ఇస్రో ‘బాహుబలి రాకెట్’ సెల్ఫీలు చూశారా..!
న్యూఢిల్లీ: దేశ చరిత్రలోనే అతి పెద్ద ప్రయోగాన్ని చేపట్టి విజయపతాకాన్ని ఎగరేసిన ఇస్రో ‘బాహుబలి’ రాకెట్ జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3డీ1 రాకెట్ మరో అద్భుతం చేసింది. తాను నింగిలోకి దూసుకెళ్లే క్రమంలో టకటకా సెల్ఫీలు తీసి పంపించింది. సెల్ఫీలు సాధారణంగా మనుషులు మాత్రమే తీసుకోవడం జరుగుతుండగా ఇలా రాకెట్‌లు స్వీయచిత్రాలు తీసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. దేశ చరిత్ర నలుదిశలా వ్యాపింపజేసేలా నిప్పులు చిమ్ముకుంటూ జీఎస్‌ఎల్‌వీ మార్క్3డీ1 రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన విషయం తెలిసిందే.
3,136 కిలోల బరువున్న భారీ ఉపగ్రహం జీశాట్–19ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రెండు రోజుల కిందట ఈ ప్రయోగం పూర్తికాగా తాజాగా సెల్ఫీ చిత్రాలు తీసి పంపించింది. అయితే, ప్రయోగం ప్రారంభమైన తర్వాత కూడా సోమవారం కొన్ని సెల్ఫీలు తీసుకుంది. బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్‌తో ఇన్‌ఫ్రారెడ్ కలర్‌లో కనిపిస్తూ 200 టన్నుల బూస్టర్లు ఎర్రగా మండిపోతున్న దృశ్యాలు, అనంతరం జీశ్యాట్ ఉపగ్రహాన్ని ఆర్బిట్‌లో ప్రవేశపెడుతున్నప్పటి చిత్రాలను తానే స్వయంగా చిత్రించి బుధవారం ఇస్రో శాస్త్రవేత్తలకు పంపించింది.