బెడిసి కొట్టిన టీడీపీ వ్యూహం
- కౌన్సిల్‌లో రచ్చకు విఫలయత్నం
- తిప్పికొట్టిన వైఎస్సార్‌సీపీ నేతలు
గుడివాడ :గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రచ్చ చేయాలనే టీడీపీ కౌన్సిల్ సభ్యుల వ్యూహం బెడిసి కొట్టింది. అత్యవసర సమావేశాన్ని వాయిదా వేయించేందుకు పట్టుబట్టి సమావేశం ఆదినుంచి చివరి వరకు ఆందోళనలు నిర్వహించి అభాసుపాలయ్యారు. వైఎస్సార్‌సీపీ సభ్యుల సమయస్ఫూర్తితో సమావేశం ఎజెండాలోని 64 అంశాలకు గానూ 61 అంశాలకు ఆమోదం అభించింది. శుక్రవారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) హాజరయ్యారు.
సమావేశం ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత లింగం ప్రసాద్ లేచి మాట్లాడుతూ తాము సమాచార హక్కు చట్టం ద్వారా మున్సిపల్ కమిషనర్‌ను సమాచారం అడిగామని ఇంతవరకు ఇవ్వలేదని చైర్మన్ యలవర్తిని ఇరకాటంలో పెట్టాలనే వ్యూహంతో ప్రశ్నించారు. దీనిపై అధికార వైఎస్సార్‌సీపీ కౌన్సిల్ సభ్యులు లేచి ఎజెండాలో లేని అంశంపై ఎలా సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అయితే టీడీపీ సభ్యులు ముందుగా రచించుకున్న వ్యూహం ప్రకారం చైర్మన్ పోడియం ఎదుట ఆందోళనకు దిగారు.
నవంబర్ 1నుంచి జన్మభూమి సభలు ఉన్నందున తప్పనిసరి పరిస్థితిలో అత్యవసర సమావేశం జరుపుతున్నామని యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు వినకుండా ఆందోళనకు దిగడంతో సమావే శాన్ని 15నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ యలవర్తి ప్రకటించారు. ఆ సమయంలో అధికార, ప్రతిపక్ష నాయకులు వ్యూహ ప్రతివ్యూహాలు రచించారు. ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో అధికార వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు అంతా సమావేశం ఎలా నిర్వహించాలో వ్యూహ రచన చేశారు.
టీడీపీ పక్ష నాయకుడు లింగం ప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం వాయిదా వేసే వరకు ఆందోళన చేపట్టాలనే ప్రతివ్యూహంతో ముందుకొచ్చారు. సమావేశం తిరిగి ప్రారంభం కాగానే టీడీపీ కౌన్సిలర్లు యథాప్రకారం చైర్మన్ పోడియం ఎదుట ఆందోళనకు దిగారు. టీడీపీ సభ్యులు అల్లర్లు, ఆందోళనలు జరుగుతుండగానే వైస్‌చైర్మన్ అడపా బాబ్జీ, కౌన్సిలర్లు చోరగుడి రవికాంత్, కిలిమి వెంకటరెడ్డి ప్రతిగా ఆందోళనకు దిగారు.
చివరకు సమావేశాన్ని కొనసాగించి ఎజెండాలోని 64 అంశాలకు గానూ61 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. కౌన్సిల్ సభ్యులు గణపతి లక్ష్మణరావు, కాటి విశాలి, వెంపల హైమావతి, అల్లం సూర్యప్రభ, జ్యోతుల సత్యవేణి, వసంతవాడ దుర్గారావు, బొమ్మారెడ్డి ధనలక్ష్మీ, గొర్లశ్రీను, టీడీపీ కౌన్సిలర్లు బొడ్డు శివశ్రీ, అడుసుమిల్లి శ్రీనివాసరావు, పసలాది ఏసుబాబు పాల్గొన్నారు.