ప్రతిష్టాత్మక విజయం | Editorial on GSLV Mark III | Sakshi
Sakshi News home page

ప్రతిష్టాత్మక విజయం

Published Tue, Jun 6 2017 12:38 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

ప్రతిష్టాత్మక విజయం - Sakshi

ప్రతిష్టాత్మక విజయం

మన అంతరిక్ష శాస్త్రవేత్తల ప్రతిభాపాటవాలు మరోసారి ప్రపంచానికి వెల్లడయ్యాయి. శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం(షార్‌)నుంచి సోమ వారం జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3డీ1 రాకెట్‌ ద్వారా జీశాట్‌–19 సమాచార ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు జయప్రదంగా భూ అనువర్తిత బదిలీ కక్ష్య(జీటీఓ)లో ప్రవేశపెట్టగలిగారు. టీవీ, టెలికాం రంగాల్లో ఈ ఉపగ్రహం విస్తృత సేవలందించడమే కాక ఇంటర్నెట్‌ను మరింత మెరుగ్గా, వేగంగా పనిచేసేలా చేయగలుగుతుంది. ఈ రాకెట్‌ ప్రయోగం ద్వారా అత్యంత సంక్లిష్టమైన క్రయోజనిక్‌ సాంకేతికతను వినియోగించ డంలో తమ నైపుణ్యం తిరుగులేనిదని ఇస్రో శాస్త్రవేత్తలు నిరూపించారు. కనుకనే పలువురు నేతలు అభివర్ణిస్తున్నట్టు ఇది అక్షరాలా చరిత్రాత్మక ఘట్టం. దాదాపు పద్దెనిమిదేళ్ల నుంచి కొనసాగిస్తున్న కఠోర పరిశ్రమ, పట్టుదల, అపజయాలను గుణపాఠంగా స్వీకరించి లోపాలను సరిదిద్దుకోగల చతురత ఈ అపురూప విజయాన్ని వారికి అందించాయి.

ప్రయోగ వాహక నౌక మార్క్‌–3డీ1ను అందరూ ‘బాహుబలి’గా అభివర్ణిస్తున్నారు. మరికొందరు ‘తెలివైన, అణుకువగలిగిన బాలు డ’ంటున్నారు. ఈ రెండు పోలికలూ దీనికి సరిపోతాయి. ఎందుకంటే 3,136 కిలోల బరువున్న ఉపగ్రహంతో కలుపుకొని ఈ రాకెట్‌ బరువు దాదాపు 5,80,600 కిలోలు. ఇంత భారీ వాహక నౌక 35,975 కిలోమీటర్ల ఎత్తులోని జీటీఓలోకి ఉపగ్రహాన్ని సునాయాసంగా మోసుకెళ్లగలగటం, దాన్ని నిర్దేశిత కక్ష్యలో ఉంచడం సామాన్యం కాదు. ప్రయోగించిన సమయం నుంచి చివరివరకూ శాస్త్రవేత్తలు ఇచ్చిన ఆదేశా లను బుద్ధిగా పాటించబట్టే ఇదంతా సాధ్యమైంది. కనుక ఈ రెండు పోలికలూ దీనికి సరిపోతాయి. రాకెట్‌ రూపకల్పనకు వినియోగించిన విడిభాగాల్లో అత్యధికం పూర్తిగా స్వదేశంలో తయారైనవే.

ఈ సందర్భంగా మార్క్‌–3డీ1 రాకెట్‌ రూపకల్పన గురించి చెప్పుకోవాలి. తొలి జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం 2001లో జరిగింది. అప్పుడు 1,500 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని ఆ రాకెట్‌ తీసుకెళ్లగలిగింది. ఆ తర్వాత 1,900 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని పంపారు. తొమ్మిదేళ్ల వ్యవధిలో నిర్వహించిన అయిదు ప్రయోగాల అనంతరం జీఎస్‌ఎల్‌వీ తదుపరి దశ ‘మార్క్‌2’ మొదలైంది. అందులో 2,200 కిలోల ఉపగ్రహాన్ని జయప్రదంగా పంపగలిగారు. ఇలా మార్క్‌2లో అయిదుసార్లు ప్రయోగాలు నిర్వహించగా అందులో ఒక్కటి మాత్రం విఫలమైంది. గత నెల అయిదో తేదీన విజయవంతంగా ప్రయోగించిన సార్క్‌ ఉపగ్రహం ఆ సిరీస్‌లోనిదే. ‘మార్క్‌3’ దశ అత్యంత క్లిష్టమైనదీ, సవాళ్లతో కూడుకుని ఉన్నదీ. దీన్ని సాకారం చేసుకోవడంలో శాస్త్రవేత్తలు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వారికి అడు గడుగునా సమస్యలెదురయ్యాయి. వారెదుర్కొన్న సవాళ్లన్నిటిలో దేశీయ క్రయోజ నిక్‌ ఇంజన్‌ రూపకల్పన కీలకమైనది.

సరిగ్గా ఏడేళ్లక్రితం...అంటే 2010 ఏప్రిల్‌లో జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లో తొలిసారి దేశీయ క్రయోజనిక్‌ ఇంజన్‌ను ఉపయోగించినప్పుడు అనుకోని అవాంతరాలు ఎదురై అది విఫలమైంది. క్రయోజనిక్‌ సాంకేతికత సామాన్యమైనది కాదు. భారీ బరువుండే ఉపగ్రహాలను మోసుకెళ్లాలన్నా, వాటిని సుదూరంగా 36,000 కిలో మీటర్ల ఆవల కక్ష్యలో ఉంచాలన్నా ఆ సాంకేతికతను వినియోగించడం మినహా మరో మార్గం లేదు. కానీ అది మన దగ్గర లేదు. క్రయోజనిక్‌ సాంకేతికత ఉన్న అమెరికా దాన్ని ఇవ్వడానికి నిరాకరించడమే కాదు... రష్యా కూడా ఇవ్వకుండా అడ్డుకుంది. 1992లో క్రయోజనిక్‌ సాంకేతికతనూ, ఇంజన్లనూ అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న రష్యా అమెరికా ఒత్తిడితో పాక్షికంగా వెనక్కు తగ్గింది. కేవలం ఇంజన్‌లు మాత్రమే అందజేసింది. దీన్నంతటినీ మన శాస్త్రవేత్తలు సవా లుగా తీసుకున్నారు. శ్రమించారు. చివరకు విజయం సాధించారు. ఈ సందర్భంగా క్రయోజనిక్‌ సాంకేతికత గురించి తెలుసుకోవాలి.

క్రయోజనిక్‌ ఇంజన్లలో హైడ్రో జన్‌ను ఇంధనంగా ఉపయోగిస్తారు. ఆక్సిజెన్‌ సాయంతో దాన్ని మండిస్తారు. హైడ్రోజన్‌ను ద్రవరూపంలో ఉంచాలంటే దాన్ని మైనస్‌ 253 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచాలి. దాన్ని మండించడానికి ఉపయోగించే ఆక్సిజెన్‌ మైనస్‌ 195 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో ఉండాలి. ఈ రెండింటినీ ఇలా శీతల స్థితిలో ఉంచలేకపోతే అవి మళ్లీ వాయు రూపంలోకి మారిపోతాయి. ఇంజన్‌లో ఉపయోగించే పరికరాలు, పైపులు సైతం శీతల స్థితిలో ఉంటే తప్ప హైడ్రోజన్, ఆక్సిజెన్‌లను అతి శీతలంగా ఉంచడం సాధ్యం కాదు. ఈ పనంతా క్రయోజనిక్‌ ఇంజన్‌లోనే కుదురుతుంది. అయితే రష్యా ఇంజన్‌ల ఖరీదు తక్కువేమీ కాదు. ఒక్కో ఇంజన్‌ రూ. 90 కోట్ల పైమాటే. దేశీయంగా తయారయ్యే ఇంజన్‌ వ్యయం అందులో సగం కన్నా తక్కువ.  

భారీ ఉపగ్రహాల ప్రయోగానికి ఇతరులు రూ. 800 కోట్ల వరకూ ఖర్చు చేస్తుంటే మన ప్రయోగ వ్యయం దాదాపు రూ. 350 కోట్లు! అమెరికా, రష్యాలు ఈ సాంకే తికతను అభివృద్ధి చేసుకోవడంలో ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొనవలసి వచ్చింది. 15 ఏళ్ల సుదీర్ఘ కాలం పట్టింది. కానీ 2010 నాటి తొలి ప్రయోగం విఫలమయ్యాక మన శాస్త్రవేత్తలు ఎంతో పట్టుదలగా శ్రమించి అతి తక్కువ వ్యవధిలో తొలి విజయం సొంతం చేసుకున్నారు. తొలి దేశీయ ఉపగ్రహ ప్రయోగ నౌక ఎస్‌ఎల్‌వి–3ని ప్రయోగించిన 1980తో పోల్చి ప్రస్తుత పురోగతిని గమనిస్తే అంత రిక్ష రంగంలో మన శాస్త్రవేత్తల ప్రతిభాపాటవాలు సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తాయి.

సోమవారం నాటి ప్రయోగం మన దేశ కీర్తిప్రతిష్టలను పెంచడం మాత్రమే కాదు... వందలకోట్ల డాలర్ల విలువ గల అంతర్జాతీయ ఉపగ్రహ ప్రయోగ మార్కెట్‌లో మన దేశ గిరాకీని పెంచింది. రోదసి వాణిజ్యంలో అందరికీ పోటీనివ్వగల స్థాయికి చేర్చింది. భారత్‌ చాలా తక్కువ వ్యయంతో, సమర్ధవంతంగా, సురక్షితంగా ఉప గ్రహాలను ప్రయోగించగలదన్న ఖ్యాతిని తెచ్చిపెట్టింది. వీటన్నిటికీ మించి భవి ష్యత్తులో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపగల సత్తాను సంతరించుకుంది. ఇన్నిటిని సుసాధ్యం చేసే అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నందుకు ఇస్రో శాస్త్ర వేత్తలు అభినందనీయులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement