జగన్‌ ప్రకటనపై హర్షం | Happiness on jagan statement Pension policy | Sakshi
Sakshi News home page

జగన్‌ ప్రకటనపై హర్షం

Published Tue, Nov 7 2017 5:25 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

Happiness on jagan statement Pension policy - Sakshi

తాము అధికారంలోకి వస్తే నూతన పెన్షన్‌ విధానం (సీపీఎస్‌) రద్దు చేస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం చేసిన ప్రకటనను ఉద్యోగ సంఘాలు స్వాగతిస్తున్నాయి. సీపీఎస్‌ విధానం వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ఆందోళనబాట పట్టాయి. సీపీఎస్‌ అమలు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకే అప్పగించినా పాలకులు మాత్రం సీపీఎస్‌ రద్దు అంశాన్ని, ఉద్యోగులు ఆందోళనలను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో ప్రతిపక్షనేత హామీ ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
–అనంతపురం అర్బన్‌

సీపీఎస్‌ రద్దు కోసం ఉద్యోగులు ఇప్పటికే ఆందోళన బాట పట్టారు. అధికారంలోకి వస్తే ఈ విధానం రద్దు చేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం హర్షణీయం. మాకు పార్టీలతో సంబంధం లేదు. అధికారంలో
ఎవరున్నా ఉద్యోగుల సంక్షేమం చూడాలి.

 – శీలా జయరామప్ప, జిల్లా చైర్మన్, ఏపీ జేఏసీ అమరావతి 

జగన్‌ను అభినందిస్తున్నాం
కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేస్తామని జగన్‌ ప్రకటించారు. ఆయన్ను ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ అభినందిస్తున్నాయి. సీపీఎస్‌ రద్దు చేస్తే రాష్ట్రంలోని 1.84 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరుతుంది. పెన్షన్‌ అనేది ఉద్యోగుల హక్కు. చంద్రబాబు పెట్టే బిక్ష కాదు.
–ఆత్మారెడ్డి, ఏపీ ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర నాయకుడు

చంద్రబాబుకు చెంపపెట్టు
జగన్‌ ప్రకటన ముఖ్యమంత్రి చంద్రబాబుకు చంపపెట్టు. సీపీఎస్‌ రద్దు కోసం ఉద్యోగులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేశారు. కానీ సీఎం తన పరిధిలోని అంశం కాదంటూ తప్పించుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకుడు బాధ్యతగా స్పందించడం ఆనందంగా ఉంది.                   
–జంషీద్, ఉపాధ్యాయుడు, కదిరి

మంచి నిర్ణయం
సీపీఎస్‌ రద్దు ప్రకటన మంచి నిర్ణయం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమిస్తున్న తరుణంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటన కొండంత ఊరటనిచ్చింది. ఆయన చెబితే చేస్తాడన్న నమ్మకం కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఉంది.
–గంగాధర్‌రెడ్డి, ఎస్టీయూ జిల్లా నాయకుడు

సాహసోపేతమైన నిర్ణయం
ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనది. ప్రస్తుతం ఉద్యోగులు చేస్తున్న ఉద్యమానికి ఇది మద్దతుగా నిలుస్తుంది. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు దీన్ని స్వాగతిస్తున్నాయి.
–రామానుజన్, ఉపాధ్యాయుడు, ఆర్‌ఎంసీహెచ్‌ పాఠశాల

హర్షణీయం
అధికారంలోకి వస్తే సీపీఎస్‌ విధానం రద్దు చేస్తామన్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటన హర్షణీయం. సీపీఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగులు కొద్ది నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ విధానం రద్దు చేస్తే ఉద్యోగులకు మేలు జరుగుతుంది.
– ఎం.రాజారమేశ్‌ నాయక్‌

సంతోషదాయకం
వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే సీపీఎస్‌ రద్దు చేస్తామని ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటన చేయడం సంతోషదాయకం. సీపీఎస్‌ విధానం వల్ల 2004, సెప్టెంబరు 1 తర్వాత ఉద్యోగంలో చేరిన వారు తీవ్రంగా నష్టపోతారు. అందువల్లే సీపీఎస్‌ రద్దు చేయాలని అన్ని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
– ఫరూక్, జిల్లా కార్యదర్శి,  ట్రెజరీ ఉద్యోగుల సంఘం

రద్దు ప్రకటన హర్షణీయం
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామన్న ప్రకటనను స్వాగతిస్తున్నాం. ఇది ఒక గొప్ప నిర్ణయం. సీపీఎస్‌ విధానం ద్వారా ఉపాధ్యాయులు ఆర్థిక భరోసాను కోల్పోతారు. అటువంటిది ఎన్నో కుటుంబాలకు జీవిత భద్రత కల్పించేలా నిర్ణయం తీసుకోవడం హర్షణీయం.
– డి.రవీంద్రనాథ్, ఏపీ టీపీఎస్‌ఈ సభ్యులు

ఉద్యోగుల ఆశలు చిగురించాయి
జగన్‌ మోహన్‌రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రలో సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటన చేయడం ద్వారా ఉద్యోగుల ఆశలు చిగురించాయి. ఉద్యోగులకు ఇదో తీపి కబురు. దీనికి అన్ని సంఘాలు తమ పూర్తి మద్దతును ప్రకటించాలి.
– ప్రభాకర్,  టీచర్, ఝాన్సీలక్ష్మీబాయి పాఠశాల

నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. జగన్‌కు ఉద్యోగ సంఘాల తరుఫున కృతజ్ఞతలు. ప్రజల సమస్యలపై పోరాడుతున్న ఆయన తీరు అందరిని ఆకర్షిస్తుంది.
– ఫణిభూషణ్, ఎస్‌టీయూ నగర శాఖ నాయకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement