సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోతున్నప్పుడు అవతరణ వేడుకలు ఎందుకని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉప నేత టి.హరీష్‌రావు ప్రశ్నించారు. నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ సందర్భంగా రూ. 45 కోట్ల ఖర్చుతో ప్రకటనలు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై ఆయన మండిపడ్డారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రావతరణ వేడుకలకు రూ.25 కోట్లతో పత్రికలకు ప్రకటనలు, రూ. ఐదు కోట్లతో టీవీ ప్రకటనలకు తోడు మరో రూ.15 కోట్లతో వివిధ ప్రాంతాల్లో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భావిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు.
జిల్లాలు, వివిధ శాఖల ప్రకటనల ఖర్చులు కలిపితే ఈ మొత్తం దాదాపు రూ. వంద కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు. రాష్ట్రావతరణ వేడుకల పేర ఖర్చు చేసే నిధులతో వరద కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సూచించారు. కిరణ్ సీఎం అయ్యాక ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చారు.. వాటిని నిబంధనల ప్రకారమే జారీ చేశారా అన్న దానిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యం, పత్తి పంటను ప్రభుత్వమే పారసరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేయాలని, పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.పదివేల సాయం అందజేయాలన్నారు. తుపానులు, వరదలు, కరువు వచ్చినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఒకలా.. తెలంగాణ ప్రాంతంలో మరోలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ఆరోపించారు.