పేరు ఎస్‌బీ సుబ్బారావు. వయసు 37ఏళ్లు. 90శాతం వికలత్వం ఉంది. మైదుకూరులోని నంద్యాల రోడ్డులో నివసిస్తున్నారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. డిగ్రీ వరకు చదివారు. ఆర్థికంగా ఎదగడానికి పేదరికం, వైకల్యం అడ్డుగోడగా నిలిచింది. అయినా నిరుత్సాహ పడలేదు. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తున్నారు. జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖలో మూడు చక్రాల మోటార్ వాహనానికి దరఖాస్తు చేశారు. ఇంతవరకు మంజూరు కాలేదు. కార్యాలయం చుట్టూ అధికారులు తిప్పుకుంటున్నారు. ఈ వాహనం వస్తే తిరగడానికి అవకాశం ఉంటుందని, ప్రభుత్వం మాత్రం స్పందిం చడం లేదని సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఒక్క సుబ్బారావు వ్యథ మాత్రమే కాదు.. జిల్లా వ్యాప్తంగా 226 మంది దివ్యాంగుల సమస్య. వీరి గురించి పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు..
సాక్షి, కడప : అన్నీ సక్రమంగా ఉండి అగచాట్లు పడేవారు కొందరైతే... అవయవ లోపంతో పుట్టిన వారు మరికొందరు. వారికి అందించే ప్రతిఫ లాల విషయంలోనూ ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టం గా కనబడుతోంది. దివ్యాంగులన్న దయ కూడా లేకుండా నెలల తరబడి తిప్పుకుంటుండడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ముందుకు వెళుతుందేతప్ప ఆచరణలో అంతా అయోమయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతా ఆన్‌లైన్ అంటూ ఇప్పటికే దరఖాస్తులుకూడా స్వీకరించి నెలలు గడుస్తున్నా..వాహనాలు అందించడంలో మాత్రం తాత్సారం జరుగుతోంది. ఎప్పుడిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
దరఖాస్తులకు తొమ్మిది నెలలు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయిన తర్వాత మేలుకుంది. ఇటీవల దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు స్కూటీ తరహాలో అందించాలని నిర్ణయించింది, 2017 సెప్టెంబరులో దరఖాస్తుల స్వీకరణకు అవకాశం వచ్చింది. అందుకు సంబంధించి సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 16 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దరఖాస్తులు స్వీకరించారు. మూడు చక్రాల వాహనాలకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణులై 40 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి. స్వయం ఉపాధి పొందుతుండాలని నిబంధనలు పెట్టింది. అన్ని అర్హతలు ఉన్న వారు నెల రోజుల వ్యవధిలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే దాదాపు తొమ్మిదినెలలు అవుతున్నా ఇంతవరకు అతీగతీ లేదు.జిల్లాలో దాదాపు 226 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాకు 60 మంజూరైనట్లు తెలుస్తున్నా వాటిని అందించేందుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు.
కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు
మూడు చక్రాల వాహనాల కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు సంక్షేమ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 2017–19కు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారు కలెక్టరేట్‌లోని కార్యాలయానికి వచ్చి ప్రతిరోజు అగుతూనే ఉన్నారు. అంతేకాకుండా 2018–19 ఆర్థిక సంవత్సరం కూడా ప్రారంభమైన నేపథ్యంలో మళ్లీ ఈ ఏడాదికి సంబంధించి కూడా మూడు చక్రాల వాహనాల మంజూరు ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది.
కొంతమందికే అవకాశం
జిల్లాలో దివ్యాంగులకు సంబంధించి కేవలం 60 వాహనాలు మాత్రమే మంజూరు కావడంతో ఎవరికి వస్తుందో..ఎవరికి రాదో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులన్నీ అధికారులు ఇక్కడి నుంచి ఉన్నతాధికారులకు పంపించారు. క్రమపద్ధతినే ఇస్తారో.. లేక ఇతర ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం నుంచిఆదేశాలు రాగానే అందజేస్తాం!
జిల్లాలోని దివ్యాంగుల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే మూడుచక్రాల వాహనాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటాం. కానీ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. త్వరలో వస్తే అందుకు అనుగుణంగా పంపిణీకి చర్యలు చేపడతాం.
– వాణి, అసిస్టెంట్ డైరెక్టర్, వికలాంగుల సంక్షేమశాఖ, కడప.
Comments
Please login to add a commentAdd a comment