గుసగుస
వచ్చే సాధారణ ఎన్నికల్లో గెలుస్తామని నమ్మకంలేని అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లోని చాలామంది ఎమ్మెల్యేలకు రాజ్యసభ ఎన్నికలు కొంత రిలీఫ్ ఇచ్చాయట. వచ్చే ఎన్నికల్లో పార్టీ భవిష్యత్తు పక్కన పెడితే మనం గెలుస్తామో లేదోనని ఆ పార్టీల్లోని చాలామంది నేతల్లో అనుమానాలున్నాయి. బోలెడంత డబ్బు ఖర్చు పెట్టినా గెలుస్తామని నమ్మకం లేదు. అలాగని డబ్బు ఖర్చు చేయకుండా ఉండలేం. కొంతలో కొంత రాజ్యసభ ఎన్నికలు మాకు కలిసొచ్చాయి... అంటూ ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ లాబీల్లో చెప్పుకుంటూ పోతున్నారు.
మీరు ఎన్నికల్లో నిలబడటానికి రాజ్యసభ ఎన్నికలకు సంబంధమేంటని తొలిసారి శాసనసభకు ఎన్నికైన మరో ఎమ్మెల్యే ప్రశ్నిస్తే... ‘‘నువ్వు ఉత్తి అమాయకుడిలా ఉన్నావ్... రాజ్యసభ ఎన్నికల్లో ఊరికే ఓటు వేస్తామా? ఈసారి రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులు పెద్దఎత్తున ముట్టజెప్పుకోవాల్సిందే. ఇప్పటికే ఆఫర్లు మొదలయ్యాయి. పార్టీ చెప్పింది కదా అని ఓటేస్తే మనకు మిగిలేదేంటి? మనకు వచ్చే ఎన్నికల్లో కొంతలో కొంతైనా ఈ ఎన్నికల్లో రాబట్టుకోవాలి కదా’’ అని హితబోధ చేశారు. ఓహో... మన డిమాండేమిటో చెప్పాలన్నమాట... అని ఆ అమాయక ఎమ్మెల్యే గుసగుసలాడారు. సరిగ్గా అదే సమయానికి రాజ్యసభ ఎన్నికల్లో మిత్రుడి కోసం సంతకాలను సేకరిస్తున్న మరో నేత అక్కడికి చేరుకుని జరిగిన సంభాషణేంటో తెలుసుకుని... ‘‘ఈ ఎన్నికలేంటో ఏమో... మనవాడేమో ‘ఓటుకు వోల్వో’ అంటూ ప్రచారంలో పెట్టి ముందే రేటు పెంచేశారు’’ అని సణుగుతూనే తన మనసులోని మాటొకటి చెప్పారు. మీకు రిలీఫే... పోటీ చేసే వాడి సంగతేంటి!?