gusagusa
-
<b>గుసగుస:</b> సందిగ్ధంలో గల్లా కుటుంబం
రాష్ట్ర విభజన నేపధ్యంలో కాంగ్రెస్‌లో ఉండలేక తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేసిన మాజీ మంత్రి గల్లా అరుణ కుటుంబం ఇపుడు సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన పరిస్థితులలో ప్రస్తుతం కాంగ్రెస్ తరపున పోటీ చేయకుండా ఈసారికి ఎన్నికలకు దూరంగా ఉన్నా బాగుండేదని అనుకుంటున్నారట. తెలుంగుదేశంలో చేరి కోరి కోరి రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకున్నామా! అన్న ఆలోచనలో తల్లీ తనయులు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాన్ని కాంగ్రెస్ - బిజెపిలు అడ్డగోలుగా చీల్చేస్తే గల్లా అరుణ ఏ మాత్రం పట్టించుకోకుండా చివరి నిముషం వరకు శుభ్రంగా మంత్రి పదవిని అనుభవించారన్న విమర్శ ఆమెపై ఉంది. విభజన పాపంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి బిజెపి సహకరిస్తే, రాష్ట్రంలో తెలుగుదేశం సహకరించిన సంగతి అందరికీ తెలిసిందే. విభజన అనంతరం సీమాంధ్రలో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ఆ మాటకొస్తే ఒక్క సీమాంధ్రలోనే కాదు తెలంగాణాలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ లోగా ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలో దిగడం కష్టమని గమనించిన గల్లా అరుణ తన తనయుడు జయదేవ్‌ను రాజకీయాల్లోకి తీసుకు రావాలని అనుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు అవకాశాలు లేకపోవడంతో ఈ నెల 8న తెలుగుదేశంలో చేరారు. తీరా టిడిపిలో చేరాక కానీ గల్లా కుటుంబానికి వాస్తవం బోధపడలేదు. అటు చంద్రగిరి నియోజకర్గంలోనూ ఇటు గుంటూరులోనూ కూడా టిడిపి పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో ఈ ఎన్నికల్లో ఎలా నెగ్గుకు రావడమో గల్లా కుటుంబానికి అర్ధం కావడం లేదట. దానికితోడు గల్లా జయదేవ్ పారిశ్రామిక వేత్త కావడంతో గుంటూరు తమ్ముళ్లు చీటికీ మాటికీ డబ్బులు అడుగుతున్నట్లు సమాచారం. అయితే వ్యాపారి అయిన జయదేవ్ డబ్బు ఇవ్వవలసినచోట ఆ బాధ్యతలను చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన తనకు నమ్మకస్తులైన వారికే అప్పగిస్తున్నారట. దాంతో మరో కొత్త పేచీ వచ్చింది. తమపై నమ్మకం లేదా అని స్థానిక తమ్ముళ్లు లోలోనే మండి పడుతున్నారట. చంద్రగిరిలోనూ స్థానిక టిడిపి శ్రేణులు గల్లా అరుణతో కలిసి రావడం లేదట. ఇలాగే కొనసాగితే రేపు ఎన్నికల్లో ఎలా గెలవడమా అని తల్లీ కొడుకులు తలలు పట్టుకుంటున్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్ దెబ్బతింటే తింది టిడిపిలోకి రాకుండా ఉంటేనే బాగుండేదని గల్లా అరుణ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. జయదేవ్ కూడా తల్లి ఆందోళనతో ఏకీభవిస్తున్నట్లు పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఒక్క గల్లా కుటుంబమే కాదు ఇటీవల టిడిపిలో చేరిన కాంగ్రెస్ నేతల్లో మెజారిటీ నాయకుల మనోవేదన ఇదేవిధంగా ఉన్నట్లు వినికిడి. -
సూరీడుకి కూకట్పల్లి కాంగ్రెస్ టిక్కెట్?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీపీ రామచంద్రరావు మరోసారి తెరవెనుక చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి సూరీడుకు అసెంబ్లీ టిక్కెట్ ఇప్పించేందుకు ఆయన పావులు కదుపుతున్నట్టు ఓ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది. కూకట్పల్లి టిక్కెట్ సూరీడుకు ఇప్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది. కూకట్పల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సూరీడును పోటీకి దించాలని ఆయన భావిస్తున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్‌ను సూరీడు కలిసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. కాగా,తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించడం వెనుక కేవీపీ హస్తముందని తెలిపింది. టీపీసీసీ అధ్యక్ష పదవికి ముందుగా జానారెడ్డి పేరు బలంగా వినిపించింది. అయితే ఆఖరి నిమిషంలో ఆయనకు మొండిచేయి చూపారు. ఊహించనివిధంగా పొన్నాల తెరపైకి వచ్చారు. అయితే పొన్నాల నియామకం వెనుక తన ప్రమేయం ఉన్నట్టు వచ్చిన వార్తలను కేవీపీ ఖండించారు. -
ఉదయభాను పొలిటికల్ ఎంట్రీ?
ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, నటి ఉదయభాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి ఆమె పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టనున్నారని చెబుతున్నారు. అవసరమైనప్పుడు రాజకీయాల్లోకి వస్తానని గతంలో ఆమె చెప్పిన విషయాలను ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. తాను రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయమని భాను భావిస్తున్నారు(ట). తెలుగనాట అగ్రస్థానంలో ఉన్న బుల్లితెర వ్యాఖ్యాతల్లో ఒకరైన ఉదయభానుకు మంచి క్రేజ్ ఉంది. వివాదాల కారణంగా ఆమె పలుమార్లు పతాక శీర్షికలకు ఎక్కారు. ఇప్పుడు ఆమె రాజకీయాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలవడంతో ఆశావహులు తమకు నచ్చిన పార్టీల్లో చేరిపోతున్నారు. రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందు సిద్ధమవుతున్నారు. ఉదయభాను కూడా ఈ కోవలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. పాలిటిక్స్‌లో అడుగుపెట్టేందుకు ఆమె పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు గుసగుసలు విన్పిస్తున్నాయి. త్వరలోనే ఉదయభాను పొలిటికల్ ఎంట్రీ ఖాయమంటున్నారు. ఇదే నిజమయితే ఆమె ఏ పార్టీలో చేరతారన్నది ఆసక్తి కలిగించే విషయం. మరోవైపు ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. సొంత జిల్లా కరీంనగర్ నుంచి పోటీ చేస్తారని కొంతమంది, హైదరాబాద్ నుంచి పోటీ చేస్తారని మరి కొంతమంది అంటున్నారు. అయితే రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా ఉదయభాను విజయం సాధిస్తారని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆమె పొలిటికల్ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
‘రాజ్యసభ’తో రిలీఫే!
గుసగుస వచ్చే సాధారణ ఎన్నికల్లో గెలుస్తామని నమ్మకంలేని అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లోని చాలామంది ఎమ్మెల్యేలకు రాజ్యసభ ఎన్నికలు కొంత రిలీఫ్ ఇచ్చాయట. వచ్చే ఎన్నికల్లో పార్టీ భవిష్యత్తు పక్కన పెడితే మనం గెలుస్తామో లేదోనని ఆ పార్టీల్లోని చాలామంది నేతల్లో అనుమానాలున్నాయి. బోలెడంత డబ్బు ఖర్చు పెట్టినా గెలుస్తామని నమ్మకం లేదు. అలాగని డబ్బు ఖర్చు చేయకుండా ఉండలేం. కొంతలో కొంత రాజ్యసభ ఎన్నికలు మాకు కలిసొచ్చాయి... అంటూ ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ లాబీల్లో చెప్పుకుంటూ పోతున్నారు. మీరు ఎన్నికల్లో నిలబడటానికి రాజ్యసభ ఎన్నికలకు సంబంధమేంటని తొలిసారి శాసనసభకు ఎన్నికైన మరో ఎమ్మెల్యే ప్రశ్నిస్తే... ‘‘నువ్వు ఉత్తి అమాయకుడిలా ఉన్నావ్... రాజ్యసభ ఎన్నికల్లో ఊరికే ఓటు వేస్తామా? ఈసారి రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులు పెద్దఎత్తున ముట్టజెప్పుకోవాల్సిందే. ఇప్పటికే ఆఫర్లు మొదలయ్యాయి. పార్టీ చెప్పింది కదా అని ఓటేస్తే మనకు మిగిలేదేంటి? మనకు వచ్చే ఎన్నికల్లో కొంతలో కొంతైనా ఈ ఎన్నికల్లో రాబట్టుకోవాలి కదా’’ అని హితబోధ చేశారు. ఓహో... మన డిమాండేమిటో చెప్పాలన్నమాట... అని ఆ అమాయక ఎమ్మెల్యే గుసగుసలాడారు. సరిగ్గా అదే సమయానికి రాజ్యసభ ఎన్నికల్లో మిత్రుడి కోసం సంతకాలను సేకరిస్తున్న మరో నేత అక్కడికి చేరుకుని జరిగిన సంభాషణేంటో తెలుసుకుని... ‘‘ఈ ఎన్నికలేంటో ఏమో... మనవాడేమో ‘ఓటుకు వోల్వో’ అంటూ ప్రచారంలో పెట్టి ముందే రేటు పెంచేశారు’’ అని సణుగుతూనే తన మనసులోని మాటొకటి చెప్పారు. మీకు రిలీఫే... పోటీ చేసే వాడి సంగతేంటి!?