సీఎంకు వత్తాసు పలకడమేమిటి?
మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్: తెలంగాణను దోచుకుని ముఖ్యమంత్రి తన సొంత జిల్లా చిత్తూరుకు తాగునీటి కోసం రూ.ఏడువేల కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఈ విషయాన్ని తెలంగాణ మంత్రులు ప్రశ్నంచకుండా ఆయన వత్తాసు పలుకడమేమిటని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు ప్రశ్నించారు. ఈ నిధుల మంజూరుకు క్యాబినెట్ ఆమోదం పొందకుండా చూడాలన్నారు. మహబూబ్‌నగర్‌లో సోమవారం జరిగిన పాలమూరు విద్యార్థి గర్జన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఈ విషయమై హైకోర్టులో కేసు వేశానన్నారు. దీంతో సీఎం హడావిడిగా నిధుల దోపిడీకి ఆమోదం తెలి పేందుకే మంగళవారం మంత్రివర్గ సమావేశం పెట్టారని ఆరోపించారు.
నిధుల దోపిడీని అడ్డుకోవాలని, డిసెంట్‌నోట్ రాయాలని తెలంగాణ మంత్రులకు సూచించారు. మంత్రివర్గంలో నిధుల కేటాయింపునకు తెలంగాణ మంత్రులు ఎవరెవరు ఆమోదం తెలుపుతారో సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకుని ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు. తెలంగాణను అన్ని విధాలుగా అడ్డుకుంటున్న ముఖ్యమంత్రి కుర్చీని ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. ఈ విషయంపై అదే చిత్తూరు జిల్లాకు చెందిన ప్రతిపక్షనేత చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. సమన్యాయం అంటే వేల కోట్లు ఒక్క జిల్లాకు కట్టిపెట్టడమేనా? అని ప్రశ్నించారు. నీది చిత్తూరే, నాదీ చిత్తూరే అన్నట్లు సీఎం, బాబుల వ్యవహరం ఉందని విమర్శించారు.