హంస’కు 15 రోజుల రిమాండ్
నెల్లూరు రూరల్ : శ్రీవేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూముల్లో టేకుచెట్ల నరికివేత, గ్రావెల్ అక్రమ తరలింపు కేసుల్లో ప్రధాన నిందితుడు వేమిరెడ్డి హంసకుమార్‌రెడ్డి జైలుకు వెళ్లకుండా ఓ మాజీమంత్రి నడిపిన హైడ్రామాకు తెరపడింది. నాలుగు కేసుల్లో కీలక నిందితుడుగా ఉన్న హంసకుమార్‌రెడ్డి కోసం రూరల్ పోలీసులు విసృ్తతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే అధికార పార్టీ అండదండలతో టేకుచెట్ల నరికివేత, కాల్‌మనీలో మహిళ వేధింపు కేసు, టిప్పర్ల కేసులో ముందస్తు బెయిల్ పొందారు. మిగిలిన అక్రమ గ్రావెల్ కేసులో అరెస్ట్ చేయకపోతే పోలీసుల పరువు పోతుందని భావించిన ఎస్సీ ఆధ్వర్యంలో నెల్లూరురూరల్ పోలీసు లు హంసకుమార్‌రెడ్డి కోసం గాలింపు వేగవంతం చేశారు.
హైదరాబాద్‌లో సమీప బంధువు ఇంట్లో తలదాచుకున్న హంసకుమార్‌రెడ్డిని శుక్రవారం రూరల్ సీఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకుని నెల్లూరుకు తరలించారు. ఎలాగైనా హంసకుమార్‌రెడ్డిని జైలుకు వెళ్లకుండా కాపాడుకోవాలని మాజీ మంత్రి విశ్వప్రయత్నం చేశాడు. హంసకుమార్‌రెడ్డిని విలేకర్ల సమావేశంలో ప్రవేశపెట్టకుండా జిల్లా మంత్రి సహకారంతో పోలీసులపై ఒత్తిడి చేయించారు. పోలీసులు లీగల్ సమస్యలు ఉన్నాయంటూ వేమిరెడ్డిని హడావుడిగా వైద్యపరీక్షల నిమిత్తం జిల్లా ప్రధాన వైద్యశాలకు తరలించారు.
అక్కడ కూడా ప్రభుత్వ వైద్యులను అధికారంతో బెదిరించి ఆరోగ్యంగా నడిచి వచ్చిన హంసకుమార్‌రెడ్డిని ఐసీయూలో చేర్పించారు. సుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని, బీపీ కూడా అధికంగా ఉందని మెడికల్ రిపోర్టు తీసుకెళ్లి కోర్టులో జడ్జి ఎదుట పోలీసులు హాజరు పర్చారు. పూర్తి మెడికల్ రిపోర్టుతో కోర్టులో హాజరు పరచాలని కోర్టు ఆదేశించడంతో శుక్రవారం తిరిగి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, మిగతా కేసుల్లో పొందినట్లుగా ముందస్తు బెయిల్ పొంది దర్జాగా బయటకు తీసుకురావాలని మాజీ మంత్రి విశ్వప్రయత్నం చేశారు. శనివారం కోర్టుకు హాజరు పరిచిన హంసకుమార్‌రెడ్డికి 15 రోజుల రిమాండ్ విధించారు. దీంతో 60 రోజుల హైడ్రామాకు తెరపడింది.