జ్ఞానేంద్ర రూటే వేరు!
- 28 ఏళ్లకే ఎర్రస్మగ్లర్‌గా మారిన వైనం
- బెంగళూరుబడా స్మగ్లర్లతోనూ సంబంధాలు
- రాజేంద్ర హత్య కేసుతో వెలుగు చూసిన వైనం
పలమనేరు: పలమనేరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన జ్ఞానేంద్ర రూటేవేరు. ఈ యువకుడు ఎర్రచందనం తరలింపులో పెద్ద స్మగ్లర్‌గా అవతారమెత్తిన విషయం తెలిసిందే. రెండ్రోజుల క్రితం రాజేంద్ర హత్య కేసులో జ్ఞానేంద్ర ప్రధాన నిందితునిగా పట్టుబడడంతో అతని నేరచరిత్ర వెలుగులోకొచ్చింది. కృష్ణాపురం గ్రా మంలో ఓ పేద కుటుంబంలో పుట్టిన జ్ఞానేంద్ర చిన్నప్పటి నుంచే నేర ప్రవృతిని అలవరచుకున్నాడు. స్థాని కంగా బుద్ధిమంతుడిలా ఉంటూ బయటి ప్రాంతాల్లో పలు నేరాలకు పాల్పడేవాడు.
కేవలం 28 ఏళ్ల వయసుకే కర్ణాటకకు చెందిన బడా స్మగ్లర్లతో చేరి ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కీలకంగా ఎదిగాడు. తన గ్రామానికే చెందిన రాజేంద్రతో పాటు మండలంలోని పలు అటవీ ప్రాంత గ్రామాల యువకులను టార్గెట్‌గా చేసి ఎర్రచందనం అక్రమ రవాణా ఊబిలోకి దింపాడు. చిన్నగొట్టిగల్లు వెంకట్రమణ, తిరుపతికి చెందిన హరి, పాపానాయుడుపేటకు చెందిన రవితో కలిసి ఎర్రచందనం అక్రమ రవాణా చేసేవాడు. వీరి మధ్య తగాదా ఏర్పడి గతేడాది పూడి రైల్వేస్టేషన్ వద్ద రాజేంద్రను హతమార్చిన విషయం పోలీసుల విచారణలో వెలుగుచూసింది.
ఎక్కడికెళితే అక్కడో గ్యాంగ్..
ఇతనిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించడంతో కొన్నాళ్లు అజ్ఞాతంలో కెళ్లాడు. బెరైడ్డిపల్లె మండలంలోని పాతపేటలో ఉంటూ అక్కడ అనిల్, నగేష్, బాలచంద్ర, రాజేష్, దినేష్‌తో మరో గ్యాంగ్ రెడీ చేసుకున్నాడు. వీరంతా ఎర్రచందనం కర్ణాటకకు తరలించేవారు. దారి దోపిడీలు, దొంగతనాలకు పాల్పడేవారు. ప్రస్తుతం జ్ఞానేంద్రను పుత్తూరు సబ్‌జైలులో ఉంచారు. వారానికి రెండు లోడ్ల ఎర్రచందనాన్ని సరిహద్దులు దాటించే వాడని పోలీసుల విచారణలో తేలింది. కర్ణాటకలోనూ జ్ఞానేంద్ర గ్యాంగ్‌పై పలు కేసులు ఉన్నాయి.