gurajada award
-
రామజోగయ్యశాస్త్రికి గురజాడ పురస్కారం
సాక్షి, విజయనగరం: సినీ గేయ రచయిత, సాహితీవేత్త రామజోగయ్యశాస్త్రి గురజాడ విశిష్ట పురస్కారానికి ఎంపికయ్యారు. విజయనగరం గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో గురజాడ 104వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 30న సమాఖ్య సభ్యులు పురస్కారం అందజేయనున్నారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు పీవీ నరసింహరాజు, కాపుగంటి ప్రకాష్‌లు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. పురస్కార ప్రదానోత్సవంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, నటుడు, రచయిత తనికెళ్ల భరణి ప్రధాన వక్తగా పాల్గొంటారని చెప్పారు. సాయిఫౌండేషన్ అధ్యక్షుడు, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పురస్కార ప్రదాతగా వ్యవహరిస్తారన్నారు. -
కిరణ్‌కుమార్‌కు గురజాడ పురస్కారం
ఎల్లారెడ్డిపేట: తిమ్మాపూర్ పరిధిలోని బాకూర్‌పల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు చుక్క కిరణ్‌కుమార్ రాష్ట్రస్థాయి గురజాడ తెలుగు కవితా పురస్కారం అందుకున్నారు. గొల్లపల్లి మండలం మల్లన్నపేటకు చెందిన కిరణ్‌కుమార్ సాహిత్యం, చిత్రలేఖనంతోపాటు 10వేల మంది కవులతో ప్రారంభమైన ప్రయూత కవితాయజ్ఞంలో 100కు పైగా పద్యాలు రాసి సహస్త్ర కవిమిత్ర బిరుదును సాధించారు. బాలలకు గుడి.. బాకూర్‌పల్లి బడియే.. అనే శతకంతోపాటు అనేక కవితలు సాహిత్యంతో యూఎస్ఏ ఫౌండేషన్ రాష్ట్రస్థాయి గురజాడ తెలుగు కవితా పురస్కారం 2016కు కిరణ్‌కుమార్‌ను ఎంపిక చేసింది. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురజాడ అమెరికా సంస్థ ఆధ్వర్యంలో అవార్డును అందించారు. భవిష్యత్తులో మరిన్ని కవితలు, పద్యాలు, సాహిత్యం, చిత్రలేఖనంతో కిరణ్‌కుమార్ రాణించాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. -
గురజాడ పురస్కారానికి లక్ష్మయ్య
సిద్దిపేట రూరల్: గురజాడ ఫౌండేషన్ (అమెరికా) ఆధ్వర్యంలో రాష్ట్ట్రస్థాయి తెలుగు పురస్కారం-2016కు చిన్నకోడూరు మండలం గుర్రాలగొంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న తెలుగు ఉపాధ్యాయులు వరుకోలు లక్ష్మయ్య అవార్డుకు ఎంపికయ్యారు. తెలుగు సాహిత్యంలో రచయితగా, పద్యాలు రాయడంలో కవిగా తెలుగు భాషకు విషేశ కృషి గుర్తింపు లభించింది. 2016 జూన్ తెలం‘గానం’లో పద్యాలు వ్రాసి వినిపించినందుకు మామిడి హరికృష్ణ చేతుల మీదుగా సన్మానంతో పాటు శ్రీకాళహస్తిలో జాతీయ తెలుగు సమ్మెళనంలో ఆగస్టులో పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ చేతుల మీదుగా సన్మానం పొందారు. కాగా, గురజాడ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు సంటి అనిల్‌కుమార్ చేతుల మీదుగా ఈ నెల 18న హైదారాబాద్ ప్రెస్‌క్లబ్‌లో అందుకోనున్నారు. -
సుద్దాల అశోక్ తేజకు గురజాడ పురస్కారం
విజయనగరం: మహాకవి గురజాడ అప్పారావు 14వ విశిష్ట పురస్కారాన్ని ప్రముఖ సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ అందుకున్నారు. విజయనగరంలోని గురజాడ కళాభారతిలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆయనకు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుద్దాల మాట్లాడుతూ... గురజాడ అప్పారావు విశిష్ట పురస్కారం అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వాడుక భాషకు ప్రాణం పోసిన బ్రహ్మ గురజాడని అభివర్ణించారు. సాంఘిక విప్లవాన్ని తన గుండె లోతుల్లో జీర్ణించుకుని అందుకోసం మహోన్నతమైన దారిని ఏర్పరచిన మహనీయుడు గురజాడ అని కొనియాడారు. ద్వారం వెంకటస్వామినాయుడు, ఆదిభట్ల, ఘంటసాల, సుశీల వంటి ఎందరో మహానుభావులు నడయాడిన ఈ గడ్డలో పాద ధూళిని తాను సింధూరంగా ధరిస్తున్నానని అన్నారు. ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మాట్లాడూతూ ద్వారం వెంకటస్వామి నాయుడు వయోలిన్‌కు, హరికథకు ఆదిభట్ల నారాయణదాసు, రచనకు గురజాడ చిరునామాగా నిలిచారన్నారు. 125 ఏళ్ల క్రిందట రాసిన కన్యాశుల్కం ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉందంటే ఆయన రచనా శైలి గొప్పదనమని గుర్తుచేశారు. మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ గురజాడ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ఎం.ఎం.నాయక్ మాట్లాడుతూ మహాకవి గురజాడ విజయనగరానికే కాదు భారతదేశానికే కీర్తిని తెచ్చిపెట్టారన్నారు. భూమిపై తెలుగు సాహిత్యం ఉన్నంత కాలం, తెలుగు అక్షరం ఉన్నంతకాలం గురజాడ రచనలు చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముందుగా అతిథులు గురజాడ చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించారు. సభకు సమాఖ్య అధ్యక్షుడు పివి.నరసింహరాజు అధ్యక్షత వహించారు. గురజాడ మనవడి భార్య గురజాడ సరోజినీదేవి, ఆమె కుమారుడు ప్రసాద్, కోడలు ఇందిరలు, సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ అధిక సంఖ్యలో సాహితీప్రియులు పాల్గొన్నారు. -
సుద్దాలకు గురజాడ పురస్కారం
విజయనగరం: ప్రముఖకవి, సినీగేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజకు గురజాడ విశిష్ట పురస్కారాన్ని అందజేయనున్నట్టు గురజాడ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడు పి.వి.నరసింహ రాజు తెలిపారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 30న గురజాడ వర్ధంతిని పురస్కరించుకుని సమాఖ్య ఆధ్వర్యంలో సాహితీ చైతన్యోత్సవాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి కె.ప్రకాశ్ మాట్లాడుతూ 30వ తేదీ ఉదయం గురజాడ స్వగృహంలో గురజాడ చిత్రపటం వద్ద నివాళులర్పించి ఆయన కలం నుంచి జాలువారిన గీతాలను ఆలపిస్తూ, ఆయన వినియోగించిన వస్తువులతో ఊరేగింపుగా గురజాడ గ్రంథాలయానికి చేరుకుంటారన్నారు. అనంతరం గ్రంథాలయంలో గురజాడ సాహితీ సదస్సు జరుగుతుందని తెలిపారు. సాయంత్రం జరిగే కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజకు పురస్కారం అందజేయనున్నట్టు తెలిపారు.