హామీలు గాలికి! | Guarantees the wind! | Sakshi
Sakshi News home page

హామీలు గాలికి!

Published Sun, Mar 8 2015 2:39 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

Guarantees the wind!

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎన్నికల ముందు ఓ మాట.. తర్వాత మరో మాట. ఇదీ టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు. ఇదీ జనం మాట. అధికారంలోకి వస్తే రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతలు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తాను.. ఎవ్వరూ బ్యాంకుల్లో డబ్బులు కట్టొద్దని గట్టిగా చెప్పారు. మొదటి సంతకంతోనే రుణాలన్నీ మాఫీ చేస్తానని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక బాబు ఇచ్చిన మాటను తప్పారు. సీఎంగా ప్రమాణం చేసి ఏడాది కావస్తున్నా.. ఏ ఒక్కరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ అయిన దాఖలాలు లేవు. రకరకాల కొర్రీలతో 5,04,,611 మంది రైతులకుగానూ తొలి విడతలో 1,84,955 మందిని మాత్రమే అర్హులని తేల్చారు.
 
  మిగిలి వారిలో 1,34.925 మందిని అనర్హులుగా ప్రకటించారు. మిగిలిన 1,84,731 మంది జాబితాలో టెక్నికల్ లోపాలు ఉన్నాయంటూ వాయిదా వేసుకుంటూ పోతున్నారు. ఇందులో సుమారు 30 వేలమంది పేర్లు పక్కనపెట్టారు. బాబు హామీని నమ్మి రుణాలు చెల్లించకపోవడంతో రైతులు డీఫాల్టర్లు అయ్యారు. కేంద్రం భరించే 3 శాతం ఇన్సెంటివ్‌ని సైతం కోల్పోయారు. కొత్త రుణాలు ఇవ్వమని బ్యాంకర్లు తేల్చిచెబుతున్నారు. దీంతో రైతులు చేసేది లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.
 
 డ్వాక్రా రుణాలు మాఫీ కావు..
 కొత్త రుణాలు ఇవ్వరు
 జిల్లాలో సుమారు 35,565 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వివిధ బ్యాంకుల నుంచి రూ.592.28 కోట్ల రుణాలు తీసుకున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 8,690 సంఘాలకు సుమారు రూ. 200 కోట్ల రుణాలిచ్చారు. గతంలో బ్యాంకు లింకేజీ, స్వయం ఉపాధి కింద రూ. 236 కోట్లు పొందారు. నెల్లూరు నగరంలో 4,120 గ్రూపులకు రూ. 40 కోట్ల రుణాలు తీసుకుని ఉన్నారు. ఎన్నికల ముందు చెప్పినట్లు డ్వాక్రా మహిళలు తీసుకున్న రూ.592.28 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ఒక్కరూపాయి కూడా మాఫీ కాలేదు. దీంతో వడ్డీలు పెరిగిపోయాయి. కేవలం వడ్డీనే సుమారు రూ.90 కోట్లకు చేరింది. పాత రుణాలు చెల్లించకపోవటంతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వటం లేదు. దీంతో అధికారులు సైతం డ్వాక్రా మహిళలతో సమావేశాలు నిర్వహిస్తూ రుణాలు చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారు. అలాగే ఇసుకరీచ్‌ను మహిళా సంఘాలకు అప్పగించామని చెబుతూనే వాటిని తెలుగుతమ్ముళ్లు తమ గుప్పిట్లో పెట్టుకుని దోచుకుంటున్నారు.
 పండుటాకుల పాట్లు
 రాష్ట్రప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఇచ్చే భృతిని పెంచిన విషయం తెలిసిందే. అయితే అర్హులను తగ్గించేందుకు ప్రభుత్వం రకరకాల నిబంధనలు పెట్టింది. అందులో భాగంగా వయసు నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసి వారిని తిప్పుకుంటోంది. ఈక్రమంలోనే భారీగా అర్హులను తొలగించారు. మిగిలిన వారిని పింఛను సొమ్ముకోసం గంటల తరబడి ఎండలో నిల్చోబెడుతున్నారు.
 
 అయోమయంలో కాంట్రాక్టు ఉద్యోగులు
 జిల్లాలో సుమారు 3 వేల మందికిపైగా వివిధ శాఖల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి ఏడు నెలలు పూర్తవుతున్నా హామీ అమలు కాలేదు.
 
 హామీలు గుర్తున్నాయా.. బాబూ?
 ఎన్నికలకు ముందుకు మార్చి 5న చంద్రబాబు నగరంలోని వీఆర్‌సీగ్రౌండ్‌లో జరిగిన ప్రజాగర్జనలో అనేక హామీలు ఇచ్చారు. ఫిషింగ్ హార్బర్, పెన్నా, కండలేరు, సోమశిల, ఉత్తర కాలువ అభివృద్ధి, కృష్ణపట్నం, దుగ్గరాజపట్నం పోర్టుల అభివృద్ధి కోసం ప్రయత్నిస్తానని ప్రకటించారు. ఇంకా ఎరువుల పరిశ్రమ, చేనేత కార్మికులను ఆదుకునేందుకు జిల్లాలో టెక్స్‌టైల్ పార్క్, జాతీయ విద్యాసంస్థలు, కిసాన్‌సెజ్‌లో రైతులకు ఉపయోగపడే పరిశ్రమలు తెస్తానని ప్రకటించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో నాలుగుసార్లు బాబు జిల్లాకు వచ్చారు. జూన్ 6న షార్‌లో జరిగిన కార్యక్రమం కోసం, జులై 19న నెల్లూరులోని వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి, ఆగష్టు 24న స్వర్ణభారత్‌లో జరిగిన కార్యక్రమం కోసం, అక్టోబర్ 10న జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
 ఈ సందర్భంగా... సోమశిల ఎత్తిపోతల పథకం, సంగం, నెల్లూరు బ్యారేజీలు, తెలుగుగంగ కాలువలు, సోమశిల-స్వర్ణముఖి లింకు కాలువతో పాటు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ  ఐదేళ్లలో పూర్తిచేస్తామని, దీని ద్వారా మరో 4లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. మత్స్యకార్మికుల కోసం జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని, పులికాట్ సరస్సు ముఖద్వారాలు తెరిచి మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. నెల్లూరు నగరాన్ని స్మార్టుసిటీగా రూపొందిస్తామని కేంద్రం ప్రకటించిన వంద స్మార్టు సిటీల్లో నెల్లూరు ఒకటిగా ఉండేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నెల్లూరుకు విమానాశ్రయం సాధించాల్సి ఉందని, దీనిద్వారా  కావలి-నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రయోజనకరంగా కలుగుతుందని తెలిపారు. నెల్లూరు నగరానికి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు రూ.575 కోట్ల హడ్కో రుణం, మంచినీటి పథకానికి రూ.500 కోట్లు మంజూరుకు రాష్ట్రప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. రే కింద నెల్లూరుకు రూ.16 కోట్లు, సూళ్లూరుపేటకు రూ.25 కోట్లు మంజూ రు చేస్తున్నామని తెలిపారు. పులికాట్, నేలపట్టు, మైపా డు, పెంచలకోనలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, మైపాడుకు 4 వరుసల రోడ్డు మంజూరు చేస్తున్న ట్లు, నెల్లూరుకు రింగురోడ్డు కావాలని అడిగారని అది కూడా మంజూరు చేస్తున్నామని సభలో ఘనంగా ప్రకటించారు.
 
 నెల్లూరులో జాతీయక్రీడలను నిర్వహించేం దుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఒక ఈవెంట్‌ను నెల్లూరులో జరిగే విషయాన్ని పరిశీలిస్తానని ప్రకటించారు. పోతిరెడ్డిపాళెం, డక్కిలిలో జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న బాబు జిల్లాను టూరిజం హబ్‌గా తయారుచేస్తానని, వెంకటగిరి ప్రాంత పొలాలకు కండలేరు జలాలు తెప్పిస్తానని, వెంకటగిరిలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
 
 కోవూరు చక్కెర కర్మాగారం సంగతేంది..?
 కోవూరు చక్కెర కర్మాగారం పరిధిలో రూ.4.40 కోట్ల బకాయిలు రైతులకు, రూ.5.5 కోట్ల బకాయిలు కార్మికులకు చెల్లించాల్సి ఉంది. తిరిగి ఫ్యాక్టరీని నడిపేందుకు సుమారు రూ. 5కోట్లు అవసరముంది. పోతిరెడ్డిపాళేనికి వచ్చిన సీఎం ఫ్యాక్టరీ నడిచేలా చూస్తానని హామీ ఇచ్చారు. రెండు కమిటీలు వచ్చి ఫ్యాక్టరీ స్థితిగతులను పరిశీలించి వెళ్లాయి. ఫలితం కనిపించలేదు. దీంతో చెరకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ పరిస్థితుల్లో చక్కెర కర్మాగారాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెట్టడం గమనార్హం.  
 
 చేతల్లో ఏదీ..: బాబు ప్రటించిన హామీలు కార్యరూపంలో కనిపించడంలేదు. ఒకసారి నెల్లూరులో విమానాశ్రయం అని చెప్పిన బాబు మరోసారి వెంకటగిరిలో  అని ప్రకటన చేశారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో రూ.2కు ఇరవై లీటర్ల మంచి నీళ్లు పథకాన్ని జిల్లాలో కేవలం 18 చోట్ల మాత్రమే ప్రారంభించారు.
 
 తొమ్మిది గంటల కరెంటేదీ బాబూ?
 నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు అయితే ఇదీ సక్రమంగా అమలు కావడంలేదు. నగరంలో, పట్టణాల్లో విద్యుత్ కోతలు ఉంటున్నాయి. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ అని చెప్పారు. ప్రసు ్తతం కేవలం 5 గంటలు మాత్రమే సరఫరా అవుతుందని రైతులు చెబుతున్నారు. ఇంకా రాజీవ్ ఆరోగ్యశ్రీని పేరు మార్చి ఎన్టీఆర్ ఆర్యోగ సేవగా మార్చారే తప్ప కొత్తగా చేసిందేమీ లేదు. జిల్లాలో ఇప్పటికే 198 గ్రామాల్లో మంచినీటి సమస్యతో జనం అల్లాడుతున్నారు.
 
 పసుపుతాడే దిక్కు
 పంటల సాగు కోసం రైతులు, అవసరాల కోసం మహిళలు మెడలో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టుపెట్టి బంగారం రుణాలు సైతం మాఫీ చేస్తానని బాబు హామీ ఇచ్చారు. దీంతో మహిళలు బంగారాన్ని విడిపించుకోలేదు. తీరా రుణాలు మాఫీ కాకపోవటంతో వడ్డీలకు వడ్డీలు పెరిగి బంగారాన్ని వేలం వేస్తున్నట్లు బ్యాంకర్లు పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు. కొందరు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి విడిపించుకుంటుంటే.. మరికొందరు విడిపించుకునే స్తోమత లేక వదిలేసుకుంటున్నారు. దీంతో జిల్లాలో వేలాదిమంది మహిళలకు పసుపుతాడే దిక్కైంది. మెడలో పసుపుతాడు చూసుకుని కుమిలిపోతున్నారు.
 
 రుణం మాఫీ చేస్తారని నమ్మాం..
 నా పేరు పర్రి మస్తానమ్మ. మాది చిట్టమూరు మండలం గునపాటిపాళెం గ్రామం. మా గ్రూపులో పదిమంది సభ్యులం ఉన్నాం. మూడేళ్ల కిందట బ్యాంకులో రూ. 3లక్షలు పొదుపు రుణం తీసుకుని ఒక్కో సభ్యురాలు రూ. 30 వేలు చొప్పున తీసుకున్నాం. అయితే తీసుకున్న రుణాన్ని క డుతూ వచ్చాం. ఎన్నికల సమయంలో చంద్రబాబు పొదుపు మహిళల రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించారు. దీంతో రుణం కట్టడం మానుకున్నాం. మాఫీ కాకపోగా ఇప్పుడు వడ్డీలు పెరిగిపోతున్నాయి. మహిళలను చంద్రబాబు నమ్మించి మోసం చేశాడు. మహిళల ఉసురు తప్పక తగులుతుంది.                    
 -చిట్టమూరు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement