T Harsih Rao
-
కేసీఆర్, హరీశ్‌లు నాపై పోటీ చేయగలరా?
జమ్మికుంట: హుజూరాబాద్ ఉపఎన్నికల్లో సీఎం కేసీఆర్‌గానీ, మంత్రి హరీశ్‌రావుగానీ తనపై పోటీ చేయగలరా అని మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో పోలీసుల దౌర్జన్యానికి చరమగీతం తప్పదని హెచ్చరించారు. జమ్మికుంటలో శనివారం జరిగిన జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి విశ్వకర్మల ఆత్మీ య సత్కార సభలో ఈటల పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులకు స్వేచ్ఛ లేదని, బానిసలుగా ఉండాల్సిందేనని, తాను మం త్రిగా ఉన్నప్పుడు కూడా తాళంచెవి ఆయన చేతిలోనే ఉండేదని ఆరోపించారు. ‘మీరు మంత్రులే అయితే.. మీ నియోజకవర్గాల్లో పింఛన్లు ఇప్పించండి’అంటూ సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ పేదల పక్షాన లేరని, అక్రమ సంపాదనలో ఆయన పూర్తిగా మునిగిపోయి ఉన్నోళ్లకే కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ఆర్థికమంత్రిగా ఉన్న హరీశ్‌రావుకు ఒక్క బిల్లు ఇచ్చే అధికారమైనా ఉందా అని నిలదీశారు. కంపెనీ నగలు వచ్చిన తర్వాత కంసాలివృత్తి మాయమైందని, కులవృత్తులు లేవని ఉద్యోగం చేద్దామనుకుంటే ఉద్యోగాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.500 కోట్లు బడ్జెట్ పెట్టినా..కులవృత్తులకు ఒక్క రూపాయి కూడా విదిల్చలేదని ఆయన విమర్శించారు. -
గ్రేటర్లో గెలవాల్సిందే
సాక్షి, హైదరాబాద్ : ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు నేడో రేపో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఓటరు తుది జాబితా కూడా శుక్రవారం వెలువడుతున్నందున ఎన్నికలకు పార్టీపరంగా పూర్తి సన్నద్ధంగా ఉండటంతో పాటు గెలుపే లక్ష్యంగా పనిచేయాలి’అని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ యంత్రాంగానికి పిలుపునిచ్చారు. మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కొం దరు ముఖ్యనేతలతో గురువారం ప్రగతిభవన్‌లో సీఎం భేటీ అయ్యారు. మధ్యా హ్నం 2 గంటల నుంచి దాదాపు ఆరున్నర గంటలపాటు సాగిన ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు మొదలుకుని రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేశారు. వివిధ అంశాలకు సంబంధించి పలుమార్లు మంత్రులు, పార్టీ నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ‘గ్రేటర్ ఎన్నికల్లో డివిజన్లవారీగా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలకు ఇన్‌చార్జీలుగా బాధ్యతలు అప్పగిస్తాం. ఇప్పటికే డివిజన్లవారీగా పార్టీ ఇన్చార్జీల జాబితా కూడా సిద్ధం చేశాం. జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ పటిష్ట స్థితిలో ఉన్నట్లు అంతర్గత సర్వేల్లో వెల్లడైంది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి’అని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెలకొన్న వివిధ సమస్యలను ప్రస్తావించడంతో పాటు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన నగర అభివృద్దిని సుదీర్ఘంగా నేతలకు వివరించారు. బెంబేలు పడాల్సిన అవసరం లేదు ‘దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం చూసి అధైర్యపడొద్దు. గాలివాటు గెలుపును చూసి గాభరా చెందాల్సిన అవసరం లేదు. మనకు పటిష్టమైన పార్టీ యం త్రాంగం, బలమైన నేతలు ఉన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్దాం. 2016లో జరిగిన గ్రేటర్ ఎన్నికల ఫలి తాల మాదిరిగానే ఈ దఫా కూడా పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుంది. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను చాలా వరకు నెరవేర్చాం. రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు రూ.60వేల కోట్లకు పైగా నిధులను ఐదేళ్లలో ఖర్చు చేశాం. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ ఇన్చార్జీలు కీలకంగా వ్యవహరించాలి. డివిజన్ల వారీగా క్షేత్ర స్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తల నడుమ సమన్వయంపై ఇన్చార్జీలు ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది’అని మంత్రులు, పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాన్ని సీఎం వివరించినట్లు సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాధ్యత తీసుకోవాలని.. ఎవరికీ మినహాయింపులు ఉండవని సీఎం స్పష్టంచేశారు. కాగా, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేదిగా ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్టు తెలిసింది. ‘అభూతకల్పనలు, అవాస్తవాలు ప్రచారం చేయడంతో పాటు అభ్యర్థులు, నాయకుల వ్యక్తిత్వం కించపరిచేలా విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. దీనిని అరికట్టాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంటుంది. అ దిశగా ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తేవాల్సిన అవసరముంది’అని కేసీఆర్ పేర్కొన్నట్టు సమాచారం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై చర్చ శుక్రవారం సాయంత్రం జరిగే మంత్రిమండలి సమావేశంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై చర్చిస్తామని సీఎం వెల్లడించినట్లు తెలిసింది. దివంగత నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్ పదవీ కాలపరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నాటికే శాసనమండలిలో గవర్నర్ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కర్నె ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న, దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణిదేవి, టి.రవీందర్రావు తదితరుల పేర్లు వినిపిస్తుండగా.. శుక్రవారం కేబినెట్ భేటీలో వీటిపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. గోరటి వెంకన్న పేరు ఇప్పటికే ఖరారు కాగా, మరో రెండు స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై ఔత్సాహిక నేతల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా, శాసనమండలి రెండు పట్టభద్రుల కోటా స్థానాల్లో ఓటరు నమోదు జరిగిన తీరును కూడా సీఎం కేసీఆర్ గురువారం జరిగిన సమావేశంలో ప్రస్తావించారు. శాసనమండలి పట్టభద్రుల కోటా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా దిశానిర్దేశం చేశారు. అలాగే ధరణి పోర్టల్, సన్నరకం వడ్లు తదితర అంశాలను కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. మరోవైపు మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం ముగిసిన తర్వాత ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రగతిభవన్‌లో సీఎంతో భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోణంలో ఈ భేటీ జరిగి ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దుబ్బాకపై సీఎంకు హరీశ్ నివేదిక.. దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి గురువారం జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రస్తావన, సమీక్ష చేయలేదని సమాచారం. అయితే దుబ్బాక ఉప ఎన్నిక ప్రచార బాధ్యతను ఒంటిచేత్తో నిర్వహించిన ఆర్దికశాఖ మంత్రి హరీశ్‌రావు.. సమావేశం ప్రారంభానికి ముందే సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలిసింది. దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించిన అన్ని అంశాలను సీఎం కేసీఆర్‌కు ఆయన వివరించినట్లు సమాచారం. అభ్యర్థి ఎంపిక మొదలు పార్టీ పరంగా జరిగిన ప్రచారం, విపక్షాలు.. ప్రత్యేకించి బీజేపీ అనుసరించిన విధానాలు, స్థానిక పరిస్థితులు తదితరాలపై సీఎంకు నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. -
సంక్షేమం ఆగదు..
ఆర్థిక మాంద్యం నెలకొన్నా సీఎం కేసీఆర్ సూచనల మేరకు సంక్షేమానికి నిధులు కేటాయించాం. ఈ బడ్జెట్ ద్వారా ఆసరా పెన్షనర్లు, కల్యాణలక్ష్మి లబ్ధిదారులు, రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థులు పెరుగుతున్నారన్న విషయాన్ని ప్రజలు, ఇతర పార్టీలు గ్రహించాలి. తొలిసారిగా రాష్ట్ర ఖజానా నుంచి దేవాలయాల అభివృద్ధికి రూ.500కోట్ల నిధుల కేటాయింపు ఘనత మాకే దక్కుతుంది. సాక్షి, హైదరాబాద్: డబ్బులకు వెనుకాడకుండా పేదలే ఎజెండాగా, ప్రజలే కేంద్ర బిందువుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆర్థిక మంత్రి టి. హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రతి ఇంటా సౌభాగ్యం, ప్రతి కంట్లో సంతోషం చూడాలన్నదే తమ లక్ష్యమన్నారు. ప్రపంచం ఆగ మయినా, దేశంలో ఏం జరిగినా, ఎంత కష్టమొచ్చినా రాష్ట్రంలో సంక్షేమం ఆగదని తేల్చి చెప్పారు. తమ బడ్జెట్ ప్రజలను సంతోషపెట్టిందని, కాంగ్రెస్‌ను మాత్రం నిరాశపరిచిందని ఎద్దే వా చేశారు. ప్రతిపక్షం చెబుతున్నట్లు ఈ బడ్జెట్ ప్రజలను భ్రమల్లోకి నెట్టలేదని, కాంగ్రెస్ నేత ల భ్రమలను బద్దలు కొట్టిందన్నారు. 2020– 21 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చర్చ అనంతరం ప్రభుత్వ పక్షాన హరీశ్‌రావు గురువారం అసెంబ్లీలో సమాధానమిచ్చారు. దాదాపు రెండు గంటలపాటు సాగిన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను, విధానాలను, ఐదున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించారు. హరీశ్ బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... మాంద్యంలోనూ సంక్షేమానికి నిధులు... ‘‘ఆర్థిక మాంద్యం నెలకొన్నా సీఎం కేసీఆర్ సూచనల మేరకు సంక్షేమానికి నిధులు కేటాయించాం. ఈ బడ్జెట్ ద్వారా ఆసరా పెన్షనర్లు, కల్యాణలక్ష్మి లబ్ధిదారులు, రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థులు పెరుగుతున్నారన్న విషయాన్ని ప్రజలు, ఇతర పార్టీలు గ్రహించాలి. తొలిసారి గా రాష్ట్ర ఖజానా నుంచి దేవాలయాల అభివృద్ధికి రూ. 500 కోట్ల నిధుల కేటాయింపు ఘనత మాకే దక్కుతుంది. హైదరాబాద్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎం ఎన్నిసార్లు కేంద్రానికి లేఖలు రాసినా, స్వయంగా ఢిల్లీ వెళ్లి కోరినా ప్రయోజనం లేకపోవడంతో ఈసారి బడ్జెట్లో రూ. 10 వేల కోట్లను హైదరాబాద్ అభివృద్ధికి కేటాయించాం. రైతు సంక్షేమం కోసం రైతు బంధు నిధులు పెంచడంతోపాటు మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. రైతు బీమా బడ్జెట్ పెంచడంతోపాటు రైతు వేదికలు ఏర్పాటు చేసి నిధులు కేటాయించాం. కాంగ్రెస్‌ది కరెంటు బంద్ ప్రభుత్వం... విద్యుత్‌రంగ అభివృద్ధి లెక్కలు చెబితే కాంగ్రెస్ నేతలు పశ్చాత్తాపపడక తప్పదు. ఎంత డిమాండ్ ఉన్నా కనురెప్పపాటు కూడా కరెంటు పోకుండా విద్యుత్ సరఫరా చేస్తున్న ప్రభుత్వం మాది. కాంగ్రెస్ పార్టీది కరెంటు బంద్ ప్రభు త్వమైతే మాది రైతు బంధు ప్రభుత్వం. దేశంలోనే ప్రజారోగ్యం అందిస్తున్న మూడు రాష్ట్రా ల్లో తెలంగాణ ఒకటి. గతంలో రాష్ట్రంలో ఒక్క డయాలసిస్ సెంటర్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు 40కిపైగా ఏర్పాటు చేశాం. జిల్లాకు నాలుగైదు ఐసీయూ యూనిట్లు పెట్టాం. కేసీఆర్ పేదల మనిషి... ఎన్నికలకు ముందు వరాలివ్వడం, ఆ తర్వాత మర్చిపోవడం మా విధానం కాదు. మేము ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా కల్యాణలక్ష్మి, రైతు బంధు, మిషన్ కాకతీయ లాంటి పథకాలను అమలు చేస్తున్నాం. ఎన్నికలు, ఓట్లు, సీట్ల కోసం పనిచేసే వ్యక్తి సీఎం కేసీఆర్ కాదు. ఆయన పేదల మనిషి. మానవీయకోణంలో ప్రజల కష్టాలను దగ్గరగా చూసిన మనిషి. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సిద్దిపేట పరిధిలోని ఇమాంబాద్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వచ్చి తన అల్లుడు కట్నంగా సైకిల్ అడుగుతున్నాడని, అది ఇవ్వకపోతే కూతురు పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఉందని చెబితే వెంటనే సైకిల్ ఇచ్చి పంపించిన హృదయం కేసీఆర్‌ది. అందుకే ఆయన సూచనల మేరకు ఈసారి బడ్జెట్లో కల్యాణలక్ష్మికి రూ. 700 కోట్లు పెంచాం. ఓవర్సీస్ స్కాలర్షిప్, రుణమాఫీ, గుడుంబా నిర్మూలన, పునరావాసం, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేసిన ఘనత టీఆర్ఎస్దే. గృహ నిర్మాణ రుణాల మాఫీ, నీటి తీరువా రద్దు, తాటి చెట్లపై పన్ను రద్దు, చేనేత రుణాలు, ఆటో, ట్రాక్టర్లపై పన్ను మినహాయింపు, ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సెలూన్లకు డొమెస్టిక్ కేటగిరీ వర్తింపు, నివాస స్థలాల క్రమబద్ధీకరణ, సాదాబైనామాల పరిష్కారం లాంటి చాలా కార్యక్రమాలను ప్రజల కోసం చేశాం. పన్నేతర ఆదాయంపై క్లారిటీ ఉంది.. పన్నేతర ఆదాయం పెంచుకొనే విషయంలో మాకు క్లారిటీ ఉంది. వాణిజ్య పన్నుల శాఖలో అపరిష్కృత కేసుల వన్‌టైం సెటిల్మెంట్, మైనింగ్, ఇసుక కొత్త పాలసీ, కోకాపేటలో గెలిచిన భూముల అమ్మకం, పరిశ్రమలకు లీజుకిచ్చిన భూముల క్రమబద్ధీకరణ ద్వారా అదన పు ఆదాయాన్ని సమకూర్చుకుంటాం. ఈ విషయంలో కాంగ్రెస్‌కు అనుమానాలు అక్కర్లేదు. అభివృద్ధి ప్రజలకు కనపడుతున్నందునే ప్రతి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తున్నారు. మూసీ నది పాపం, పుణ్యం కాంగ్రెస్‌దే. ఆ కంపును వదిలించేందుకు మేము కంకణం కట్టుకున్నాం. ఈ విషయంలో కాంగ్రెస్ చెంపలేసుకొని క్షమాపణలు చెప్పాలి. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్‌ది ద్వంద్వ వైఖరి. అవసరమైతే అప్పులు మరిన్ని తెచ్చయినా ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తాం. కాంగ్రెస్‌లాగా సంకుచిత ధోరణులు మాకు ఉండవు. ఎఫ్ఆర్బీఎం చట్టానికి అనుగుణంగానే అప్పులు తెస్తున్నాం. ఈ విషయంలో ఎక్కడా పరిధి దాటట్లేదు. అప్పులతోపాటు జీఎస్డీపీ పెరిగిందని ప్రతిపక్షాలు గుర్తించాలి. కేంద్రం నిధులివ్వట్లేదు... కేంద్రం నుంచి ఆశించినంత సాయం అందట్లేదు. జీఎస్టీ, ఐజీఎస్టీ బకాయిలు, మిషన్ కాకతీయ, భగీరథ గ్రాంట్లు, వెనుకబడిన జిల్లాలకు సాయం, పన్నుల వాటా కలిపి రూ. 10 వేల కోట్లకుపైనే రావాల్సి ఉంది. అయినా ప్రజల కోసం ఖర్చుకు వెనుకాడం. మాది పేదల ప్రభుత్వం. పేదల సంక్షేమం కోసమే ప్రతిపైసా ఖర్చు పెడతాం. కాంగ్రెస్‌ది వద్దుల పార్టీ.. అందుకే ప్రజలు వద్దనుకున్నారు బడ్జెట్ గురించి కాంగ్రెస్ ఒక్క మంచి మాటయినా చెబుతుందని ఆశించాం. అయినా కాంగ్రెస్ సభ్యులు మాత్రం పాడిందే పాట పాచిపళ్ల బాట అన్న రీతిలోనే విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలు కరెంటు వద్దంటారు.. జిల్లాలు, ప్రాజెక్టులు, మిషన్ భగీర థ వద్దని చెబుతారు. అందుకే కాంగ్రెస్ వద్దు ల పార్టీ అయింది. ప్రజలు కూడా ఆ పార్టీ వద్దని రద్దు చేశారు. వరుస ఓటములతో అ యినా ఆ పార్టీకి జ్ఞానోదయం అవుతుందని ఆశించినా, అన్ని ఎన్నికల్లో ప్రజలు గుణపా ఠం చెప్పినా వారి తీరులో మార్పులేదు. ప్రజ లు కర్రుకాల్చి వాతపెడుతున్నా ఆత్మవిమర్శ చేసుకోని కాంగ్రెస్‌ను ఆ దేవుడే కాపాడాలి.’’ చదవండి: ‘అప్పుడు కరెంట్ బందు.. ఇప్పుడు రైతు బంధు’ క్షమాపణలు చెప్పిన మంత్రి పువ్వాడ -
కేసీఆర్ వరాలు.. హరీష్ చెక్కులు
సాక్షి, సిద్ధిపేట : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామం చింతమడక గ్రామస్తుల కళ సాకారమవుతోంది. చింతమడక గ్రామంలోని ప్రతి కుటుంబం స్వయం సమృద్ధి సాధించేందుకు చేయూత ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు చింతమడక గ్రామస్తులకు చెక్కులు పంపిణీ చేశారు. సిద్ధిపేటలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న హరీష్‌రావు.. కేసీఆర్ హామీ మేరకు పౌల్ట్రీ, డైరీ షెడ్ల నిర్మాణానికి రెండు లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. చింతమడక గ్రామానికి చెందిన 22 మందికి డైరీ యూనిట్లు, 87 మందికి పౌల్ట్రీ యూనిట్లుకు చెక్కులు అందాయి. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. పదిహేను రోజుల్లో షెడ్లు నిర్మించాలని లబ్ధిదారులను ఆదేశించారు. షెడ్ల నిర్మాణం పూర్తయితే పశువులు, కోళ్ల పంపిణీ చేస్తామని తెలిపారు. చింతమడకలో పాలకేంద్రం ఏర్పాటు చేసి డైరీ నడిపే వారి వద్ద నుంచి పాలు కొనుగోలు చేస్తామని అన్నారు. -
సభను వాయిదా వేస్తే ఊరుకోం: హరీష్‌రావు
హైదరాబాద్: వాయిదాలతో శాసనసభ నడపటం అప్రజాస్వామికమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. టీడీపీ డబుల్ గేమ్ ఆడటం సరైందికాదన్నారు. బీహార్, యూపీ, మధ్యప్రదేశ్‌లో విభజన బిల్లుపై రెండ్రోజుల్లోనే చర్చ ముగించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించడానికి 42 రోజులు అవసరమా అని ప్రశ్నించారు. నెలాఖరులోగా చర్చ పూర్తిచేసి బిల్లు రాష్ట్రపతికి పంపాలని డిమాండ్ చేశారు. బిల్లుపై చర్చ పూర్తిచేయించే బాధ్యత తెలంగాణ మంత్రులదే అన్నారు. బిల్లుపై చర్చ జరగనీయకుండా సభను వాయిదా వేస్తే ఊరుకోబోమని హరీష్‌రావు హెచ్చరించారు. బిల్లులో తమకు కూడా కొన్ని అభ్యంతరాలున్నాయని తెలిపారు. వాయిదాలు వేసి తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని కోరారు. స్పీకర్ ఒత్తిడికి గురికావొద్దని సూచించారు. చర్చను అడ్డుకునే సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలను ఆయ పార్టీల నాయకులు కట్టడి చేసుకోవాలన్నారు.