ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తావ్?
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడుగడుగునా అడ్డుపడుతూ.. సమైక్యాంధ్రే తన లక్ష్యం అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రాంతంలో ఏమొహం పెట్టుకొని రచ్చబండకు వస్తారో స్పష్టం చేయాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో ఆదివారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రచ్చబండ పేరిట తెలంగాణలో పర్యటించే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రికి ఈ ప్రాంతంలో అడుగుపెట్టే నైతిక అర్హత లేదన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం దృష్ట్యా మూడు నెలలపాటు రచ్చబండను వాయిదా వేసిన సీఎం తెలంగాణలో పర్యటించాలనే దురుద్దేశంతోనే మళ్లీ ఆ కార్యక్రమాన్ని తలపెట్టారని ఆరోపించారు. ఏడాదిన్నర క్రితం జరిగిన రచ్చబండ అర్జీలు ఏమయ్యాయి, ఎన్ని నిధులు కేటాయించారు, ఏం అభివృద్ధి జరిగిందో వెల్లడించాలన్నారు.
రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నా తడిసిన ధాన్యాన్ని, పత్తిని కొనుగోలు చేయడం లేదని, సీసీఐ జాడే లేదని తెలిపారు. సమస్యలతో సతమతమవుతున్న తెలంగాణ రైతుల బాధలు పట్టని ముఖ్యమంత్రి రచ్చబండ పేరిట ఎందుకు అడుగుపెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘తెలంగాణకు ఏం చేశారని మీ మోహం చూడమంటారు.. అసెంబ్లీ సాక్షిగా ఒక్క పైసా కూడా ఇవ్వను రాసిపెట్టుకో అంటూనే.. చిత్తూరు జిల్లాకు రూ.5,800 కోట్ల నిధులను తీసుకెళ్లినందుకా? రెండో మెడికల్ కాలేజీని సైతం చిత్తూరులో పెట్టుకున్నందుకా? తెలంగాణ రైతులకు ఒక్క పైసా ఇవ్వకుండా సీమాంధ్రలో పై-లీన్ తుపాను బాధితులకు కోట్లు కేటాయించినందుకా? నీ మొహం చూసేది..’ అని ప్రశ్నించారు.
సమైక్యవాదులను తెలంగాణలో తిరగనివ్వమన్న మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు మాటకు కట్టుబడి ఉండాలని కోరారు. ఇటీవల నల్లగొండకు వచ్చిన వైఎస్.విజయమ్మను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు, సమైక్యరాగం ఆలపిస్తున్న ముఖ్యమంత్రిని కూడా అడ్డుకోవాలని, లేనట్టయితే ప్రజలే తగిన బుద్ధి చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు. కిరణ్‌తో రచ్చబండలో పాల్గొనే మంత్రులు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. విజయమ్మను అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు, కిరణ్‌ను ఎందుకు అడ్డుకోరు..? విజయమ్మకో న్యాయం, కిరణ్‌కో న్యాయమా? అంటూ ప్రశ్నించారు.