తెలంగాణను అడ్డుకునేందుకు బాబు యాత్ర | chandra babu planned bus yatra to stop telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణను అడ్డుకునేందుకు బాబు యాత్ర

Published Tue, Sep 3 2013 12:36 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM

chandra babu planned bus yatra to stop telangana

 చిన్నకోడూరు, న్యూస్‌లైన్: జాతిని... తెలుగు భాషను అడ్డుపెట్టుకుని తెలంగాణ సంపదను దోచుకోవడానికి సీమాంధ్ర పెట్టుబడి దారులు కుట్రలు పన్నుతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగబోదన్నారు. సోమవారం చిన్నకోడూరు మండల కేంద్రంలో వివిధ పార్టీల కార్యకర్తలు హరీష్‌రావు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగు తల్లి ఎప్పటికీ తెలంగాణ ప్రజలకు సవతి తల్లిలానే ఉంటుందన్నారు. సకల జనుల సమ్మెతో తెలంగాణలో తీవ్రమైన ఉద్యమాన్ని చేపడితే స్పందించని చంద్రబాబు ఎందుకు స్పందించలేదన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన నిలవాల్సిన ఆయన, సీమాంధ్రలో పెట్టుబడిదారులకు మద్దతుగా బస్సు యాత్ర చేయడం తెలంగాణను అడ్డుకోవడానికేనన్నారు. ఆయన కేవలం సీమాంధ్ర పక్షపాతిగానే మిగాలారన్నారు.
 
 తెలంగాణ కోసం 12 ఏళ్లుగా పోరాటం చేస్తున్న కేసీఆర్‌ను  ఈ రోజు  సీమాంధ్రలో విలన్‌గా చిత్రీకరిస్తున్నారన్నారు. తెలంగాణ సంపదను దోచుకోవడానికి సీమాంద్ర పార్టీల నేతలంతా ఏకమై సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో నోటికాడి బుక్కను ఎత్తగొట్టే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ,   ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమన్న అన్ని పార్టీలు...తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం కేంద్రం ప్రకటన చేసిన తర్వాత రూటు మార్చాయన్నారు. తెలంగాణ భూములు, గనులు, వనరులు తెలంగాణ ప్రాంతానికే దక్కాలన్నారు.  తెలంగాణ ప్రజల ఆకాంక్ష సాకారం అవుతున్న సమయంలో చంద్రబాబు తన కుటిల నీతిని బయట పెట్టాడన్నారు.  తెలంగాణ ప్రజలను వంచించడానికి ఆత్మవంచన యాత్ర చేస్తున్నాడన్నారు. కార్యక్రమంలో నాయకులు రాధాకృష్ణ శర్మ, కుంట వెంకట్‌రెడ్డి, కూర మాణిక్యరెడ్డి, పరకాల మల్లేశంగౌడ్, నముండ్ల రాంచంద్రం, కాముని ఉమేష్‌చంద్, సామల మధు, సురేందర్‌రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement