సుద్దాల అశోక్ తేజకు గురజాడ పురస్కారం
విజయనగరం: మహాకవి గురజాడ అప్పారావు 14వ విశిష్ట పురస్కారాన్ని ప్రముఖ సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ అందుకున్నారు. విజయనగరంలోని గురజాడ కళాభారతిలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆయనకు పురస్కారాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సుద్దాల మాట్లాడుతూ... గురజాడ అప్పారావు విశిష్ట పురస్కారం అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వాడుక భాషకు ప్రాణం పోసిన బ్రహ్మ గురజాడని అభివర్ణించారు. సాంఘిక విప్లవాన్ని తన గుండె లోతుల్లో జీర్ణించుకుని అందుకోసం మహోన్నతమైన దారిని ఏర్పరచిన మహనీయుడు గురజాడ అని కొనియాడారు. ద్వారం వెంకటస్వామినాయుడు, ఆదిభట్ల, ఘంటసాల, సుశీల వంటి ఎందరో మహానుభావులు నడయాడిన ఈ గడ్డలో పాద ధూళిని తాను సింధూరంగా ధరిస్తున్నానని అన్నారు.
ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మాట్లాడూతూ ద్వారం వెంకటస్వామి నాయుడు వయోలిన్‌కు, హరికథకు ఆదిభట్ల నారాయణదాసు, రచనకు గురజాడ చిరునామాగా నిలిచారన్నారు. 125 ఏళ్ల క్రిందట రాసిన కన్యాశుల్కం ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉందంటే ఆయన రచనా శైలి గొప్పదనమని గుర్తుచేశారు. మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ గురజాడ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ఎం.ఎం.నాయక్ మాట్లాడుతూ మహాకవి గురజాడ విజయనగరానికే కాదు భారతదేశానికే కీర్తిని తెచ్చిపెట్టారన్నారు. భూమిపై తెలుగు సాహిత్యం ఉన్నంత కాలం, తెలుగు అక్షరం ఉన్నంతకాలం గురజాడ రచనలు చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
కార్యక్రమానికి ముందుగా అతిథులు గురజాడ చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించారు. సభకు సమాఖ్య అధ్యక్షుడు పివి.నరసింహరాజు అధ్యక్షత వహించారు. గురజాడ మనవడి భార్య గురజాడ సరోజినీదేవి, ఆమె కుమారుడు ప్రసాద్, కోడలు ఇందిరలు, సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ అధిక సంఖ్యలో సాహితీప్రియులు పాల్గొన్నారు.