ఎఫ్‌సీకి ముందుకు రాని విద్యాసంస్థలు
మొత్తం 1,251స్కూల్ బస్సుల్లో ఫిట్ 682
బస్సుల ఫిట్‌నెస్‌పై తల్లిదండ్రులు నిలదీయాలి
నామమాత్రంగా అధికారుల తనిఖీలు
నెల్లూరు (టౌన్) : విద్యాసంస్థలు ప్రారంభించి రెండు రోజులు కావస్తున్నా విద్యార్థులను తీసుకెళ్లుతున్న బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ విషయంలో పాఠశాలల యాజమాన్యాలు మీనమీషాలు లెక్కిస్తున్నాయి. పాఠశాలల ప్రారంభమయ్యే నాటికి ఎఫ్‌సీలు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాల్సిన బస్సులు పార్కింగ్‌కే పరిమితమయ్యాయి. అయితే కొన్ని బస్సులను ఫిట్‌నెస్ లేకుండానే విద్యార్థులను పాఠశాలలకు తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యాసంస్థలు ఎఫ్‌సీ చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. జిల్లావ్యాప్తంగా 1,251 బస్సులు ఉండగా కేవలం 682 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందారు. స్కూల్ బస్సుల నిబంధనల ఉల్లంఘనపై పోలీసు, రవాణా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా మిన్నకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠశాలల ప్రారంభించిన సోమవారం జిల్లావ్యాప్తంగా కేవలం 2 బస్సులపైన మాత్రమే కేసులు నమోదు చేశారు.
స్పందించని యాజమాన్యాలు..
32 నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందేనంటూ రవాణా అధికారులు చెప్పడంతో బస్సులను ఎఫ్‌సీ చేయించుకునేందుకు స్కూళ్ల యజమానులు జంకుతున్నారు. కొంతకాలం గడిస్తే నిబంధనలను పట్టించుకోరని, ఆ సమయంలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను పొందవచ్చన్న ఆలోచనల్లో విద్యాసంస్థల యజమానులు ఉన్నట్లు తెలిసింది.
తల్లిదండ్రులదే బాధ్యత
స్కూలు బస్సుల ఫిట్‌నెస్‌పై తల్లిదండ్రులు జాగ్ర త్త పడాల్సిన అవసరముంది. పిల్లలను ఎక్కించుకునేందుకు ఇళ్ల దగ్గరకు వచ్చిన సమయంలో బస్సు నిబంధనలను పాటిస్తున్నా రా, లేదాన్న విషయాన్ని పరిశీలించాలి. అప్పుడే డ్రైవర్‌తో పాటు యాజమాన్యాలు జాగ్రత్తగా ఉంటారు.
నామమాత్రంగా తనిఖీలు...
స్కూలు బస్సులపై నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా గ్రామీణ, మున్సిపాల్టీల ప్రాంతాల్లో ఫిట్‌నెస్ లేని బస్సులు ఎక్కువగా తిరుగుతున్నాయని సమాచారం. ఈ విషయంపై ఉపరవాణా కమిషనర్ శివరాంప్రసాద్‌కు ఫోన్ చేయగా జిల్లావ్యాప్తంగా స్కూలు బస్సులపై ప్రత్యేక తనిఖీ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫిట్‌నెస్ ఉన్న బస్సులు మాత్రమే తిరుగుతున్నాయని తెలిపారు.
సగం బస్సులే ఫిట్
Published Wed, Jun 17 2015 11:13 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM
Advertisement