సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 10 బీసీ సమాఖ్యల ద్వారా ఆర్థిక సహా యం అందించే పథకం మార్గదర్శకాలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రజక, నాయీ బ్రాహ్మణ, సగర/ఉప్పర, వాల్మీకి/బోయ, వడ్డెర, కృష్ణబలిజ/పూసల, భట్రాజ, మేదర, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి శాలివాహన సహకార సంఘాల సమాఖ్య లిమిటెడ్‌ల ద్వారా ఆయా పథకాల కింద వ్యక్తిగత రుణాలు పొందేందుకు 21-40 ఏళ్ల మధ్యనున్న వయసును 21-55 ఏళ్లకు పెంచింది.
వ్యవసాయ అనుబంధ రంగాల్లో వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచింది. ఈ సమాఖ్యల ద్వారా బృందాలుగా (గ్రూపులుగా) రుణం పొందేవారికి ఎటువంటి నిబంధనలు వర్తించవు. వీరంతా ఆహార భద్రతా కార్డులు/ఆధార్ కార్డులు అప్‌లోడ్ చేసుకోవాలి. ఈ సమాఖ్యల అనుబంధ సొసైటీలకే ఆర్థిక సాయం అందిస్తారు.
ఇవన్నీ సహకార సంఘాల సొసైటీల చట్టం-1964 కింద రిజిస్టర్ చేసుకుని పదిహేను మంది సభ్యులకు మించకుండా ఉండాలి. ఒక్కో సొసైటీకి 7.5 లక్షల రూపాయల చొప్పున (ఒక్కో సభ్యుడికి రూ. 50 వేల చొప్పున 15 మందికి) ఇందులో 50 శాతం సబ్సిడీగా, మిగిలిన 50 శాతాన్ని బ్యాంకు రుణంగా అందజేస్తారు. ఈ మేరకు శుక్రవారం రాష్ర్ట బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్థిక పథకం మార్గదర్శకాల సవరణ
Published Sat, Jan 17 2015 12:58 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM
Advertisement