనుకోని అవాంతరాలు ఎదురై అది విఫలమైంది. క్రయోజనిక్ సాంకేతికత సామాన్యమైనది కాదు. భారీ బరువుండే ఉపగ్రహాలను మోసుకెళ్లాలన్నా, వాటిని సుదూరంగా 36,000 కిలో మీటర్ల ఆవల కక్ష్యలో ఉంచాలన్నా ఆ సాంకేతికతను వినియోగించడం మినహా మరో మార్గం లేదు. కానీ అది మన దగ్గర లేదు. క్రయోజనిక్ సాంకేతికత ఉన్న అమెరికా దాన్ని ఇవ్వడానికి నిరాకరించడమే కాదు... రష్యా కూడా ఇవ్వకుండా అడ్డుకుంది. 1992లో క్రయోజనిక్ సాంకేతికతనూ, ఇంజన్లనూ అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న రష్యా అమెరికా ఒత్తిడితో పాక్షికంగా వెనక్కు తగ్గింది. కేవలం ఇంజన్లు మాత్రమే అందజేసింది. దీన్నంతటినీ మన శాస్త్రవేత్తలు సవా లుగా తీసుకున్నారు. శ్రమించారు. చివరకు విజయం సాధించారు. ఈ సందర్భంగా క్రయోజనిక్ సాంకేతికత గురించి తెలుసుకోవాలి. క్రయోజనిక్ ఇంజన్లలో హైడ్రో జన్ను ఇంధనంగా ఉపయోగిస్తారు. ఆక్సిజెన్ సాయంతో దాన్ని మండిస్తారు. హైడ్రోజన్‌ను ద్రవరూపంలో ఉంచాలంటే దాన్ని మైనస్ 253 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచాలి. దాన్ని మండించడానికి ఉపయోగించే ఆక్సిజెన్ మైనస్ 195 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఉండాలి. ఈ రెండింటినీ ఇలా శీతల స్థితిలో ఉంచలేకపోతే అవి మళ్లీ వాయు రూపంలోకి మారిపోతాయి. ఇంజన్లో ఉపయోగించే పరికరాలు, పైపులు సైతం శీతల స్థితిలో ఉంటే తప్ప హైడ్రోజన్, ఆక్సిజెన్లను అతి శీతలంగా ఉంచడం సాధ్యం కాదు. ఈ పనంతా క్రయోజనిక్ ఇంజన్లోనే కుదురుతుంది. అయితే రష్యా ఇంజన్ల ఖరీదు తక్కువేమీ కాదు. ఒక్కో ఇంజన్ రూ. 90 కోట్ల పైమాటే. దేశీయంగా తయారయ్యే ఇంజన్ వ్యయం అందులో సగం కన్నా తక్కువ. భారీ ఉపగ్రహాల ప్రయోగానికి ఇతరులు రూ. 800 కోట్ల వరకూ ఖర్చు చేస్తుంటే మన ప్రయోగ వ్యయం దాదాపు రూ. 350 కోట్లు! అమెరికా, రష్యాలు ఈ సాంకే తికతను అభివృద్ధి చేసుకోవడంలో ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొనవలసి వచ్చింది. 15 ఏళ్ల సుదీర్ఘ కాలం పట్టింది. కానీ 2010 నాటి తొలి ప్రయోగం విఫలమయ్యాక మన శాస్త్రవేత్తలు ఎంతో పట్టుదలగా శ్రమించి అతి తక్కువ వ్యవధిలో తొలి విజయం సొంతం చేసుకున్నారు. తొలి దేశీయ ఉపగ్రహ ప్రయోగ నౌక ఎస్ఎల్వి–3ని ప్రయోగించిన 1980తో పోల్చి ప్రస్తుత పురోగతిని గమనిస్తే అంత రిక్ష రంగంలో మన శాస్త్రవేత్తల ప్రతిభాపాటవాలు సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తాయి. సోమవారం నాటి ప్రయోగం మన దేశ కీర్తిప్రతిష్టలను పెంచడం మాత్రమే కాదు... వందలకోట్ల డాలర్ల విలువ గల అంతర్జాతీయ ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లో మన దేశ గిరాకీని పెంచింది. రోదసి వాణిజ్యంలో అందరికీ పోటీనివ్వగల స్థాయికి చేర్చింది. భారత్ చాలా తక్కువ వ్యయంతో, సమర్ధవంతంగా, సురక్షితంగా ఉప గ్రహాలను ప్రయోగించగలదన్న ఖ్యాతిని తెచ్చిపెట్టింది. వీటన్నిటికీ మించి భవి ష్యత్తులో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపగల సత్తాను సంతరించుకుంది. ఇన్నిటిని సుసాధ్యం చేసే అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నందుకు ఇస్రో శాస్త్ర వేత్తలు అభినందనీయులు. -
జీఎస్ఎల్వీ మార్క్-3 కౌంట్‌డౌన్ ప్రారంభం
శ్రీహరికోట: వరుస విజయాలతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మంచి ఊపుమీదుంది. అంతరిక్షరంగంలో అద్భుతమైన ప్రయోగాలతో అగ్రరాజ్యాలకు కన్నుకుట్టేలా దూసుకుపోతోంది. ఇప్పుడు మరో భారీ ప్రయోగానికి రంగం సిద్ధం చేసుకుంది. జీఎస్ఎల్వీ మార్క్3–డీ1 ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. భారత అంతరిక్ష పరిరోధనా సంస్థ దాదాపు 18 ఏళ్లు శ్రమించి రూపొందించిన భారీ రాకెట్ జీఎస్ఎల్వీ-మార్క్-3-డీ-1ను సోమవారం సాయంత్రం 5 గంటల 28 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. ఇంతవరకు ఇస్రో ప్రయోగించిన జీఎస్ఎల్వీ రాకెట్లన్నింటిలో ఇప్పుడు ప్రయోగించబోయేది అత్యంత పెద్ద రాకెట్. ఈ రాకెట్ ద్వారా జీ-శాట్19 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెడతారు. -
18న జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగం
సూళ్లూరుపేట: మానవసహిత అంతరిక్ష యాత్రకు కసరత్తులో భాగంగా జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగాన్ని ఈ నెల 18న శ్రీహరికోటలోని షార్ ప్రయోగకేంద్రం నుంచి చేపట్టాలని ఇస్రో నిర్ణయించింది. కాగా ఇస్రో ఆదివారం ఫ్రెంచి గయానా నుంచి ప్రయోగించిన జీశాట్-16 సమాచార ఉపగ్రహం సోమవారం 16,005 కి.మీ. పెరిజీ(భూమికి దగ్గరగా), 35,769 కి.మీ. అపోజీ (భూమికి దూరంగా)గల కక్ష్యకు చేరుకుంది.