సర్కారీ వైద్యం ఘోరం
Published Wed, Aug 21 2013 12:39 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
సిద్దిపేట, న్యూస్‌లైన్: సిద్దిపేట సెగ్మెంట్‌లో సర్కారీ వైద్య శాలల పనితీరు ఎంత ఘోరంగా ఉందో ఎమ్మెల్యే సాక్షిగా బయటపడింది. నంగునూరు పీహెచ్‌సీని సోమవారం ఉదయం ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీ చేసినప్పుడు డాక్టర్లు, సిబ్బంది లేకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నంగునూరు, చిన్నకోడూరు, పుల్లూరు, నారాయణరావుపేట పీహెచ్‌సీ కింద ఉండే ఉప కేంద్రాల వారీగా ఆయన డాక్టర్లు, సూపర్‌వైజర్లు, 104 ఉద్యోగులతో చర్చించారు. బాగా పని చేస్తున్న వారిని ఆయన అభినందిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీలో ఇంత ఉదాసీనత తగదు... మనమున్నది పేదలకు మేలు చేయడానికి ఇకనైనా నిబద్ధతతో పని చేయండంటూ’ హెచ్చరించారు.
స్థానికంగా ఉండని సిబ్బంది హెచ్‌ఆర్‌ఏను నిలిపివేసి జహీరాబాద్, నారాయణఖేడ్‌కు బదిలీ చేస్తామని హెచ్చరించారు. రెండునెలల్లో పనితీరు మార్చుకోవాలన్నారు. ఎంసీహెచ్‌లో అందుతున్న సేవల్ని నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఎమ్మెల్యే ఎంసీహెచ్ వైద్యురాలు అరుణ, ఎస్‌పీహెచ్‌ఓ, క్లస్టర్ ఇన్‌చార్జి శివానందం, వైద్యాధికారి కాశీనాథ్‌లను అభినందించారు. ఎమ్మెల్యే తనిఖీలో దృష్టికి వచ్చిన పలు సమస్యలను కమిషనర్ అనూరాధ, డీఎంఅండ్‌హెచ్‌ఓ రంగారెడ్డితో ఫోన్‌లో మాట్లాడి చర్చించారు. సిద్దిపేట సెగ్మెంట్‌లో ప్రభుత్వ వైద్యశాలల దుస్థితిని వివరించారు. సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైద్యవిధాన పరిషత్ సేవలు దిగజారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజారోగ్యాన్ని మంత్రులు, ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
Advertisement