
స్నేహితులతో కలిసి శ్రీలంకలో గుడివాడ అమర్‌నా«థ్
సాక్షి, విశాఖపట్నం: శ్రీలంకలో ఉగ్రవాదుల పేలుళ్ల ఘటనను ప్రత్యక్షంగా చూడటంతో పాటు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్. శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ ప్రార్థనలు జరిగిన చర్చితో పాటు కింగ్స్‌జ్యూరీ హోటల్‌లో ఉగ్రవాదుల దుశ్చర్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ మారణహోమంలో సుమారు 300 మంది మృత్యువాత పడగా, 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన సమయంలో అమర్‌నాథ్ అక్కడే ఉన్నారు. స్నేహితులతో టూర్‌కి వెళ్లిన ఆయన కింగ్స్‌జ్యూరీ హోటల్‌కు చెందిన ఫ్లాట్‌లోనే బసచేశారు. పేలుళ్ల సమయంలో కూడా ఫ్లాట్‌లోనే ఉన్నారు.
ఈయన బసచేసిన పక్క అపార్ట్‌మెంట్‌లో కూడా పేలుళ్లు జరిగాయి. ఘటన జరిగిన వెంటనే ఆయన స్నేహితులతో కలిసి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. వాస్తవానికి టూర్ షెడ్యూల్ ప్రకారం సోమవారం రాత్రి శ్రీలంక నుంచి బయలుదేరాలి. కాని ఈ ఘటనతో ఆదివారం ఉదయమే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగా అక్కడ కూడా బాంబులు పెట్టారన్న సమాచారంతో విమాన రాకపోకలను నిలిపివేశారు. దీంతో రాత్రంతా ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండి ఉదయం చెన్నై విమానం ఎక్కి అక్కడి నుంచి సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఈ ఘటనపై అమర్‌నాథ్ సాక్షితో మాట్లాడుతూ దేవుడి ఆశీస్సులు, ప్రజల అభిమానమే తమను ఆ ఘటన నుంచి రక్షించాయన్నారు. అమర్‌తో పాటు శ్రీలంక వెళ్లిన వారితో వైఎస్సార్‌సీపీ నేత శ్రీకాంత్‌రాజు కూడా ఉన్నారు.