ముత్యాల్లాంటి అక్షరాలు... మూల్యాంకనం చేసేవారిని ఆకర్షిస్తాయి. అధిక మార్కులు వేసేలా ప్రేరేపిస్తాయి. ప్రతీ విద్యార్థి చేతిరాతను మార్చుకోవాలి... భవిష్యత్‌ను బాగుచేసుకోవాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. అందంగా.. అర్థమయ్యేలా.. సరైన జవాబులు రాస్తే పదో తరగతిలో పదికిపది పాయింట్లు సాధన సులభమని చెబుతున్నారు. చేతిరాతతో జీవితాన్ని మార్చుకోవాలని బోధిస్తున్నారు.
విజయనగరం, గరుగుబిల్లి: పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. విద్యార్థుల ధ్యాసంతా చదువుపైనే. చేతిరాతపై దృష్టిపెట్టేవారు కొంతమంది మాత్రమే. పరీక్షలలో సమాధానాలు ఉన్నది ఉన్నట్లు రాసినా.... దస్తూరితో ఎంత బాగా రాశామన్నదే ముఖ్యం. ఏమి రాసామన్నది పేపర్ మూల్యాంకనం చేసే ఉపాధ్యాయుడుకి అర్ధమైతే ఎక్కువ మార్కులు వేసేందుకు అవకాశం ఉంటుందన్నది విద్యావేత్తల భావన.
దస్తూరికి ప్రాధ్యానం..
చాలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు దస్తూరీపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేక సాధన చేయిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉదయం, సాయంత్రం సమయాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఏడాదిపాటు నేర్చుకున్న అంశాలను రెండున్నర గంటలలో కాగితంపై స్పష్టంగా... ఎలాంటి కొట్టివేతలు చేయకుండా ముత్యాలాంటి అక్షరాలతో 150 నిమిషాలలో 50 మార్కులకు జవాబులు రాసేలా తీర్చిదిద్దుతున్నారు.
సాధనతో ఫలితం...
ఇప్పటివరకు సరిగా రాయకపోయినా ఒక్కసారిగా రాత మార్చుకోవాలంటే నిత్యం సాధన చేయాల్సిందే. తొమ్మిదో తరగతి వరకు దస్తూరి ఎలావున్నా పదో తరగతి ప్రారంభం నుంచి దృష్టిసారిస్తే మంచి ఫలితం ఉంటుంది. నిత్యం నాలుగైదు పేజీలు రాయాల్సి ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. తెలుగుతో పాటు ఆంగ్లం, హిందీ, సబ్జెక్టులపై ఇదే విధానం అమలు చేయాలి. సబ్జెక్టులు చదువుతూ రాయడం వల్ల జవాబులు బాగా గుర్తుండడంతో పాటు అక్షరాలు అందంగా రాయడం అలవాటు అవుతుంది.
ఇవి పాటించాలి...
♦ సమాధాన పత్రంలో రాసే జవాబులు సూటిగా, అక్షరాలు పొందికగా ఉంటే పేపరు దిద్దేవారు పూర్తిస్థాయి మార్కులు వేసే అవకాశం ఉంటుంది.
♦ పేజీ పైభాగంలో ఒక అంగుళం, ఎడమవైపు అదే స్థాయిలో మార్జిన్ విడిచి పెట్టాలి.
♦ సామాన్య, భౌతిక శాస్త్రాలలో బొమ్మలు గీసి భాగాలు గుర్తించే విషయంలో పెన్నును ఒత్తిపెట్టి రాయకూడదు. ఇలా చేస్తే పేపరు వెనుక భాగం పాడవుతుంది.
♦ పేజీలలో వాక్యాలు పై నుంచి కిందకు లేదా పైకి ఉండకుండా వరుసలో ఉండాలి.
♦ పేజీకి పదహారు నుంచి ఇరవై లైన్లు మించి రాయకూడదు.
♦ రోజు కొద్దిసేపు సాధన చేస్తే పరీక్షలలో ఆందోళన లేకుండా సాఫీగా రాయవచ్చు.
♦ పెన్ను సక్రమంగా పట్టుకొని రాస్తే, రాసే అక్షరాలు మనకు కనిపించడంతో పాటు గుండ్రంగా ఉంటాయి.
♦ జవాబు రాసేటప్పుడు అట్టపైకి వాలిపోకుండా సాధ్యమైనంత వరకు కూర్చుని రాయడం మంచిది.
♦ అక్షరాలు, పదాలు వాక్యాలు మధ్య తగినంత ఖాళీ ఉంచాలి.
అందమైన చేతిరాతతో అధిక మార్కులు
ముత్యాల్యాంటి అక్షరాలతో మార్కులకు ఢోకా ఉండదు. చేతిరాత మెరుగు పరిచేందుకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. సమాధానాలు దిద్దేందుకు మూల్యాంకనదారులు ఇబ్బందులు పడేలా దస్తూరీ ఉంటే మార్కులు పడవు. తక్కువ రాసినా తప్పులు లేకుండా అందంగా రాయడంవల్ల ఆకట్టుకొని మార్కులు సాధించవచ్చు. – ఎస్.చంద్రశేఖరరావు,హెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్, నాగూరు
చేతిరాతకు ప్రాధాన్యమివ్వాలి
శాస్త్ర సాంకేతిక రంగం ఎంత ఎదిగినా చేతిరాతకు ప్రాధాన్యం పెరుగుతూనే ఉంటుంది. సంబంధిత భాషపై పట్టు ఉంటే రాయడం తేలికవుతుంది. దస్తూరి బాగున్న విద్యార్థులకు అదనపు మార్కులు పొందే అవకాశం ఉంటుంది. అన్నీ పాఠశాలలో ఈ విధానం ద్వారానే విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నాం.– ఎన్.నాగభూషణరావు,ఎంఈఓ, గరుగుబిల్లి
Comments
Please login to add a commentAdd a comment