సభను వాయిదా వేస్తే ఊరుకోం: హరీష్రావు
హైదరాబాద్: వాయిదాలతో శాసనసభ నడపటం అప్రజాస్వామికమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. టీడీపీ డబుల్ గేమ్ ఆడటం సరైందికాదన్నారు. బీహార్, యూపీ, మధ్యప్రదేశ్లో విభజన బిల్లుపై రెండ్రోజుల్లోనే చర్చ ముగించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించడానికి 42 రోజులు అవసరమా అని ప్రశ్నించారు. నెలాఖరులోగా చర్చ పూర్తిచేసి బిల్లు రాష్ట్రపతికి పంపాలని డిమాండ్ చేశారు.
బిల్లుపై చర్చ పూర్తిచేయించే బాధ్యత తెలంగాణ మంత్రులదే అన్నారు. బిల్లుపై చర్చ జరగనీయకుండా సభను వాయిదా వేస్తే ఊరుకోబోమని హరీష్రావు హెచ్చరించారు. బిల్లులో తమకు కూడా కొన్ని అభ్యంతరాలున్నాయని తెలిపారు. వాయిదాలు వేసి తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని కోరారు. స్పీకర్ ఒత్తిడికి గురికావొద్దని సూచించారు. చర్చను అడ్డుకునే సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలను ఆయ పార్టీల నాయకులు కట్టడి చేసుకోవాలన్నారు.