<b>గుసగుస:</b> సందిగ్ధంలో గల్లా కుటుంబం
రాష్ట్ర విభజన నేపధ్యంలో కాంగ్రెస్లో ఉండలేక తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేసిన మాజీ మంత్రి గల్లా అరుణ కుటుంబం ఇపుడు సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన పరిస్థితులలో ప్రస్తుతం కాంగ్రెస్ తరపున పోటీ చేయకుండా ఈసారికి ఎన్నికలకు దూరంగా ఉన్నా బాగుండేదని అనుకుంటున్నారట. తెలుంగుదేశంలో చేరి కోరి కోరి రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకున్నామా! అన్న ఆలోచనలో తల్లీ తనయులు ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రాన్ని కాంగ్రెస్ - బిజెపిలు అడ్డగోలుగా చీల్చేస్తే గల్లా అరుణ ఏ మాత్రం పట్టించుకోకుండా చివరి నిముషం వరకు శుభ్రంగా మంత్రి పదవిని అనుభవించారన్న విమర్శ ఆమెపై ఉంది. విభజన పాపంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి బిజెపి సహకరిస్తే, రాష్ట్రంలో తెలుగుదేశం సహకరించిన సంగతి అందరికీ తెలిసిందే. విభజన అనంతరం సీమాంధ్రలో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ఆ మాటకొస్తే ఒక్క సీమాంధ్రలోనే కాదు తెలంగాణాలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ లోగా ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలో దిగడం కష్టమని గమనించిన గల్లా అరుణ తన తనయుడు జయదేవ్ను రాజకీయాల్లోకి తీసుకు రావాలని అనుకున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్లేందుకు అవకాశాలు లేకపోవడంతో ఈ నెల 8న తెలుగుదేశంలో చేరారు. తీరా టిడిపిలో చేరాక కానీ గల్లా కుటుంబానికి వాస్తవం బోధపడలేదు. అటు చంద్రగిరి నియోజకర్గంలోనూ ఇటు గుంటూరులోనూ కూడా టిడిపి పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో ఈ ఎన్నికల్లో ఎలా నెగ్గుకు రావడమో గల్లా కుటుంబానికి అర్ధం కావడం లేదట. దానికితోడు గల్లా జయదేవ్ పారిశ్రామిక వేత్త కావడంతో గుంటూరు తమ్ముళ్లు చీటికీ మాటికీ డబ్బులు అడుగుతున్నట్లు సమాచారం. అయితే వ్యాపారి అయిన జయదేవ్ డబ్బు ఇవ్వవలసినచోట ఆ బాధ్యతలను చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన తనకు నమ్మకస్తులైన వారికే అప్పగిస్తున్నారట. దాంతో మరో కొత్త పేచీ వచ్చింది. తమపై నమ్మకం లేదా అని స్థానిక తమ్ముళ్లు లోలోనే మండి పడుతున్నారట.
చంద్రగిరిలోనూ స్థానిక టిడిపి శ్రేణులు గల్లా అరుణతో కలిసి రావడం లేదట. ఇలాగే కొనసాగితే రేపు ఎన్నికల్లో ఎలా గెలవడమా అని తల్లీ కొడుకులు తలలు పట్టుకుంటున్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్ దెబ్బతింటే తింది టిడిపిలోకి రాకుండా ఉంటేనే బాగుండేదని గల్లా అరుణ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. జయదేవ్ కూడా తల్లి ఆందోళనతో ఏకీభవిస్తున్నట్లు పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఒక్క గల్లా కుటుంబమే కాదు ఇటీవల టిడిపిలో చేరిన కాంగ్రెస్ నేతల్లో మెజారిటీ నాయకుల మనోవేదన ఇదేవిధంగా ఉన్నట్లు వినికిడి.