ప్రజల ఆకాంక్షను ఢిల్లీకి చాటిన ఉద్యమగడ్డ
సిద్దిపేటను బంగారు తునక చేస్తా
తెల్ల జెండా ఊపిన కిరణ్
నాడు హేళన చేశారు.. ఇప్పుడేమంటారు
విజయోత్సవ సభలో హరీష్‌రావు
సిద్దిపేట జోన్/సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్:
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను ఢిల్లీకి చాటిన ఘనత సిద్దిపేటదని ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. కోట్ల రూపాయలు వెచ్చించి తెలంగాణ గుండెను పిసకడానికి ప్రయత్నించిన చంద్రబాబునాయుడి చెంప చెళ్లుమనిపించింది కూడా సిద్దిపేటేనని ఆయన అన్నారు. స్థానిక పాత బస్టాండ్ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది ఈ ఉద్యమ గడ్డేనన్నారు. మొదట్లో ఇక్కడ ఉద్యమాన్ని కేసీఆర్ ప్రారంభించినప్పుడు ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారని ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. కేసీఆర్ టీడీపీ, శాసన సభ్యత్వానికి, ఉప సభాపతి పదవికి రాజీనామా చేసి ఉద్యమాన్ని పరుగులు పెట్టిస్తే కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌కు, శాసన సభ్యత్వానికి, సీఎం పదవికి రాజీనామా చేసి తెల్లజెండా ఊపేశాడన్నారు.
మిలియన్ మార్చ్, సాగరహారం మొదలగు ఆందోళనలో ఉద్యమకారులు చూపెట్టిన పౌరుషం ఉద్యమానికి ఊపిరిపోసిందన్నారు. ఉద్యోగ గర్జన, ఉప ఎన్నికలతో సిద్దిపేట సత్తాచాటిందన్నారు. కిరణ్ ఒక్క పైసా ఇవ్వనని ప్రకటించినా ఈ ప్రాంత అభివృద్ధికి ఎన్నో నిధులను తీసుకొచ్చానన్నారు. సిద్దిపేటను జిల్లాగా ఏర్పాటు చేస్తామని, రైలు మార్గాన్ని ఏర్పాటు చేయిస్తామని, ప్రభుత్వ మెడికల్ కళాశాలను, యూనివర్సిటీని స్థాపిస్తామని చెప్పారు. సాగు, తాగునీళ్లతో పాటు వ్యవసాయ, పారిశ్రామిక, ఉపాధి రంగాల్లో అనూహ్యమార్పులను తీసుకొచ్చి సిద్దిపేటను బంగారు తునకగా మారుస్తానన్నారు.
దీక్ష లు చారిత్రాత్మకం..
పండుగనక, ఎండా, వాన అనక 1500 రోజుల పాటు సిద్దిపేట, పాలమాకులలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్షలు జరగడం చారిత్రాత్మకమన్నారు. లక్షమంది మహిళలు దీక్షలో పాల్గొని ఉద్యమానికి స్ఫూర్తి నింపారని కొనియాడారు. పల్లె నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని తీసుకెళ్లిన కేసీఆర్, ఉద్యమం కోసం ప్రిన్సిపాల్ పదవిని వదులుకున్న నందిని సిధారెడ్డి, మాట, పాటలతో చైతన్యం తెచ్చిన దేశపతి శ్రీనివాస్, ధూంధాంలతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన రసమయి బాలకిషన్, సమైక్య సభలో ప్రాణాలకు తెగించి నినాదాలు చేసిన పోలీసు కానిస్టేబుల్స్ శ్రీనివాస్‌గౌడ్, శ్రీశైలంలు సిద్దిపేట బిడ్డలు కావడం అదృష్టమన్నారు. మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర పోరాటం తర్వాత అంతటి విజయాన్ని సాధించిన ఘనత తెలంగాణ ఉద్యమానిదన్నారు. ప్రజలకు, నేతలకు సోయి తెప్పించిన గొప్పతనం కేసీఆర్‌ది అన్నారు. పునర్నిర్మాణంలో కూడా కేసీఆర్ ప్రధాన పాత్ర పోషిస్తారన్నారు. నందిని సిధారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, హరీష్‌రావు వ్యూహాల అమలు ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించిందని ప్రశంసించారు. జేఏసీ తూర్పు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పాపయ్య, జేఏసీ నేతలు వంగ గాలిరెడ్డి, మారెడ్డి హన్మంతరెడ్డి తదితరులు ప్రసంగించారు.
బాబు చెంప చెళ్లుమనిపించిన పోరు బిడ్డలు
Published Tue, Feb 25 2014 11:58 PM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement
Advertisement