mla harish rao
-
ఖమ్మం పత్తి మార్కెట్ లో పత్తి రైతులతో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ
-
సారొస్తున్నారు..
సాక్షి, సిద్దిపేట: సీఎం కేసీఆర్ తన స్వగ్రామమైన చింతమడకకు ఈ నెలలో రానున్నారని గ్రామస్తులు ఐక్యమత్యంతో, క్రమశిక్షణతో ఊరు గౌరవాన్ని కాపాడేలా సీఎం సారుకు స్వాగతం పలకాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. శుక్రవారం సాయంత్రం చింతమడకలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌తో కలిసి రెండు గంటల పాటు సమీక్షించారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూంలు సభాస్థలి, వన భోజనాల నిర్ధేశిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ సభా సమావేశంలో హాజరయ్యే చింతమడక గ్రామస్తులకు ప్రత్యేకించి ఐడెంటీ కార్డులను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇటీవల గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వే చేసిన అధికారులు మీఇంటికి వచ్చి ఐడెంటిటీ కార్డులను అందజేస్తారని వివరించారు. గ్రామస్తులంతా ఐక్యమత్యంతో మెదిలి మన ఊరు, మన గౌరవాన్ని కాపాడేలా వ్యవహారించాలని కోరుతూ ఏదైనా విన్నపాన్ని చేయాలంటే కుల సంఘాలు, మహిళా సంఘాల వారిగా విన్నవించాలని సూచించారు. అంతకుముందు ప్రభుత్వ పాఠశాలను సందర్శించి సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం సభా సమావేశం జరిగే స్థలాన్ని పరిశీలించారు. ఐకేపీ గోదాం, సీసీ ప్లాట్‌ఫాం వద్ద సభ, సమావేశం జరిగేలా దాదాపు 3200ల మంది గ్రామస్తులను అనుమతించే విధంగా కుర్చీలను ఏర్పాటు చేయాలన్నారు. అధికారిక యంత్రాంగానికి గ్యాలరీలో 200, మరో రెండు వందల కుర్చీలతో ప్రెస్ గ్యాలరీని ఏర్పాటు చేసి 3600ల మందితో రెయిన్ ప్రూఫ్ సభావేదిక పనులను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. పలుచోట్లు అవసరమైన మార్పులు, చేర్పుల గురించి అక్కడికక్కడే అధికారులకు, నిర్వాహకులకు దిశానిర్ధేశం చేశారు. గ్రామంలో నిర్వహించనున్న సభ, సమావేశ, భోజన సదుపాయాలను, భారీ పోలీసు భద్రత చర్యలతో పాటు అవసరమైన ఏర్పాట్లన్నీ పకడ్బందీగా ఉండాలని నిర్వాహకులకు సూచించారు. ఆ తర్వాత పెద్దమ్మ దేవాలయ ప్రాంగణంలో వనభోజనాలు ఏర్పాట్లపై స్థల పరిశీలన చేస్తూ, అలయం పక్కనే ఉన్న చింత చెట్టు కింద సీఎం కేసీఆర్ సహఫంక్తి భోజనం చేసే ఏర్పాట్లు, పక్కన ఖాళీ స్థలంలో గ్రామస్తులంతా భోజనం చేసే విధంగా ఏర్పాట్లపై కలెక్టరు, సీపీ జోయల్ డేవిస్, ఏసీపీ రామేశ్వర్, అధికారిక, ప్రజాప్రతినిధులతో చర్చించారు. వన భోజనాల వద్ద మహిళలకు, పురుషులకు వేర్వేరుగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. అనంతరం గ్రామ శివారులో 10 ఎకరాలలో సీఎం కేసీఆర్‌తో శంకుస్థాపన చేయించనున్న బీసీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల వసతి గృహస్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు శ్రవణ్, రామలక్ష్మి, సుదర్శణ్‌రెడ్డి, శ్రీధర్, శ్రీనివాస్‌రెడ్డి, సరోజ, పలు శాఖ అధికారులు, రూరల్ తహసీల్దారు రమేష్, గ్రామ సర్పంచ్ హంసకేతన్‌రెడ్డి, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 30 ఇళ్లకు ఒక ప్రత్యేక అధికారి సిద్దిపేటరూరల్: కేసీఆర్ చింతమడక పర్యటన నేపథ్యంలో 30 ఇళ్లకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం సిద్దిపేట సమీకృత కార్యాలయంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, పలు అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో సీఎం పర్యటనను విజయవంతం చేసేలా కృషి చేయాలన్నారు. గ్రామంలో ఇటీవల చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం సర్వే చేసిన అధికారులే గ్రామస్తులకు ఇంటింటికీ వెళ్లి ఐడీ కార్డులను అందించాలన్నారు. గ్రామంలో ఉన్న 630 గృహాలకు గాను 30 ఇళ్లకు ఒక ఎంపీడీఓ, మరో ప్రత్యేక అధికారి నియమించనున్నట్లు తెలిపారు. 30 ఇళ్ల ప్రజలకు అందుబాటులో ఉంటూ స¿సమావేశం పూర్తయ్యే వరకు బాధ్యత అధికారిదేనన్నారు. అదే విధంగా పలు అధికారులతో సమీక్షించి త్వరితగతిన గ్రామంలో జరుగుతున్న పనులు, పెద్ద చెరువు సుందరీకరణపై ఇరిగేషన్ అధికారులతో చర్చించి, కావాల్సిన ప్రజెంటేషన్ సిద్ధం చేయాలని సూచించారు. సీఎం రాక సందర్భంగా సభ, సమావేశంలో ఉండాల్సిన వసతులు, అలాగే గ్రామస్తులు, వీఐపీ, మీడియా ప్రతినిధులకు భోజనాల వద్ద ఉండాల్సిన అధికారిక యంత్రాంగం వంటి అంశాలమీద చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవిందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్లోకి సీపీఎం నేతలు
సాక్షి, సిద్దిపేట: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడటంతో ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ నుంచి టీఆర్‌ఎఎస్‌లోకి వలసలు జోరుగా కొనసాగుతుండగా తాజాగా సీపీఎం పార్టీకి చెందిన 100 మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేశారు. శనివారం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. అనంతరం టీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... అందరం కలిసి పనిచేయడం ద్వారానే నిరుపేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. పేదల ఎజెండానే మన ఎజెండాగా కలిసి పనిచేద్దామని ఆయన పిలుపు నిచ్చారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో సీపీఎం పార్టీ కనుమరుగు అయ్యింది. గత ఎన్నికల్లో సీపీఎం నుంచి ఒక్క ఎమ్మెల్యే అయినా ఉండేవారు కానీ ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు బలపడుతోందని చెప్పారు. ఎంపీ ఎలక్షన్స్ లో ప్రభాకర్ రెడ్డికి భారీ మెజార్టీ కోసం కష్టపడదామని పిలుపునిచ్చారు. రాష్టంలో పోలింగ్ శాతాన్ని పెంచేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. -
బాబు చెంప చెళ్లుమనిపించిన పోరు బిడ్డలు
ప్రజల ఆకాంక్షను ఢిల్లీకి చాటిన ఉద్యమగడ్డ సిద్దిపేటను బంగారు తునక చేస్తా తెల్ల జెండా ఊపిన కిరణ్ నాడు హేళన చేశారు.. ఇప్పుడేమంటారు విజయోత్సవ సభలో హరీష్‌రావు సిద్దిపేట జోన్/సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను ఢిల్లీకి చాటిన ఘనత సిద్దిపేటదని ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. కోట్ల రూపాయలు వెచ్చించి తెలంగాణ గుండెను పిసకడానికి ప్రయత్నించిన చంద్రబాబునాయుడి చెంప చెళ్లుమనిపించింది కూడా సిద్దిపేటేనని ఆయన అన్నారు. స్థానిక పాత బస్టాండ్ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది ఈ ఉద్యమ గడ్డేనన్నారు. మొదట్లో ఇక్కడ ఉద్యమాన్ని కేసీఆర్ ప్రారంభించినప్పుడు ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారని ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. కేసీఆర్ టీడీపీ, శాసన సభ్యత్వానికి, ఉప సభాపతి పదవికి రాజీనామా చేసి ఉద్యమాన్ని పరుగులు పెట్టిస్తే కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌కు, శాసన సభ్యత్వానికి, సీఎం పదవికి రాజీనామా చేసి తెల్లజెండా ఊపేశాడన్నారు. మిలియన్ మార్చ్, సాగరహారం మొదలగు ఆందోళనలో ఉద్యమకారులు చూపెట్టిన పౌరుషం ఉద్యమానికి ఊపిరిపోసిందన్నారు. ఉద్యోగ గర్జన, ఉప ఎన్నికలతో సిద్దిపేట సత్తాచాటిందన్నారు. కిరణ్ ఒక్క పైసా ఇవ్వనని ప్రకటించినా ఈ ప్రాంత అభివృద్ధికి ఎన్నో నిధులను తీసుకొచ్చానన్నారు. సిద్దిపేటను జిల్లాగా ఏర్పాటు చేస్తామని, రైలు మార్గాన్ని ఏర్పాటు చేయిస్తామని, ప్రభుత్వ మెడికల్ కళాశాలను, యూనివర్సిటీని స్థాపిస్తామని చెప్పారు. సాగు, తాగునీళ్లతో పాటు వ్యవసాయ, పారిశ్రామిక, ఉపాధి రంగాల్లో అనూహ్యమార్పులను తీసుకొచ్చి సిద్దిపేటను బంగారు తునకగా మారుస్తానన్నారు. దీక్ష లు చారిత్రాత్మకం.. పండుగనక, ఎండా, వాన అనక 1500 రోజుల పాటు సిద్దిపేట, పాలమాకులలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్షలు జరగడం చారిత్రాత్మకమన్నారు. లక్షమంది మహిళలు దీక్షలో పాల్గొని ఉద్యమానికి స్ఫూర్తి నింపారని కొనియాడారు. పల్లె నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని తీసుకెళ్లిన కేసీఆర్, ఉద్యమం కోసం ప్రిన్సిపాల్ పదవిని వదులుకున్న నందిని సిధారెడ్డి, మాట, పాటలతో చైతన్యం తెచ్చిన దేశపతి శ్రీనివాస్, ధూంధాంలతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన రసమయి బాలకిషన్, సమైక్య సభలో ప్రాణాలకు తెగించి నినాదాలు చేసిన పోలీసు కానిస్టేబుల్స్ శ్రీనివాస్‌గౌడ్, శ్రీశైలంలు సిద్దిపేట బిడ్డలు కావడం అదృష్టమన్నారు. మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర పోరాటం తర్వాత అంతటి విజయాన్ని సాధించిన ఘనత తెలంగాణ ఉద్యమానిదన్నారు. ప్రజలకు, నేతలకు సోయి తెప్పించిన గొప్పతనం కేసీఆర్‌ది అన్నారు. పునర్నిర్మాణంలో కూడా కేసీఆర్ ప్రధాన పాత్ర పోషిస్తారన్నారు. నందిని సిధారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, హరీష్‌రావు వ్యూహాల అమలు ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించిందని ప్రశంసించారు. జేఏసీ తూర్పు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పాపయ్య, జేఏసీ నేతలు వంగ గాలిరెడ్డి, మారెడ్డి హన్మంతరెడ్డి తదితరులు ప్రసంగించారు. -
అభివృద్ధిని నీరుగారుస్తున్న కిరణ్: హరీష్‌రావు
ఖైరతాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్పదని తెలిసే సీఎం కిరణ్ తెలంగాణ జిల్లాల్లో అభివృద్దిని నీరుగారుస్తున్నారని ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 2014 డైరీ ఆవిష్కరణకి ముఖ్యఅతిధిగా విచ్చేసి డైరీ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 2010 నుంచి తెలంగాణ జిల్లాల్లో అభివృద్ధి పథకాలు అమలుకు నోచుకోలేదని గుర్తుచేశారు. సీమాధ్రులకు 7 గంటల కరెంటు ఇస్తే, తెలంగాణ జిల్లాలకు కేవలం 5 గంటలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. కిరణ్, చంద్రబాబు కలిసి ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరన్నారు. అంతకుముందు ధూంధాం పాటలతో కళాకారులు ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సమ్మయ్య, హౌసింగ్ సీజీఎం ఆర్.జగదీష్‌బాబు, జీఎం. రమేష్, అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.మహేందర్, రవీందర్‌రెడ్డి, ఎస్.మోహన్, వెంకట్రాం రెడ్డి, టి.లింగయ్య గౌడ్, ఆర్.సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తావ్?
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడుగడుగునా అడ్డుపడుతూ.. సమైక్యాంధ్రే తన లక్ష్యం అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రాంతంలో ఏమొహం పెట్టుకొని రచ్చబండకు వస్తారో స్పష్టం చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. కరీంనగర్లో ఆదివారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రచ్చబండ పేరిట తెలంగాణలో పర్యటించే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రికి ఈ ప్రాంతంలో అడుగుపెట్టే నైతిక అర్హత లేదన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం దృష్ట్యా మూడు నెలలపాటు రచ్చబండను వాయిదా వేసిన సీఎం తెలంగాణలో పర్యటించాలనే దురుద్దేశంతోనే మళ్లీ ఆ కార్యక్రమాన్ని తలపెట్టారని ఆరోపించారు. ఏడాదిన్నర క్రితం జరిగిన రచ్చబండ అర్జీలు ఏమయ్యాయి, ఎన్ని నిధులు కేటాయించారు, ఏం అభివృద్ధి జరిగిందో వెల్లడించాలన్నారు. రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నా తడిసిన ధాన్యాన్ని, పత్తిని కొనుగోలు చేయడం లేదని, సీసీఐ జాడే లేదని తెలిపారు. సమస్యలతో సతమతమవుతున్న తెలంగాణ రైతుల బాధలు పట్టని ముఖ్యమంత్రి రచ్చబండ పేరిట ఎందుకు అడుగుపెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘తెలంగాణకు ఏం చేశారని మీ మోహం చూడమంటారు.. అసెంబ్లీ సాక్షిగా ఒక్క పైసా కూడా ఇవ్వను రాసిపెట్టుకో అంటూనే.. చిత్తూరు జిల్లాకు రూ.5,800 కోట్ల నిధులను తీసుకెళ్లినందుకా? రెండో మెడికల్ కాలేజీని సైతం చిత్తూరులో పెట్టుకున్నందుకా? తెలంగాణ రైతులకు ఒక్క పైసా ఇవ్వకుండా సీమాంధ్రలో పై-లీన్ తుపాను బాధితులకు కోట్లు కేటాయించినందుకా? నీ మొహం చూసేది..’ అని ప్రశ్నించారు. సమైక్యవాదులను తెలంగాణలో తిరగనివ్వమన్న మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు మాటకు కట్టుబడి ఉండాలని కోరారు. ఇటీవల నల్లగొండకు వచ్చిన వైఎస్.విజయమ్మను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు, సమైక్యరాగం ఆలపిస్తున్న ముఖ్యమంత్రిని కూడా అడ్డుకోవాలని, లేనట్టయితే ప్రజలే తగిన బుద్ధి చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు. కిరణ్‌తో రచ్చబండలో పాల్గొనే మంత్రులు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. విజయమ్మను అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు, కిరణ్‌ను ఎందుకు అడ్డుకోరు..? విజయమ్మకో న్యాయం, కిరణ్‌కో న్యాయమా? అంటూ ప్రశ్నించారు. -
తెలంగాణను అడ్డుకునేందుకు బాబు యాత్ర
చిన్నకోడూరు, న్యూస్‌లైన్: జాతిని... తెలుగు భాషను అడ్డుపెట్టుకుని తెలంగాణ సంపదను దోచుకోవడానికి సీమాంధ్ర పెట్టుబడి దారులు కుట్రలు పన్నుతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగబోదన్నారు. సోమవారం చిన్నకోడూరు మండల కేంద్రంలో వివిధ పార్టీల కార్యకర్తలు హరీష్‌రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగు తల్లి ఎప్పటికీ తెలంగాణ ప్రజలకు సవతి తల్లిలానే ఉంటుందన్నారు. సకల జనుల సమ్మెతో తెలంగాణలో తీవ్రమైన ఉద్యమాన్ని చేపడితే స్పందించని చంద్రబాబు ఎందుకు స్పందించలేదన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన నిలవాల్సిన ఆయన, సీమాంధ్రలో పెట్టుబడిదారులకు మద్దతుగా బస్సు యాత్ర చేయడం తెలంగాణను అడ్డుకోవడానికేనన్నారు. ఆయన కేవలం సీమాంధ్ర పక్షపాతిగానే మిగాలారన్నారు. తెలంగాణ కోసం 12 ఏళ్లుగా పోరాటం చేస్తున్న కేసీఆర్‌ను ఈ రోజు సీమాంధ్రలో విలన్‌గా చిత్రీకరిస్తున్నారన్నారు. తెలంగాణ సంపదను దోచుకోవడానికి సీమాంద్ర పార్టీల నేతలంతా ఏకమై సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో నోటికాడి బుక్కను ఎత్తగొట్టే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమన్న అన్ని పార్టీలు...తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం కేంద్రం ప్రకటన చేసిన తర్వాత రూటు మార్చాయన్నారు. తెలంగాణ భూములు, గనులు, వనరులు తెలంగాణ ప్రాంతానికే దక్కాలన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష సాకారం అవుతున్న సమయంలో చంద్రబాబు తన కుటిల నీతిని బయట పెట్టాడన్నారు. తెలంగాణ ప్రజలను వంచించడానికి ఆత్మవంచన యాత్ర చేస్తున్నాడన్నారు. కార్యక్రమంలో నాయకులు రాధాకృష్ణ శర్మ, కుంట వెంకట్‌రెడ్డి, కూర మాణిక్యరెడ్డి, పరకాల మల్లేశంగౌడ్, నముండ్ల రాంచంద్రం, కాముని ఉమేష్చంద్, సామల మధు, సురేందర్‌రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
సర్కారీ వైద్యం ఘోరం
సిద్దిపేట, న్యూస్‌లైన్: సిద్దిపేట సెగ్మెంట్లో సర్కారీ వైద్య శాలల పనితీరు ఎంత ఘోరంగా ఉందో ఎమ్మెల్యే సాక్షిగా బయటపడింది. నంగునూరు పీహెచ్‌సీని సోమవారం ఉదయం ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీ చేసినప్పుడు డాక్టర్లు, సిబ్బంది లేకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నంగునూరు, చిన్నకోడూరు, పుల్లూరు, నారాయణరావుపేట పీహెచ్సీ కింద ఉండే ఉప కేంద్రాల వారీగా ఆయన డాక్టర్లు, సూపర్వైజర్లు, 104 ఉద్యోగులతో చర్చించారు. బాగా పని చేస్తున్న వారిని ఆయన అభినందిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీలో ఇంత ఉదాసీనత తగదు... మనమున్నది పేదలకు మేలు చేయడానికి ఇకనైనా నిబద్ధతతో పని చేయండంటూ’ హెచ్చరించారు. స్థానికంగా ఉండని సిబ్బంది హెచ్ఆర్ఏను నిలిపివేసి జహీరాబాద్, నారాయణఖేడ్‌కు బదిలీ చేస్తామని హెచ్చరించారు. రెండునెలల్లో పనితీరు మార్చుకోవాలన్నారు. ఎంసీహెచ్‌లో అందుతున్న సేవల్ని నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఎమ్మెల్యే ఎంసీహెచ్ వైద్యురాలు అరుణ, ఎస్పీహెచ్ఓ, క్లస్టర్ ఇన్చార్జి శివానందం, వైద్యాధికారి కాశీనాథ్‌లను అభినందించారు. ఎమ్మెల్యే తనిఖీలో దృష్టికి వచ్చిన పలు సమస్యలను కమిషనర్ అనూరాధ, డీఎంఅండ్‌హెచ్‌ఓ రంగారెడ్డితో ఫోన్లో మాట్లాడి చర్చించారు. సిద్దిపేట సెగ్మెంట్లో ప్రభుత్వ వైద్యశాలల దుస్థితిని వివరించారు. సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైద్యవిధాన పరిషత్ సేవలు దిగజారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజారోగ్యాన్ని మంత్రులు, ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. -
తెలంగాణ వస్తేనే బతుకు
రాయికల్/రామడుగు, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఆ ప్రాంత ప్రజల బతుకులు మారతాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన సింగపూర్‌లో తెలంగాణవాసులు ఏర్పాటు చేసిన తెలంగాణ కల్చరల్ సొసైటీ సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ పోరాటం, అమరుల త్యాగ ఫలితంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతోందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ప్రజల బతుకులు మారతాయని చెప్పారు. అప్పుడు ప్రజలు సింగపూర్, దుబాయ్, మస్కట్ తదితర దేశాలకు వెళ్లనవసరం లేదన్నారు. సోనియాగాంధీ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూల ప్రకటన చేశారని, సీమాంధ్ర నాయకులు ఎన్ని పన్నాగాలు పన్నినా తెలంగాణ ఏర్పాటు ఆగదని స్పష్టం చేశారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసే బాధ్యత తెలంగాణ ఎంపీలపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ కవి, కళాకారుడు గోరేటి వెంకన్న, రసమయి బాలకిషన్, గంగ, మిమిక్రీ కళాకారుడు శ్రీనివాస్, భిక్షునాయక్, బండ మాధవరెడ్డి, మహేందర్, చంద్రశేఖర్‌రెడ్డి, గంగుల భాస్కర్‌రెడ్డి, ప్రవీణ్, వినోద్‌రెడ్డి, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
తేడా వస్తే తెలంగాణను స్తంభింపజేస్తాం
నంగునూరు, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే తొమ్మిది జిల్లాల ప్రజలను ఏకం చేసి తెలంగాణను స్తంభింపజేస్తామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. 12 సంవత్సరాలు శాంతియుతంగా పోరాడి కేసీఆర్ తె లంగాణ తెస్తే.. సీమాంధ్రలో కొందరు నాయకులు అల్లర్లు సృష్టించడానికి డబ్బులిచ్చి కేసీఆర్ బొమ్మలు తగలబెట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. నంగునూరులో పలు పార్టీలకు చెందిన వంద మంది బుధవారం హరీష్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యూపీఏ ఇస్తామన్న తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్రులు కుట్రలు పన్నుతున్నారన్నారు. చంద్రబాబు, లగడపాటి, కేవీపీలు డబ్బులు పెట్టి ఉద్యమాల పేరిట అల్లర్లు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. అందరు మనవారే అభివృద్ధికి పాటు పడండి తెలంగాణ కోసం పోరాడిన ప్రజలు గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని హరీష్‌రావు పిలుపు నిచ్చారు. ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరూ తెలంగాణ వారేననీ, విభేదాలు పక్కన పెట్టి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పార్టీలకు అతీతంగా పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో రమేశ్‌గౌడ్, మల్లయ్య, సారయ్య, వెంకట్‌రెడ్డి, రాజనర్సు, రవీందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, తుంగ కనుకయ్య, మణిచారి, కనుకయ్య, రాంరెడ్డి, దేవులపల్లి రాజమౌళి, బడే రాజయ్య పాల్గొన్నారు.